ఈమద్యకాలంలో చాలామంది ఓ ఆహారపు అలవాటును బాగా ఫాలో అవుతున్నారు. అదే సలాడ్. కొందరు పండ్లతో సలాడ్ తింటే.. మరికొందరు పచ్చిగా తినదగిన కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటూంటారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, విటమిన్లను, పైబర్ ను సమృద్దిగా అందిస్తుందని.. బరువు నిర్వాహణలో తోడ్పడుతుందని చెబుతారు. అయితే సలాడ్ లు ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎలా తింటే ఆరోగ్యం? ఎప్పుడు తినకూడదు? తెలుసుకుంటే..

సలాడ్ తింటే కలిగే ప్రయోజనాలు..

సలాడ్ లో చాలావరకు పచ్చికూరగాయలు ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

చర్మం లోపలి కణాలు, శరీరానికి బయట కలిగే గాయలను తొందరగా తగ్గించడంలో సలాడ్లు తినడం సహాయపడుతుంది. దోసకాయ, బీట్ రూట్, పచ్చి ఉల్లిపాయ,నిమ్మకాయ, టమోటా మొదలైనవి పచ్చిగా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.

చలికాలంలో సలాడ్ తినడం గురించి చాలామంది సందిగ్ధంలో ఉంటారు. దీనికి కారణం పచ్చి కూరగాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు సులువుగా వస్తాయని. అయితే చలికాలంలో క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, ముల్లంగి రుచితో బీట్రూట్ ఆకారంలో ఉండే టర్నిప్ దుంపలు చలికాలపు సలాడ్ లో జోడించుకోవచ్చు. ఇవే కాకుండా పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు.

సలాడ్ తినడానికి సరైన సమయం..

చాలామంది సలాడ్ అంటే ఎక్కువగా కీరా, క్యారెట్, టమోటాలను తింటూంటారు. వీటిని కూడా భోజనంతో పాటు తింటూంటారు. ముఖ్యంగా బిరియానీలతో పచ్చి ఉల్లిపాయ, క్యారెట్, నిమ్మకాయ, టమోటా వంటివి ఇవ్వడం చూస్తుంటాం.   వీటిని ఉడికించిన ఆహారంతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణసమస్యలు ఎదురవుతాయి.  ఉడికించిన ఆహారంలో ఉష్టోగ్రత, ఆహారం గుణాలు, సలాడ్ లోని ఉష్టోగ్రత, వాటి గుణాలు రెండూ వేరు వేరు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకే సలాడ్ లను ఎప్పుడూ ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. లేదా ఉదయం కాస్త ఆకలిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు.

ఆహారంతో ఎందుకు తినకూడదంటే..

ఆహారంతో పాటు సలాడ్లు తీసుకోకూడదు అనడానికి  మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆహార స్థితిని బట్టి దాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో కాలేయం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది.  దీనివల్లే ఆహారం జీర్ణం అవుతుంది. కానీ సలాడ్లు ఆహారంతో తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.

మరొక కారణం ఏమిటంటే.. చల్లని ఆహారం, ఉడికించిన ఆహారం రెండూ కలిపి తింటే ఆయుర్వేదం ప్రకారం జఠరాగ్ని మందగిస్తుంది. జఠరాగ్ని అనేది ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి. సలాడ్లు ఆహారంతో కలిపి తీసుకోవడం దీర్ఘకాలం కొనసాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.

                                         *నిశ్శబ్ద.