
దోసకాయ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, శరీరం డీహైడ్రేట్ కాకుండా నివారిస్తుంది. అయితే చాలా మంది దోసకాయను వంటకంగా కాకుండా నేరుగా తినడానికి లేదా సలాడ్, రైతా లలో జోడించుకోవడానికి ఇష్టపడతారు. ఇంకొందరు ఉప్పుతో కలిపి తింటారు. దోసకాయలు ఆరోగ్యానికి చాలా మంచివిగా పరిగణించబడతాయి. కానీ కొందరికి మాత్రం దోసకాయ చేటు చేస్తుందని చెబుతారు. ఇంతకీ దోసకాయలో ఉండే పోషకాలు ఏంటి? దోసకాయలను ఎవరు తినకూడదు? తెలుసుకుంటే..
దోసకాయ పోషకాలు..
దోసకాయలలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దోసకాయలు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో, అవి కొంతమందికి హాని కూడా చేస్తాయి.
దోసకాయలు ఎవరు తినకూడదంటే..
దోసకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే కొందరిలో గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం లేదా తిమ్మిరి వంటి సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు లేదా ఇప్పటికే ఎసిడిటీ లేదా ఉబ్బరంతో బాధపడుతున్నవారు దోసకాయలను తక్కువగా తినాలట. లేదంటే అస్సలు తినకపోవడం మేలట. ఎందుకంటే ఇది వారి సమస్యలను మరింత పెంచుతుంది.
దోసకాయలు చల్లదనాన్ని కలిగి ఉంటాయి. ఎవరికైనా ఇప్పటికే దగ్గు, జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే వారు దోసకాయ తినడం మంచిది కాదు. దీని శీతలీకరణ ప్రభావం దగ్గును తీవ్రతరం చేస్తుంది. జలుబును పెంచుతుంది. కాబట్టి దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి ఉన్నవారు దోసకాయ తినకపోవడం మంచిది.
కొంతమందికి దోసకాయ తిన్న తర్వాత అలెర్జీ సమస్యలు వస్తాయి. పెదవులు లేదా గొంతు దురద, వాపు, కడుపు నొప్పి, వికారం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. దోసకాయ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దోసకాయ తినడం మానేయడం మంచిది.
దోసకాయ ఒక సహజ మూత్రవిసర్జన పదార్థం. అంటే ఇది మూత్రవిసర్జనను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే తరచుగా మూత్రవిసర్జన ఉంటే, దోసకాయ వారి సమస్యను మరింత పెంచుతుంది. అలాంటి వారు చాలా తక్కువ మొత్తంలో లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత దోసకాయ తినడం మేలు.
దోసకాయలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి. ఎవరికైనా ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉంటే దోసకాయను ఎక్కువగా తినడం వల్ల తలతిరుగుడు, బలహీనత లేదా అలసట వస్తుంది. తక్కువ రక్తపోటు ఉన్నవారు దోసకాయలను తక్కువగా తీసుకోవాలి.
కొంతమందికి జలుబు సులభంగా సోకుతుంది. ఇలాంటి వారు చల్లని పదార్థాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. సులభంగా జలుబుకు గురయ్యే అవకాశం ఉన్నవారు, చేతులు కాళ్ళు చల్లగా ఉంటే లేదా తరచుగా కడుపులో చలి ఉండటం వంటి సమస్యలున్నవారు దోసకాయలు తినడం అస్సలు మంచిది కాదు.
*రూపశ్రీ.




