చందనంతో చల్లబడే సింహాచల స్వామి


శ్రీ నారసింహ క్షేత్రాలు – 8

 

 


కుందాభసుందరతనుః పరిపూర్ణచంద్ర
బింబానుకారి వదనోద్విభుజస్త్రి నేత్రః
శాన్తస్త్రిభంగి లలితః క్షితిగుప్తపాద
స్సంహాచలేజయతి దేవవరో నృసింహః


సింహాచలంలో వరాహ నరసింహస్వామి గురించి తెలియనివారు తెలుగు ప్రాంతంలో వుండరంటే అతిశయోక్తి కాదు.  విశాఖపట్నం నుంచి దాదాపు 15 కి.మీ. ల దూరంలో తూర్పు కనుమలలో సింహగిరిపై వెలిసిన ఈ స్వామిని ఆ ప్రాంతంవారంతా సింహాద్రి అప్పన్నగా ప్రేమగా పిలుచుకుంటారు.  తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన వైష్ణవ క్షేత్రంగా గుర్తింపబడిన ఈ క్షేత్రంలో స్వామి నిజ రూప దర్శనం సంవత్సరంలో ఒక్కసారి,  వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయనాడు మాత్రమే, అదీ కేవలం 12 గం. లు మాత్రమే లభిస్తుంది.  మిగతా సమయంలో స్వామి చందన పూతతో శివ లింగంలా కనబడతారు. క్షేత్ర పురాణం సింహాచల క్షేత్రాన్ని దర్శించే ముందు ఆ క్షేత్ర పురాణం గురించి తెలుసుకుందాము.    యుగ యుగాలనుంచీ భక్తులని బ్రోచేందుకు వెలసిన స్వామి చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం ఎవరికి వుండదు చెప్పండి.

శ్రీ మహావిష్ణువు ద్వార పాలకులైన జయ, విజయులకు సనక సనందాది మహర్షులిచ్చిన శాపం, దానివలన వారు భూలోకంలో రాక్షసులుగా మూడు జన్మలెత్తి, ఈ మూడు జన్మలలోనూ శ్రీహరిచే దునుమాడబడి చివరికి స్వామి సాయుజ్యం చేరటం మీకు తెలిసిన కధే.  అందులో మొదటి జన్మలో హిరణ్యాక్షుడు భూదేవిని చెరబట్టినప్పుడు, భక్త సులభుడు వరాహావతారంలో హిరణ్యాక్షుడిని వధించి భూమాతను రక్షిస్తాడు.  సోదరుడు హిరణ్యాక్షుడి మరణంతో వ్యాకులం చెందిన హిరణ్యకశిపుడు ఘోర తపస్సుచేసి బ్రహ్మనుంచి తనకు గుర్తొచ్చిన జీవుల పేర్లన్నీ చెప్పి వారెవరితో తనకు మరణం లేకుండా వరం పొంది, ఆ వర గర్వంతో అనేక దురాగతాలకు పాల్పడసాగాడు.  ఋషులను హింసించి యజ్ఞాలద్వారా దేవతలకు చేరవలసిన హవిస్సులు వారికి చేరనీయకుండా తానే స్వీకరించసాగాడు.  హవిస్సులులేక దేవతలు తేజో విహీనులై తమ కార్యక్రమములను నెరవేర్చలేక బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తమ గోడు వెళ్ళబోసుకున్నారు.   బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునకి ఆ వరమిచ్చినది తానేగనుక తానాతనిని చంపలేనని, తమని కాచేవాడు శ్రీహరి అని తెలియజేసి వారందరితో వైకుంఠం చేరాడు.

 

వైకుంఠ ద్వారమువద్ద వారిని సుముఖుడనే ద్వార పాలకుడు అడ్డగించి లోనికి వెళ్ళనివ్వలేదు.  సుప్రతిష్టుడనే పేరుగల రెండవ ద్వార పాలకుడు వారి బాధని చూసి వారినక్కడే వుండమని, తానువెళ్ళి శ్రీహరికి వారి రాకగురించి తెలియజేశాడు.  శ్రీహరి వెంటనే వారి దగ్గరకొచ్చి వారి రాకకు కారణమడిగాడు.  వారు తమరాకకు కారణం తెలియజేస్తూ, నీ శరణు కోరి వచ్చాము, దుఃఖ రహితమైన నీ లోకముననే ఈ ద్వారపాలకునివలన మేము దుఃఖితులమైనామని విన్నవిస్తారు.  శ్రీహరి సుముఖుడిమీద కోపించి, తన భక్తులను తన దగ్గరకు రానివ్వనందుకు నువ్వా అసురుడికి (హిరణ్యకశిపుడికి) పుత్రుడిగా జన్మించమని శపించాడు. సుముఖుడు ఆ జగన్నాటక సూత్రధారి పాదాలమీద పడి, స్వామీ, నేను గర్వముతో వీరిని నివారించలేదు.  వీరందరూ జగత్పాలనకొరకు నీచేనొసగబడిన బాధ్యతలను విస్మరించి ఒక్కటిగా ఇక్కడికి వచ్చారు, దానివలన కలిగే అసౌకర్యానికి జంకి వారిని నిలిపాను, నన్ను రక్షించమని వేడుకొన్నాడు.

అప్పుడు శ్రీహరి అతనిని ఓదార్చి, జయ విజయుల వృత్తాంతము తెలియజేసి, వారు కూడా మూడు జన్మల తర్వాత తన సాన్నిధ్యాన్ని చేరగలరని, హిరణ్యకశిపుని పుత్రుడిగా జన్మించినా తనపై భక్తి కలిగి వుంటాడని, అతనికోసం తాను అద్భుతాకారం ధరించి  హిరణ్యకశిపుని వధిస్తాననీ చెప్తాడు. ప్రహ్లాద జననం, విష్ణు భక్తుడవటంవల్ల తండ్రి అతనిని పెట్టిన కష్టాలు, శ్రీహరి అతనిని రక్షించిన వైనాలు మనమనేక కధలుగా విన్నాము.  ప్రస్తుతం సింహాచలానికి సంబంధించిన కధ మాత్రమే తెలుసుకుందాము.

హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హరినామ జపం మానమని అనేక హింసలు పెట్టేవాడు.  ఒకసారి ఆ చిన్నారి బాలుని సముద్రంలో తోయించి, పైకి రాకుండా ఒక పర్వతముని అతనిపై వేయించాడు.  తన భక్తుని కాపాడటానికి శ్రీహరి  వైకుంఠమునుండి వేగంగా బయల్దేరాడు.  అతి వేగంగా ప్రయాణిస్తున్న గరుక్మంతుడి అలసట తీరటానికి కుడిచేతితో గరుక్మంతుడికి అమృతపానం చేయిస్తున్నాడు.  ఎడమ చేయి జారిపోతున్న వస్త్రాన్ని సర్దుకుంటూ కటి దగ్గర వున్నది.  ఒక్క అంగలో ప్రహ్లాదుడిపైనున్న కొండమీదకు దూకి ప్రహ్లాదునికి దాని భారాన్ని తప్పించాడు.  శ్రీ హరి దూకుడికి ఆయన పాదాలు భూదేవిలో కూరుకుపోయాయి.  ఇక్కడి నరసింహస్వామి అసలు స్వరూపం ఇలాగే వుంటుంది...వరాహం తల, తోకలతో, మనిషి శరీరంతో, పాదాలు కనబడకుండా, ఒక చేతితో గరుక్మంతునికి అమృతాన్ని తాగిస్తూ, వేరొక చేతితో తన వస్త్రాన్ని సవరించుకుంటూ.   ప్రహ్లాదుని కాపాడిన నరసింహస్వామి ఆ బాలుణ్ణి ఇంటికి పంపుతూ తాను అతని పిన తండ్రిని చంపిన వరాహ రూపంతోనూ, తండ్రిని చంపబోవు నృసింహ రూపంతోనూ ఇక్కడ వెలసి వుంటాననీ ప్రహ్లాదుడు ముసలితనంవరకూ రాజ్యపాలన చేసి వానప్రస్ధం ఇక్కడ తన సేవలో గడపమని, అతని ఆరాధనా ప్రభావం వలన ఆ ప్రాంతం సుప్రసిధ్ధ క్షేత్రమవుతుందనీ ఆశీర్వదించాడు. ఆ సంఘటన తర్వాత ప్రహ్లాదుడు తమ ఇల్లు చేరటం, హిరణ్యకశిపుడు నచ్చ చెప్పినా వినకుండా హరి భక్తిలో మునగటం, హిరణ్యకశిపుడు హరిని చూపించమని స్తంభం మీద కొట్టటం,  నరసింహుడు ఉగ్ర రూపంతో హిరణ్యకశిపుని సంహరించటం వగైరా సంఘటనలు.

తండ్రి తదనంతరం రాజైన ప్రహ్లాదుడు చాలాకాలం ప్రజారంజకముగా రాజ్యం చేశాడు.  తర్వాత రాజ్యాన్ని తన కుమారుడైన విరోచనునికి  అప్పగించి, కొంత పరివారాన్ని తీసుకుని  నరసింహుడు తనని రక్షించిన ప్రదేశమైన సింహాచలాన్ని చేరుకున్నాడు.  అక్కడ పొదలమాటున పుట్టలో కప్పబడి వున్న వరాహ నరసింహ స్వామిని కనుగొని ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి పూజలు చేయ మొదలు పెట్టాడు.  తర్వాత  దేవ శిల్పి విశ్వకర్మ చేత స్వామికి మందిరాన్ని నిర్మింప చేశాడు. సింహాచలం చుట్టూ  అన్ని వర్గాల ప్రజలూ నివసించటానికి వీలుగా పట్టణాన్నీ కట్టించాడు. ఆ సమయంలోనే బ్రహ్మాది సకల దేవీ దేవతలు అక్కడికి వచ్చి స్వామిని సేవించారు. ఆ రోజు చైత్ర శుధ్ధ ఏకాదశి.  మహా శివుడు కూడా అక్కడికి వచ్చి తను స్వామిని సేవిస్తూ క్షేత్ర పాలకుడిగా అక్కడే స్ధిరపతానన్నాడు.  గంగా, యమునా సరస్వతులు ఆ దేవ దేవుని అభిషేకం కోసం అక్కడ గంగధారా రూపంలో అక్కడ వెలిశారు.  ఆ సమయంలో అత్యంత వైభవంతో విలసిల్లిన ఆ క్షేత్రం తర్వాత కాలంలో  శిధిలమైపోయింది.

చంద్ర వంశానికి చెందిన పురూరవుడు ఒక సారి ఊర్వశితో విమానంలో ఈ ప్రదేశం పైనుంచి వెళ్తుండగా ఈ స్ధలానికి వున్న శక్తివల్ల విమానం ముందుకు కదలక కిందకి దిగింది.  అలా ఎందుకయిందా అని అన్వేషిస్తున్న పురూరవుడికి ఊర్వశి, నరసింహుడు ప్రహ్లాదుడిని కాపాడిన ప్రదేశం అదని, ప్రహ్లాదుణ్ణి కరుణించటానికి స్వామి అక్కడ వరాహ నరసింహస్వామిగా వెలిశాడనీ, అప్పుడు ఇతర దేవతలతోసహా తానుకూడా వచ్చి ఆ స్వామిని సేవించాననీ చెప్పి, స్వామి విగ్రహం అక్కడ వుండి వుంటుందని తెలియజేసింది.  వెతకగా అతనికి అక్కడ మట్టిలో కప్పబడిన వరాహ నరసింహస్వామి విగ్రహం కనబడింది.  దానిని తీస్తుండగా అశరీరవాణి ఆ స్వామిని ఏడాది పొడుగునా చందనంతో కప్పి వుంచి ఒక్క అక్షయ తృతీయ రోజు మాత్రం చందనం తొలిగించి నిజ దర్శనం చేసుకొమ్మని పలికింది.  పురూరవుడు స్వామికి ఆలయం నిర్మింపజేసి, నిత్య పూజలు చేయిస్తూ, అశరీరవాణి పలికిన ప్రకారం స్వామిని అక్షయ తృతీయనాడు తప్ప మిగతా రోజులలో చందనంతో కప్పి వుంచారు.  అదే అలవాటు నేటికీ కొనసాగుతోంది.

ఆలయ నిర్మాణం
ఆలయ నిర్మాణ, విస్తరణ, పునరుధ్దరణలలో అనేకమంది రాజులు కృషి చేశారు.  ప్రస్తుతం వున్న నిర్మాణం 13వ శతాబ్దం లో తూర్పు గంగరాజైన నరసింహ-1 చేసినది.
ఆలయంలో వున్న కళ్యాణ మండపం 16 స్తంబాలతో విలసిల్లుతున్నది.  వీటిమీద మహావిష్ణువు, నరసింహుని శిల్పాలు చెక్కబడి వున్నాయి.  ఆలయం వెలుపలి గోడలపై చక్కని శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ ఆలయంలో ఒడిస్సీ, తెలుగు భాషలలో వందలకొద్దీ శాసనాలు లభ్యమయినాయి.  వాటి ప్రకారం ఒరిస్సాకి చెందిన నరసింహదేవ-2 అనే రాజు 1279 –1306 మధ్యలో ఆ ఆలయాన్ని నిర్మింప చేశాడు.

శ్రీ కృష్ణ దేవరాయలు క్రీ.శ. 1516 – 19 మధ్య ఈ ఆలయాన్ని దర్శించి స్వామికి అమూల్య ఆభరణాలు సమర్పించటంతోబాటు ఆలయ నిర్వహణకి అనేక గ్రామాలు రాసిచ్చారు.  ఆ నగలలో ఒక పచ్చల హారం ఇప్పటికీ  వున్నది.

కప్ప స్తంభం
ఆలయం ముందు మండపంలో కప్ప స్తంభం చాలా ప్రసిధ్ధికెక్కింది.  సంతానం లేనివారు ఆ స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.  ఆ స్తంభం కింద సంతాన గోపాలస్వామి యంత్రం స్ధాపించబడటమే దీనికి కారణం అంటారు.  పూర్వకాలంలో స్వామికి ఇక్కడే కప్పాలను చెల్లించేవారనీ, అందుకే ఈ స్తంభానికి కప్పపు స్తంభం అనే పేరు వచ్చిందనీ, కాలక్రమేణా అది కప్ప స్తంభం అయిందనీ కూడా అంటారు.

మార్గము
విశాఖపట్టణం వరకూ రైలు, రోడ్జు మార్గాలున్నాయి.  అక్కడనుండి 15 కి.మీ. లోపు దూరంలో వున్న సిహాచలానికి ఆటో, కారు, సిటీ బస్సులలో రావచ్చు.  కొండపైకి వెళ్ళటానికి మెట్ల మార్గం ద్వారా దాదాపు 1000 మెట్లు ఎక్కాలి.  ఘాట్ రోడ్ లో దేవస్ధానం బస్ లోగానీ, టాక్సీలోగానీ ప్రయాణం చేసి ఆలయం చేరుకోవచ్చు.

వసతి
దేవాలయ సత్రములు, టిటి.డి. వారి సత్రములు, ఎపిటిడిసి వారి రెస్ట్ హౌస్ లు వున్నాయి.  సమీపంలోనే వున్న విశాఖపట్టణంలో అన్ని వసతులూ వున్నాయి.

దర్శనం
ఉదయం 7 గం. ల నుంచి సాయంత్రం 4 గం.ల దాకా, తిరిగి రాత్రి 6 గం. ల నుంచీ 9 గం. ల దాకా.

- పి.యస్.యమ్. లక్ష్మి


More Vyasalu