ప్రపంచవ్యాప్తంగా, మానసిక ఆరోగ్య సమస్యల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత దాని ప్రమాదం మరింత పెరిగింది. అన్ని వయసుల వారిలోనూ మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొందరగా బయటపడవు. ఈ కారణంగా మానసిక సంబంధ వ్యాధుల బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి భావోద్వేగ, ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. దేశంలో 60 నుండి 70 మిలియన్ల మంది ప్రజలు తేలికపాటి, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఆత్మహత్యల కేసులు కూడా పెరిగాయి. WHO డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి లక్ష మందిలో సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉంది. కాబట్టి మానసిక ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.
పిల్లలు, యువతలో పెరుగుతున్న సమస్య..
విచారించాల్సిన విషయం ఏమిటంటే భారతదేశంలోని పిల్లలు, యువత కూడా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది కనీసం తమది మానసిక సమస్య అనే విషయం గ్రహించలేని పరిస్థితులలో ఉన్నారని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సామాజంలో జరిగే తప్పుడు పనులు, పిల్లల మీద జరిగే చర్యలు, మానసిక ఆరోగ్యం పట్ల ప్రతికూల దృక్పథాలు, యువత సహాయం కోరకుండా అడ్డుపడుతున్నాయి. ఇంకా దేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ సులభంగా అందుబాటులో లేకపోవడం కూడా ఈ విషయంలో ప్రమాదాలను పెంచుతోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (NMHS) 2015-16 ప్రకారం, 18 ఏళ్లు పైబడిన వారిలో ఈ ప్రమాదం పెరుగుతోంది.
గణాంకాలు ఎలా ఉన్నాయంటే..
మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ఆన్‌లైన్ సహాయ కేంద్రముంది. ఇదే TeleManas. ఇది వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. Tele Manas Cell షేర్ చేసిన సమాచారం ప్రకారం, సహాయం కోసం కాల్ చేసేవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది 18-45 ఏళ్ల మధ్య వయస్కులే, అంటే ఈ వయస్సులో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. టెలి మనస్ అనేది నిపుణుల నుండి మానసిక ఆరోగ్య సంబంధిత సహాయాన్ని పొందడానికి దేశంలోని ఏ మూల నుండి అయినా కాల్ చేయగల టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్. దీని కోసం 14416 లేదా 18008914416 నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు.
యువతలో సమస్యలు..
టెలి మనస్ పంచుకున్న డేటా ప్రకారం, యువత జనాభాలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. 12 ఏళ్లలోపు పిల్లల్లో మేధో వైకల్యం, దృష్టి లోపం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పరీక్ష సంబంధిత ఒత్తిడి, కోపం సమస్యలు, ప్రవర్తన లోపాలు డిప్రెషన్ కేసులు 13-18 సంవత్సరాల వయస్సులో కనిపిస్తున్నాయి. అదే సమయంలో, 18-45 సంవత్సరాల వయస్సు గల వారిలో డిప్రెషన్, ఆందోళన, కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి కారణాలు ఉంటాయి.
వృద్ధులలో సమస్యలు..
46-60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో మానసిక ఆరోగ్య రుగ్మతల కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. ఈ వయస్సులో చాలా మంది డిమెన్షియాతో పాటు డిప్రెషన్, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. అదే సమయంలో 60 ఏళ్లు దాటిన వారిలో డిమెన్షియా, జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఏ వయసు వారికి ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందో తెలుసుకుని వాటిని పరిష్కరించడం వల్ల మన కుటుంబంలోని వారే డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
*నిశ్శబ్ద.