సలాడ్లు, సీసనింగ్ లో చాలావరకు  ఆలివ్ నూనెను ఉపయోగిస్తారు. దీన్ని లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. ఆలివ్ అంత గొప్పదని అర్థం. కేవలం ఆలివ్ నూనె మాత్రమే కాదు.. ఆలివ్స్ తినడం వల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆలివ్స్  ఆరోగ్యానికి ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి. అయితే  ఆలివ్స్ తింటే కలిగే లాభాలేంటో ఒక్కసారి చూడాల్సిందే..

గుండె ఆరోగ్యం..

ఆలివ్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఒలేయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు. ఈ కారణంగా ఆలివ్ తీసుకుంటే గుండె  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అంతేకాదు ఇవి మంచి కొవ్వులను పెంచడం ద్వారా చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆలివ్ లో ఉండే ఫాలీఫెనాల్స్  శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు కలిగి ఉంటాయి.

యాంటీ ఆక్సిడెంట్లు..

ఆలివ్స్ లో యాంటీఆక్సిడెంట్ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో  విటమిన్ ఇ, హైడ్రాక్సీటైరోసోల్,  ఒలీరోపిన్‌లతో సహా బోలెడు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలోనూ, ప్రీరాడికల్స్ తో పోరాడటంలోనూ ఈ యాంటీ ఆక్సిడెంట్లు పనిచేస్తాయి. శరీరంలో కణాల ఆరోగ్యాన్ని ఇవి పర్యవేక్షిస్తాయి.

పేగు ఆరోగ్యం..

ఆలివ్ లో ఉండే పోషక విలువలు పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్దకాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి. ఆలివ్ లు ప్రోబయోటిక్ లను కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి.

చర్మానికి మంచిది..

ఆలివ్ లు చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీద దాడి చేసే ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షణను  ఇస్తాయి. చర్మాన్ని రిపేర్ చేసి కాంతివంతంగా మారుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

బరువు..

బరువు తగ్గడంలో ఆలివ్స్ సహాయపడతాయి. ఆలివ్ లలో ఉండే మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. అదే విధంగా ఆలివ్స్ లో ఉండే ఫైబర్ కూడా ఆకలిని నియంత్రిస్తుంది.  బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు ఆలివ్స్ ను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

                                     *నిశ్శబ్ద.