అందంగా ఆకర్షణీయంగా కనబడాలంటే శరీర సౌష్టవం చక్కగా ఉండాలి. పొట్ట భాగం ముందుకు చొచ్చుకుని వచ్చి రూపాన్నంతా పాడుచేస్తుంది. చాలామంది పొట్ట కనిపించకుండా కవర్ చేయడానికి దుస్తుల ఎంపిక మీద ఆధారపడతారు. అయితే ఇలా దుస్తుల మీద ఆధారపడటం కంటే పొట్ట తగ్గించుకుని శరీరాన్ని ఫిట్ గా మార్చుకోవడం మంచిది. పొట్ట తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదని నిరాశ పడేవారు చాలామంది ఉంటారు. కానీ కేవలం నాలుగు సింపుల్ పనులు చేయడం ద్వారా పొట్టలో కొవ్వును ఐస్ లా కరిగించేయచ్చు. ఇవి అందరూ చేయదగ్గవే. ఆ సింపుల్ పనులేంటో తెలుసుకుంటే..
పొట్టభాగంలో కొవ్వు వల్ల ఉబకాయం క్రమంగా పెరుగుతుంది. దీన్ని వదిలించుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. దీనికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శీతలపానీయాలు, బేకరీ ఫుడ్స్ వంటివి తినడం. జంక్ ఫుడ్ లో చెడు కొలెస్ఠ్రాల్ ఉంటుంది. దీన్ని శరీరం ఉపయోగించుకోలేదు. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ఒకే పొజిషన్ లో గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆ భాగంలో ఫ్యాట్ చేరుతుంది. ఇది పొట్ట భాగమైనా, పిరుదుల భాగం అయినా, తొడలు, నడుము ఇలా ఏ భాగంలో అయినా పేరుకుపోతుంది. దీన్ని తొలగించుకోవాలంటే మొదట ఈ జంక్ ఫుడ్స్ తినడం ఆపేయాలి. బర్గర్లు, సమోసా, మైదాతో చేసే పదార్థాలు, స్వీట్లు, డీప్ ఫ్రై ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలైనవి వదిలేయాలి. ఈ పని పెద్ద కష్టమేమీ కాదు. జిహ్వచాపల్యం వదులుకుంటేనే బరువు తగ్గగలరు.
మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు తీసుకునే అలవాటు ఉంటే ఈ అలవాటును తక్షణమే మానేయండి. ఇవి శరీరంలో కణాలలోకి చొచ్చుకువెళ్ళి కణాలను, హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆకలి ఎక్కువ కావడం, జంక్ ఫుడ్ తినాలని అనిపించడం జరుగుతుంది.
పైబర్ ఆహారాలు బరువు తగ్గడంలో తోడ్పడతాయి. కరిగే ఫైబర్ ఆహారాలు తీసుకున్నప్పుడు అవి శరీరంలో నీటిని గ్రహించి జెల్ లాగా మారతాయి. ఇవి కడుపులో నిండుగా ఉన్న అనుభూతి ఇస్తాయి. ఎక్కవు సేపు ఆకలి కాకుండా నిరోధిస్తాయి. ఓట్స్ ఫైబర్ కు మంచి మూలం. ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదయం అల్పాహారంగానో, లేక రాత్రి సమయంలో ఓట్స్ తో దోశ, ఇడ్లీ, కిచిడి లాంటివి తీసుకోవాలి. రాత్రి 8గంటలలోపు భోజనం ముగించాలి. భోజనం తరువాత కనీసం ఓ 10నిమిషాల తేలికపాటి నడక అలవాటు చేసుకోవాలి.
బరువు తగ్గాలని అనుకునేవారు ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్కటైనా సిట్రస్ పండు తీసుకోవాలి. నిమ్మ, బత్తాయి, నారింజ ఇలా ఏదో ఒకటి తినాలి. వీటితో పాటు మంచినీరు శరీరానికి కావలసినంత తాగాలి.
*నిశ్శబ్ద.