ఎండలు తగ్గుముఖం పట్టాయి. కాస్త వర్షాలు, వాటితో పాటుగా చలిగాలులు మొదలయ్యేసరికి దగ్గు విడవకుండా పలకరిస్తుంది. ఓ నాలుగు దగ్గులు దగ్గగానే ఇక దగ్గర్లో ఉన్న ఏదో ఒక మందుల షాపు దగ్గరకి వెళ్లి సిరప్పో, మందుబిళ్లలో తెచ్చుకోవడానికి సిద్ధపడిపోతాం. వీటి వల్ల మగత, నీరసంలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం లేకపోలేదు. కృత్రిమమైన మందుల వల్ల తాత్కాలిక లాభాలు, దీర్ఘకాలిక నష్టాలు సహజమే కదా! అందుకని ముందుగా ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించి చూస్తే పోయేదేముంది. ఏళ్లకేళ్లుగా మన పెద్దలు చెబుతున్న, ఆచరిస్తున్న ఈ చిట్కాలు మరోసారి...
తేనె: పొడి దగ్గుకైనా, కఫంతో కూడిన దగ్గుకైనా తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే కాఫ్ సిరప్‌లతో సమానంతా తేనె పనిచేస్తుందని వాదించే నిపుణులూ లేకపోలేదు. నోటి నుంచి గొంతుదాకా తేనె ఒక సన్నటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి దగ్గుని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకని తేనెని నేరుగా కానీ, గోరువెచ్చటి పాలు లేక నీటితో కానీ తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
అల్లం: పొడి దగ్గుతో బాధపడేటప్పుడు అల్లం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక చిన్న ముక్క అల్లాన్ని అలాగ్గా నమిలేసినా కొంత ప్రభావం ఉంటుంది. లేదా నీటిలో ఓ నాలుగు ముక్కల అల్లాన్ని వేసి ఆ నీరు సగానికి మరిగేదాకా ఉంచి, ఆ కషాయాన్ని పుచ్చుకున్నా ఉపశమనం ఉంటుంది. అల్లం ఘాటుకి గొంతులో స్రావాల ఉత్పత్తి ఎక్కువవుతుందనీ, తద్వారా తగినంత తేమ చేరి దగ్గు తగ్గుతుందని అంటున్నారు.
పసుపు: దగ్గుకి పసుపుని వాడటం అనాదిగా వస్తున్నదే! రాత్రిపూట గోరువెచ్చటి పాలలో చిటికెడంత పసుపు వేసుకుని తాగితే దగ్గు చిటికెలో మాయమైపోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. పసుపు వల్ల దగ్గు తగ్గడమూ, పాలతో సుఖంగా నిద్ర పట్టడమూ రెండూ సాధ్యమవుతాయి. ఇక ఊపిరితిత్తులలో కఫం పేరుకున్నప్పుడు వేడి వేడి నీటిలో పసుపుని వేసి ఆవిరి పట్టడం వల్ల కూడా కఫం పల్చబడిపోతుంది.
మిరియాలు: కఫంతో కూడిన దగ్గుకి మిరియాలను మించిన చిట్కా లేదంటోంది సంప్రదాయ ప్రపంచం. ఇంగ్లండు నుంచి చైనా వరకు సనాతన వైద్యంలో దగ్గుని నివారించేందుకు నల్ల మిరియాలను వాడుతూనే వస్తున్నారు. ఇందుకోసం నీటిలో కానీ, పాలల్లో కానీ పొడి చేసిన మిరియాల పొడిన కలుపుని తాగమని చెబుతుంటారు. అయితే మిరాయలు వేడిని కలిగిస్తాయి. పైగా గొంతులో కఫాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి పొడిదగ్గు ఉన్నప్పుడే వీటిని వాడాలి.
ఇవేకాదు... తులసి ఆకులు నమలడం, నిమ్మరసాన్ని తీసుకోవడం, బాదం పప్పులు తినడం, పుదీనా టీ తాగడం... ఇలాంటి చిట్కాలెన్నో ఇంగ్లీషు మందులకంటే అద్భుతంగా పనిచేస్తాయి.
- నిర్జర.