అద్భుతమైన పోషక విలువలు వుండటంతోపాటు అమోఘమైన ఔషధ లక్షణాలు కూడా వున్న మునగ ఆకు గొప్పతనాన్ని ఇప్పటి వరకు చాలామంది తెలుసుకోలేదు. ముఖ్యంగా నగరాల్లో నివసించే ప్రజలు తెలుసుకోలేదు. అలాగే కూరగాయల వ్యాపారులు తెలుసుకోలేదు. అది ఒక అదృష్టం... వ్యాపారుల కళ్ళు పడలేదు కాబట్టే ఇప్పటికీ మునగాకు ఉచితంగానే లభిస్తోంది. ఉచితంగా లభిస్తోంది కదా అని మునగాకును తేలిగ్గా తీసిపారేయకండి. మునగాకు ఎంత గొప్పదో తెలియని వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం ఇది. మునక్కాయ గురించి అందరికీ తెలిసిందే. సాంబారులో మునక్కాయ ముక్కలు కనిపిస్తే వాటిని జుర్రుకోనివాళ్ళు ఎవరైనా వుంటారా? ఆ టేస్ట్ గుర్తుకు వస్తేనే నోట్లో నీళ్ళూరతాయి. అయితే మునక్కాయ కంటే మునగాకే చాలా మంచిదని తెలుసుకోవాలి. ములక్కాయలో రుచి మాత్రమే వుంది. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మునగాకుతో వండిన కూరలు లొట్టలు వేసుకుంటూ తినేంత రుచిగా వుండకపోవచ్చు. కానీ, అది అందించే ఆరోగ్యం మాత్రం అపారం. నగరాల్లో, పట్టణాల్లో మునగాకు గురించి పట్టించుకునేవారు చాలా తక్కువ. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మునగాకు మంచితనం బాగా తెలుసు. అందుకే వారు తరచుగా మునగాకును వినియోగిస్తూ వుంటారు.

పోషక విలువలు అపారం

మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం.

నీరు - 75.9 శాతం
పిండి పదార్థాలు - 13.4 గ్రాములు
ఫ్యాట్స్ - 17 గ్రాములు
మాంసకృత్తులు - 6.7 గ్రాములు
కాల్షియం  - 440 మిల్లీ గ్రాములు
పాస్పరస్ - 70 మిల్లీ గ్రాములు
ఐరన్ - 7 మిల్లీ గ్రాములు
‘సి’ విటమిన్ - 200 మిల్లీ గ్రాములు
ఖనిజ లవణాలు - 2.3 శాతం
పీచు పదార్థం  - 0.9 మిల్లీ గ్రాములు
ఎనర్జీ - 97 కేలరీలు

కొద్దిగా వెగటు... అయినప్పటికీ...

మునగాకు కొంచెం కారంగా, వెగటుగా అనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలే మునగాకును కొంతమంది ఇష్టపడకపోవడానికి కారణం అవుతున్నాయి. అయితే అలవాటు చేసుకుంటే ఈ లక్షణాలు పెద్దగా ఇబ్బంది కలిగించవు. మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు జరుగుతుంది. మునగ ఆకుతో పప్పు వండుకోవడం, మునగ ఆకును ఇగురు చేసుకోవడం, ఇతర కూరల్లో మునగాకును కూడా వేసుకోవడం ద్వారా మునగాకును ఆహారంగా తీసుకోవచ్చు. మునగాకును నీడలో ఎండబెట్టి, పొడి చేసుకుని ప్రతిరోజూ ఒక స్పూనును పాలలో కలుపుకుని తాగవచ్చు. మునగాకు పొడిని కూరల్లో కలుపుకోవచ్చు...

ఔషధ విలువలు అద్భుతం

ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు...

మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.  మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా?

-అంతర్యామి