ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే..

భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది.

బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది.

బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది.

టీతో వేయించిన శనగలు తింటే..

వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.

                                         *నిశ్శబ్ద.