రంజాన్ మాసం రాగానే అందరికీ ఖర్జూరాలే గుర్తుకువస్తాయి. ఎందుకంటే ముస్లిం సోదరులంతా రంజాన్ రోజున ఉపవాసాన్ని ఉండి, సాయంత్రం పూట ఆ ఉపవాసాన్ని ఒక ఖర్జూరాన్ని తీసుకోవడంతో ముగిస్తారు. సాక్షాత్తూ మహమ్మద్ ప్రవక్తే ఇలాంటి ఆచారాన్ని పాటించేవారని చెబుతారు. ఇస్లాం రూపుదిద్దుకున్న ఎడారి నేలల మీద ఖర్జూర పుష్కలంగా పండే పండు కావచ్చు. కానీ లోతుగా ఆలోచిస్తే, రంజాన్ ఉపవాసపు ముగింపుగా ఖర్జూరన్నే ఎంచుకోవడం వెనుక చాలా కారణాలే కనిపిస్తాయి.
- పగలంతా ఉపవాసం ఉన్నవారిలో చక్కెర నిల్వలు పడిపోతాయి. నీరసం, నిస్సత్తువా ఆవహిస్తాయి. ఇలాంటివారికి తిరిగిన శక్తిని అందించే ఔషధంగా ఖర్జూర పనిచేస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరలో 50 గ్రాములకి పైగా చక్కెర ఉంటుంది. ఇందులో మనిషికి తక్షణ శక్తిని అందించే గ్లూకోజ్ కూడా అధికంగానే ఉంటుంది.
-రోజంతా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఖర్జూరలో కావల్సినన్ని పోషకాలు ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం ఇందులో 6 రకాల విటమిన్లూ, 15 రకాల ఖనిజాలూ ఉన్నాయి. కాబట్టి రెండు మూడు ఖర్జూరాలు తీసుకుంటేనే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉపవాసంతో శరీరానికి దూరమైన పోషకాలను అందించే బాధ్యత ఖర్జూర తీసుకుంటుందన్నమాట.
- రోజంతా ఉపవాసం ఉన్నాక ఒక్కసారిగా భారీ ఆహారాన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కానీ ఖర్జూరం అలా కాదు. ఇందులో ఉండే చక్కెర, పీచు పదార్థాల వల్ల చాలా తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువస్తుంది.
- రోజూ ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకునేలా మన శరీరం సిద్ధపడిపోయి ఉంటుంది. మనం అలవాటు చేసిన పనిని శరీరం యథాతథంగా నిర్వర్తిస్తుంది. ఆకలి వేయడం, ఆహారం జీర్ణం కావడం, జీర్ణం అయిన ఆహారం విసర్జన కావడం... ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగేలా శరీరం చూసుకుంటుంది. ఏదో ఒక రోజు ఉపవాసం అంటే ఫర్వాలేదు కానీ, రోజుల తరబడి ఉపవాసం అంటే శరీర ధర్మం తారుమారైపోతుంది. దీన్ని చక్కబెట్టే బాధ్యతను ఖర్జూర తీసుకుంటుంది. చక్కెర, రుచి ఉన్న ఖర్జూరను నోట్లో ఉంచుకోగానే జీర్ణరసాలు ఊరి రాత్రిపూట ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధపడిపోతాయి. ఖర్జురలో ఉండే పీచుపదార్థం తరచూ ఉపవాసాలు చేయడం వల్ల వచ్చే మలబద్ధకాన్ని అరికడుతుంది.
- రోజంతా నిరాహారంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా విపరీతంగా ఆహారం తీసేసుకోవాలన్న తపన కలుగుతుంది. దీని వల్ల ఉపవాస ఫలితం ఉండకపోగా, వ్యతిరేక పరిణామాలకు కూడా దారితీయవచ్చు. ముందుగా ఒకటి రెండు ఖర్జూరాలను తీసుకుంటే కడుపు కాస్త నిండిన భావన కలుగుతుంది. ఆహారం పట్ల తపన తగ్గుతుంది. పైగా ఉపవాస వేళలు ముగిసిన వెంటనే ఆహారాన్ని తీసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఆహారం తీసుకునే అవకాశం వచ్చేలోగా ఖర్జూరాలతో ఆకలిని తీర్చుకోవచ్చు.
- నిర్జర.