శరీరానికి విటమిన్లు చాలా  అవసరం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా శరీర పనితీరు దెబ్బతింటుంది.  శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్లలో విటమిన్-బి12 ఒకటి. . ఇది  చాలా వరకు మాంసాహారంలో లభించడం మూలాన  శాకాహారం తీసుకునేవారిలో విటమిన్-బి12 లోపం ఎక్కువగా ఉంటుంది.  శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా విటమిన్-బి12 లోపాన్ని గుర్తించవచ్చు. శరీరంలో విటమిన్-బి12 పాత్ర ఏంటో.. విటమిన్-బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..


విటమిన్-బి12 పాత్ర..


శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-బి12 ప్రధానమైనది. విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో దోహదం చేస్తుంది. శరీరంలో కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. శరీర నరాలకు ప్రోటీన్ ను సరఫరా చేస్తుంది. అంతేకాదు.. శరీరంలో డియన్ఏ,  ఎర్రరక్తకణాలు ఏర్పడటంలో కూడా విటమిన్-బి12 కీలక పాత్ర పోషిస్తుంది.  విటమిన్-బి12 లోపిస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.


విటమిన్-బి12 లోపం.. లక్షణాలు..


విటమిన్-బి12 లోపం ఉన్న వ్యక్తులలో ఎప్పుడూ అలసట,  బలహీనత ఉంటాయి.  ఎంత తిన్నా, ఎలాంటి ఆహారం తీసుకున్నా విటమిన్-బి12 భర్తీ కాకపోతే బలహీనత, అలసట మనిషిని ఆవరించి ఉంటాయి.  బలవర్థకరమైన ఆహారం తీసుకుంటున్నా కూడా బలహీనత అనుభూతి చెందేవారు వైద్యుడిని కలవడం మంచిది.


రక్తహీనత..


విటమిన్-బి12 ఎర్ర రక్తకణాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.  విటమిన్-బి12 లోపిస్తే ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కొత్త కణాలు ఉత్పత్తి కావడంలో ఆటంకాలు ఏర్పడతాయి.   ఇది రక్త హీనతకు దారితీస్తుంది.  అప్పటికే రక్తహీనత సమస్య ఉన్నవారు విటమిన్-బి12 లోపం రాకుండా చూసుకోవాలి.  సకాలంలో వైద్యుడిని కలసి చికిత్స తీసుకోవాలి.


గుండె వేగం..


సాధారణంగా కష్టమైన పనులు చేసినప్పుడు గుండె కాసింత వేగంతో కొట్టుకోవడం సహజమే.. కానీ విటమిన్-బి12 లోపం ఉన్నవారిలో మాత్రం ఏ చిన్న పని చేసినా గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. చాలా కష్టమైన పనులు చేసిన వారికంటే ఎక్కువగా అలసిపోయి గుండె వేగాన్ని అనుభూతి చెందుతారు.  గుండె దడ కూడా ఎక్కువగా ఉంటుంది.


శ్వాస..

శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్ ను సరఫరా చేసేది రక్తమే.  విటమిన్-బి12 లోపం కారణంగా శరీరంలో ఎర్ర రక్తకణాలు తక్కువైనప్పుడు, ఆక్సిజన్ సరఫరా కూడా మందగిస్తుంది.  ఇది శ్వాస సరిగా తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది. ముఖ్యంగా కింద పడుకున్నప్పుడు,  ఉక్కపోత వాతావరణంలో ఉన్నప్పుడు, పని  చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటారు.


                                            *రూపశ్రీ.