విటమిన్ డి ముందు వెనుకా  ఆలోచించకుండా వేసుకునే మ్యాజిక్ పిల్ కాదు. కొంతమంది విటమిన్-డి లోపం గురించి తెలుసుకోకుండానే విటమిన్ డి పిల్స్ వేసుకుంటూ ఉంటారు. గత కొంతకాలంగా చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. నిద్రవేళలు పాటించకపోవడం,  జీవనశైలి,  వృత్తి సమయాల కారణంగా విటమిన్-డి లోపానికి గురవుతున్నారు.  అయితే ఇప్పటి యూత్ మాత్రం ఏదైనా విటమిన్ లోపం ఏర్పడిందనే అనుమానం రాగానే ముందు వెనుకా ఆలోచించకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్నారు.  అందులో భాగంగానే విటమిన్-డి పిల్స్ కూడా వాడుతుంటారు.  అయితే  ఇలా విటమిన్-డి కోసం సప్లిమెంట్లు వాడేవారు తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. పరిశోధనలు తేల్చిన కొన్ని నిజాలు తెలుసుకుంటే..  


పరిశోధనల ప్రకారం ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా  సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ డి ని భర్తీ చేయకూడదు. విటమిన్-డి ని మన శరీరం  తయారు చేస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే విటమిన్ డి విటమిన్ కాదు, ఒక హార్మోన్. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా విటమిన్ డి సప్లిమెంట్లను ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలని అంటున్నారు.


విటమిన్ డి అనేది  సోషల్ మీడియాలో ఇది ఆరోగ్య మాత్రగా ప్రచారం చేయబడుతోంది.  రెండవ ఆలోచన చేయకుండా చాలామంది  విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటారు.  సూర్యరశ్మికి గురైన తర్వాత చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు కాలేయం,  మూత్రపిండాలు దాని క్రియాశీల రూపంలోకి మారుస్తాయి. దీని తరువాత ఇది శరీరంలో  వివిధ కార్యకలాపాలకు  ఉపయోగించబడుతుంది.


శరీరంలో విటమిన్ డి లోపం ఉందని మొదట  వైద్యుడిని సంప్రదించాలి. కండరాల బలహీనత, శరీరంలో నొప్పి లేదా లేచి కూర్చోవడంలో ఇబ్బంది ఉంటే  డాక్టర్ పరీక్షను సిఫార్సు చేస్తారు. పరీక్ష తర్వాత డాక్టర్ విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తే,  శరీరంలో విటమిన్ డి లోపం ఉందని తెలిస్తేనే ఈ సప్లిమెంట్లు తీసుకోవాలి. ముఖ్యంగా నవజాత శిశువులకు,  70-75 సంవత్సరాల వయసు పై బడిన వృద్దులకు విటమిన్-డి సప్లిమెంట్లు ఇవ్వవచ్చు. అంతేకానీ యూత్ వీటిని వాడటం మంచిది కాదు.