చపాతీలు చాలామందికి ఇష్టమైన ఆహారం. ఉదయం టిఫిన్ లోకి అయినా, మధ్యాహ్నం లంచ్ లోకి అయినా, రాత్రి డిన్నర్ లోకి అయినా సులువుగా ఇమిడిపోయే ఆహారం ఇది.  పైగా స్వచ్చమైన గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటే బోలెడంత ఆరోగ్యం కూడా.  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేసేవారు,  బరువు తగ్గాలని అనుకునేవారు, బరువు నియంత్రణలో ఉంచుకునేవారు చపాతీలు తీసుకుంటూ ఉంటారు. అయితే చపాతీలు తినడం వల్ల మాములు కంటే పదింతలు పోషకాలు లభించాలన్నా,  ఆరోగ్యానికి మేలు జరగాలన్నా ఈ కింది విధంగా చేసుకుని తినాలి.


సాధారణంగా చపాతీలు చేయడానికి గోధుమ పిండిలో కాసింత ఉప్పు, నూనె వేసి నీటితో కలిపి పిండి సిద్దం చేసుకుంటారు. కానీ పోషకాలు  ఎక్కువ లభించాలన్నా, ఆరోగ్యానికి మరింత మేలు జరగాలన్నా చపాతీ పిండిలో ఆరోగ్యకరమైన ఇతర పదార్థాలు మిక్స్ చేయాలి.


మెంతి ఆకు లేదా మెంతి గింజల పొడి ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇవి రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.  కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. గుండెకు మేలు చేస్తాయి.  మెంతి ఆకును లేదా మెంతి గింజల పొడిని గోధుమ పిండిలో వేసి కలిపి ఆ పిండితో చపాతీలు చేసుకుని తినాలి.  ఇది చాలా ఆరోగ్యం చేకూరుస్తుంది.


మునగ ఆకులు కూడా మెంతి ఆకుల మాదిరిగానే ఉపయోగించవచ్చు.  ఒకవేళ తాజా ఆకులు లభ్యం కాకుంటే మునగ ఆకుల పొడిని కూడా గోధుమ పిండిలో కలిపి పిండి సిద్దం చేసుకోవచ్చు.  మునగ ఆకులు లేదా పొడి కలిపి చేసిన గోధుమ పిండి చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంచుతాయి.  అంతేకాదు బరువు తగ్గడంలోనూ, కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ సహాయపడతాయి.


శరీరానికి ఆరోగ్యం చేకూర్చే గింజలలో అవిసె గింజలు ప్రధానమైనవి.  అవిసె గింజలను పొడిగా చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీ పిండి సిద్దం చేసుకోవాలి.  దీంతో చపాతీలు చేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.  అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కంలగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి.


                                                    *రూపశ్రీ.