నేటికాలంలో చాలా మంది ఏదొక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా..ఇతర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే కాదు..చిన్నారులు కూడా ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులుగా మీరే..దానికి సరైన పరిష్కారం చూపిస్తారు. అయితే పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నట్లు మాకేలా తెలుస్తుందనే డౌట్ మీకు రావచ్చు. పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు వారిలో కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. అవి ఎలా ఉంటాయి? చిన్నారులను ఒత్తిడి నుంచి ఎలా బయటపడేయాలని..ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యంతో ఉన్నారేమో గమనించాలి?

కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇవిసాధారణంగా కూడా ఉంటాయనే సందేహం మీకు రావచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తున్నట్లయితే..దానిని ఒత్తిడికిందే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేకపోవడం, పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో వారిని మీరే దగ్గరకు తీసుకుని వారి సమస్యలేంటో అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెప్పాలి. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి.

ఫోన్లో గేమ్స్ ఆడటం?

సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడుతుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నా విషయం  కూడా వారికి తెలియదు. అలాని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంతసమయం మాత్రమే కేటాయించాలి. అలాగే వారు ఆడే ఆటలు చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం అవసరం.

ఏం తింటున్నారు..ఎలా తింటున్నారు?

మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతున్నామో లేదో సులభంగా తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు..పిల్లలకు కూడా వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ..తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుందంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలని చెబుతున్నారు. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఇలా చేస్తారని అంటున్నారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి.

ఏకాగ్రత?

సాధారణంగా ఒత్తిడికి లోనైతే ఏ పనిని సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువుల విషయంలో ఇది కనిపిస్తుంది. ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాలపైనే ఆధారపడదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను కూడా నిర్వర్తించినప్పుడు కూడా ఒత్తిడికి గురవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో వారు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించడం చాలా ముఖ్యం. తద్వారా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయవచ్చు అంటున్నారు నిపుణులు.