ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కారణం అవుతున్న జబ్బులలో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉంటున్నాయి.  ఇప్పట్లో చిన్న, పెద్ద వయసు తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారు చాలామంది ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఏటా 2కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు.  అయితే గుండెపోటు వచ్చే ముందు  కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఈ లక్షణాలేంటో తెలుసుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.


ఛాతీ బిగుతుగా ఉండటం..


శారీరక శ్రమ చేస్తున్నప్పుడు లేదా ఇతర కష్టమైన పనులు చేస్తున్నప్పుడు ఛాతీ బిగుతుగా మారితే అది గుండె పోటు రావడానికి సంకేతం అని అర్థం.  ఇలా అనిపించినప్పుడు బీపీ చెక్ చేసుకుని దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించాలి.  అలాగే బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.  అధిక బరువు, అదిక రక్తపోటు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలు ఎక్కువ ఉంటాయి.


హృదయ స్పందన..


గుండె సరిగ్గా పనిచేయడం లేదని చెప్పడానికి హృదయ స్పందన సరిగా లేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. హృదయ స్పందన సరిగా లేకపోవడం తో పాటూ ఛాతీ బిగుతుగా అనిపించడం, ఛాతీ భాగంలో నొప్పి వంటివి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.


అలసట..

ఎప్పుడూ అలసటగా అనిపించడం కూడా గుండె జబ్బులను సూచిస్తుంది. శరీరానికి అవసరమైనంత సేపు విశ్రాంతి తీసుకున్నా,  మంచి ఆహారం తింటున్నా, ఎక్కువ శారీరక శ్రమ చేయకపోయినా శరీరం అలసటగా ఉన్నట్టు అనిపిస్తుంటే  శరీరంలో ఆక్సిజన్ లోపించిందని అర్థం.  


వాపు..


పాదాలు, చీలమండలలో వాపు వస్తుంటే అది గుండెకు రక్తం సరిగా పంప్ కాకపోవడం వల్ల జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.  ఇలాంటి లక్షణాలు హార్ట్ ఫెయిల్ కావడానికి కారణం అవుతుందట.


చెమటలు..


ఏదైనా పని చేస్తున్నప్పుడు విపరీతమైన చెమటలు పడుతూ ఉంటే అది గుండెపోటును సూచిస్తుంది.  ధమనులలో అడ్డంకి ఏర్పడటం వల్ల కూడా ఇలా చెమటలు పట్టడం జరుగుతుంది.

                                       *రూపశ్రీ.