చేపలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. ముఖ్యంగా ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె నుండి మెదడు వరకు ప్రతి అవయవానికి ఆరోగ్యం చేకూరుస్తాయి. కొందరు చేపలు తినని వ్యక్తులు ఫిష్ సప్లిమెంట్లు వాడుతూ ఉంటారు. ఈ చేప నూనె టాబ్లెట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వీరి నమ్మకం. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని అధ్యయనాలు ఫిష్ సప్లిమెంట్లు తీసుకోవడం ప్రమాదంతో చలగాటం ఆడటమే అని చెబుతున్నాయి. అసలు ఫిష్ సప్లిమెంట్లు ఎందుకు అనారోగ్యం? వీటితో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? తెలుసుకుంటే..
సాల్మన్, మాకేరెల్, ట్రౌట్ వంటి కొవ్వు చేపల నుండి తీసుకోబడిన నూనెను కలిగి ఉన్న క్యాప్సూల్స్ శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా గుండె జబ్బులు (CVD), అధిక రక్తపోటు, లిపిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి చాలా మంచివి. ఈ సమస్యలు ఉన్నవారు ఈ క్యాప్సూల్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తులలో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలలో వెల్లడైంది.
ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ క్రమ రహిత హృదయ స్పందన లేదా స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యలను కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ సప్లిమెంట్లను తీసుకుంటే క్రమరహిత హృదయ స్పందన 13శాతం, స్ట్రోక్ వచ్చే ప్రమాదం 5శాతం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు వీటిని తీసుకుంటే హార్ట్ ఫెయిల్ ప్రమాదం 15శాతం, మరణించే ప్రమాదం 9శాతం తగ్గించవచ్చట. అంటే ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి. కానీ ఆరోగ్య స్పృహతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వీటిని వాడితే మాత్రం ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
*రూపశ్రీ.