దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఈ వర్షాల కారణంగా ఇన్ఫెక్షన్లు కూడా వ్యాపిస్తున్నట్టు వార్తల సమాచారం. ఈ వర్షాల కారణంగా ప్రతి ప్రాంతంలోనూ ఆరోగ్య సమస్యలు రావడం సాధారణం. వీటిలో ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చర్మ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఎక్కువగా ఉంటాయి. అయితే రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లను అయినా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వర్షాకాలంలో ఒక్క జబ్బు రాకూడదంటే తీసుకోవాల్సిన ఆయుర్వేద మూలికలు కొన్ని ఉన్నాయి.
అల్లం..
అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యల వరకు అన్నింటిలో అల్లం మేలు చేస్తుంది. వర్షాకాలంలో ప్రతిరోజూ అల్లం టీ తాగడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.
పసుపు..
ఔషధ గుణాలను మెండుగా కలిగి ఉన్న పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శరీరంలో వాపు ఉంటే పాలలో పసుపు కలిపి తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
అతిమధురం..
దగ్గు, జలుబు, గొంతునొప్పి వర్షాకాలంలో ఇబ్బంది పెడతాయి. దీనికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన అతిమధురం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని టీగా లేదా డికాషన్ రూపంలో తీసుకోవచ్చు.
తులసి..
తులసి ఆయుర్వేదంలో చాలా ప్రభావవంతమైన ఔషధ మూలిక. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉంటాయి. ఇది వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని ద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. తులసి ఆకులను నీటిలో మరిగించి తాగవచ్చు. లేదంటే తులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు.
తిప్పతీగ..
తిప్పతీగ రోగనిరోధక శక్తిని బలపరిచే ఔషధం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది జలుబు, జ్వరం, ఫ్లూ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో ప్రతిరోజూ తిప్పతీగ కషాయాన్ని తయారు చేసి త్రాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
*రూపశ్రీ.