శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  ప్రతి సమస్యను తగ్గించుకోగానే మరొక సమస్య రెఢీ అవుతూ ఉంటుంది.  అన్నింటి కంటే ముఖ్యంగా చలి కారణంగా శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం కోసం చాలామంది అల్లం, వెల్లుల్లి, తులసి వంటి ఔషద గుణాలు ఉన్న పదార్థాలు బాగా వాడుతుంటారు.  అయితే శీతాకాలంలో తులసి టీ తయారు చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..

తులసి అద్బుతమైన మూలిక..

తులసి అద్బుతమైన మూలిక అనే విషయం అందరికీ తెలిసిందే. తులసికి ఆయుర్వేదం నుండి అన్ని రకాల వైద్యాలలో చాలా ప్రాముఖ్యత ఉంది.  తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా మార్చడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఆరోగ్య సంరక్షణ కోసం తులసిని పుష్కలంగా వాడవచ్చు.

సీజన్ సమస్యలకు చెక్..

వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే ముక్కు దిబ్బడ,  దగ్గు,  గొంతు నొప్పి వంటి సీజన్ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో తులసి టీ చాలా బాగా సహాయపడుతుంది.

శ్వాస సమస్యలు..

చలికాలంలో చల్లని గాలుల కారణంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు శీతాకాలంలో విజృంభిస్తుంటాయి.  ఈ సమస్యల కు చెక్ పెట్టడానికి తులసి చాలా బాగా పనిచేస్తుంది.

చర్మానికి తులసి..

తులసిలో వేడి గుణాలు ఉంటాయి.  తులసిని తీసుకున్నప్పుడు శరీరంలో వేడి పుడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగ్గా ఉంచుతుంది. చలి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

పొట్ట ఆరోగ్యం..

తులసి టీ తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం,  బరువు తగ్గడం,  కడుపు నొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.  పొట్ట ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

షుగర్ సమస్య

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండేవారు రెగ్యులర్ గా తులసి టీ తాగుతూ ఉంటే సుగర్ లెవల్స్ క్రమంగా నియంత్రణలోకి వస్తాయట. తులసిలో ఉండే ఔషద గుణాలు జీవక్రియను మెరుగుపరచడం వల్ల ఇది సాద్యమవుతుందని  అంటున్నారు.

తులసి టీ తయారు విధానం..

టీ అనగానే బారతీయులకు పాలు, పంచదార వేసి చేసే పానీయం గుర్తు వస్తుంది.  కానీ తులసి టీ తయారు చేయడానికి పాలు అవసరం లేదు.

కావలసిన పదార్థాలు..

తులసి ఆకులు..

నీరు

తేనె

నిమ్మరసం

తయారు విధానం..

ఒక గ్లాసు నీటిలో 5 నుండి 7 తులసి ఆకులు వేయాలి.  దీన్ని బాగా మరిగించాలి.  మరిగిన తరువాత వడపోసుకోవాలి.  ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం,  ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనె,  నిమ్మరసం వేయకపోయినా పర్వాలేదు.  తులసిని నీళ్లలో మరిగించి తాగవచ్చు.

                              *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...