వేసవిలో  విపరీతమైన దాహం అనిపించినప్పుడు కొబ్బరి నీరు అమృతంలా అనిపిస్తుంది. కేవలం వేసవిలోనే కాదు.. కొబ్బరి నీరు ప్రతి సీజన్‌లో శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది పుష్కలంగా పోషణను అందిస్తుంది.  శరీరంలో నీటి లోపాన్ని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా చర్మానికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చాలా మంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో, వైద్యులు ఏం చెప్పారో తెలుసుకుంటే..


 ఎండాకాలం అయినా,  చలికాలం,  వర్షాకాలం అయినా కొబ్బరి నీళ్ళు త్రాగవచ్చు. ఇందులో ఉండే అనేక ఖనిజాలు,  విటమిన్లు  శరీరానికి మేలు చేస్తాయి. అందుకే కొబ్బరి నీళ్లను నిర్ణీత పరిమాణంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో పాటు వర్షాకాలంలో బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా వ్యాధులు త్వరగా దాడి చేస్తాయి.  కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల  రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. మరోవైపు కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి కడుపు నొప్పిని కలిగిస్తుంది.  ఇలాంటి పరిస్థితిలో కొబ్బరి నీరు  సహాయం చేస్తుంది. అయితే  తాజా కొబ్బరి నీళ్లను మాత్రమే తాగాలని గుర్తుంచుకోవాలి. పాత లేదా నిల్వ చేసిన  కొబ్బరి నీరు  హాని చేస్తుంది.


 వర్షాకాలంలో కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యం క్షీణించవచ్చు. వాస్తవానికి, కొబ్బరి నీటిలో చాలా సోడియం ఉంటుంది.   వర్షాకాలంలో సోడియం ఎక్కువగా తీసుకుంటే అది ఉబ్బరం,  రక్తపోటు వంటి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల వర్షాకాలంలో కొబ్బరి నీళ్లను తీసుకోవడం  సురక్షితమే అయినా మితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు, కొంతమందికి కొబ్బరి నీళ్లతో అలెర్జీ సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలంలో దీన్ని తీసుకుంటే శరీరంలో వాపు, పిత్తం, దురద వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

                                        *రూపశ్రీ.