అలారం చాలామంది దినచర్యలో భాగం. ఉదయాన్నే చదువుకునే వారి నుండి ఉద్యోగాలు చేసుకునే వారి వరకు ఉదయం పనులు పర్పెక్ట్ గా ఫినిష్ కావాలి అంటే అలారం పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడం అనే అలవాటును అలారం ద్వారానే ఫాలో అవుతారు. స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులో వచ్చాక కేవలం ఒకటి మాత్రమే కాకుండా ఏకంగా మూడు నుండి నాలుగు సార్లు అలారాన్ని నిమిషాల వ్యవధిలో సెట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా మార్నింగ్ అలారం సెట్ చేసుకోవడం చాలా ప్రమాదం అని ఇది ఏకంగా గుండెకు గండి పెడుతుందని అంటున్నారు వైద్యులు.
వైద్యులు చెబుతున్న విషయాల ఆధారంగా నిద్రలలో శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరం ఒక నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అలారం వల్ల కలిగే శబ్దం గుండెను చాలా డిస్బర్బ్ చేస్తుందట.
నిద్రపోతున్నప్పుడు శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం గట్టిగా శబ్దం చేసినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ఇది గుండెపోటు రావడానికి దారితీస్తుందట.
మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉదయాన్నే ఇలా అలారం పెట్టుకుని నిద్రలేస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందట. రోజంతా ఒత్తిడిలోనే సమయం గడుస్తుందట. అలారం ద్వారా నిద్ర లేవడం అనేది ఒక బలవంతపు అలవాటులాగా మారుతుంది. ఇది మానసికంగా డిస్టర్బ్ చేస్తుంది.
గాఢనిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొనడం వల్ల జ్ఞాపకశక్తి మీద, ఆలోచనా సామర్థ్యం మీద కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది రోజూ రిపీట్ అవుతుంటే ఒత్తిడి కూడా పెరుగుతుందట.
అలారం మీద ఆధారపడి నిద్రలేచే అలవాటు ఎక్కువగా ఉంటే అది నిద్రా చక్రం అయిన సిర్కాడియన్ రిథమ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సిస్టమ్ చెదిరిపోవడం వల్ల అనేక మానసిక సమస్యలు వస్తాయి.
పై సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిద్ర లేవడానికి అలారం ఉపయోగించడాన్ని మానేయమని వైద్యులు చెబుతున్నారు. దీనికి బదులుగా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో నిద్రపోవడం, రాత్రిళ్లు తొందరగా నిద్రపోవడం చేయాలి. దీని వల్ల ఉదయాన్నే మెలకువ వస్తుంది. ఒకవేళ అలా మెలకువ రాకపోతే ఎవరిని అయినా ఉదయాన్నే ఓ నిర్ణీత సమయానికి మేల్కొలిపేలా చేయాలి. మొదట కొన్ని రోజులు ఎవరో ఒకరు నిద్ర లేపుతుంటే కొన్ని రోజులలోనే అదే సమయానికి మెలకువ వస్తుంది.
*రూపశ్రీ.