యజుర్వేద వికాసం
మన భాతీయ సంస్కృతికి, నాగరికతకు, ఆధ్యాత్మిక వికాసానికి మూలం వేదం. తపస్సంపన్నులైన మన మహర్షులు తమ యోగదృష్టితో వేదమూలాలను దర్షించి లోక కల్యాణకాంక్షతో వేదసంపదను మన జాతికి అందించారు. ‘విద్ ఙ్ఞానే’ అను ధాతువునుండి జనించినందున దీనిని ‘వేదం’ అన్నారు. ‘వేద’ శబ్దమునకు ‘ఙ్ఞానం’ అనే అర్ధం కూడా ఉంది. ‘వేదయతీతి వేదః’ అంటే తెలియని విషయాన్ని తెలియజేసేది అని అర్ధం. ‘వేదయతి యతో ధర్మాధర్మ ఇతి వేదః’ ‘విదంత్యనేన ధర్మానితి వేదః’ అని కూడా అంటారు. అంటే మానవులకు తెలియని ధర్మాధర్మాల అర్ధాన్ని ప్రత్యక్షానుమాన ప్రమాణాలచే సవివరంగ తెలియజేస్తుంది కనుక దీనిని ‘వేదం’ అన్నారు. వేదాన్ని ఎవ్వరూ రచించలేదు. అది అపౌరుషేయని.., కాలాతీతమైనదని మన ఋషులు సప్రమాణంగా నిరూపించారు.ఒక తరం నుంచి మరొక తరానికి పరంపర ఆస్తిగా కేవలం వినికిడి ద్వారా సంగమిస్తుంది కనుక దీనికి ‘శ్రుతి’ అని మరో పేరు కూడా ఉంది. అందుకే ‘న కశ్చిద్వేదకర్తా చ’ అన్నారు. అంటే వేదానికి కర్త లేడు అని అర్ధం. ‘యస్య నిశ్శ్వసితం వేదాః’ అంటే భగవంతుని నిశ్శ్వాసరూపమే వేదం. ఆయన మనస్సంకల్ప జనితమైన ఈ సమస్త చరాచర సృష్టికి కారణభూతమైనటువంటి వాక్కే ‘వేదం’.
లోకానుగ్రహకాంక్షతో పరమాత్ముడు ప్రసాదించిన ఈ వేదవిఙ్ఞాన మహాప్రసాదాన్ని., స్వార్ధప్రయోజన కాంక్షతో కాక, లోకోపకారార్దం ద్రష్ఠలైన మన మహర్షులు తమ తపశ్శక్తితో గ్రహించి లోకానికి అందించారు. నిస్వార్ధంగా మన హితాన్ని కోరేవారే ఆప్తులు. అందుకే వేదాన్ని ‘ఆప్తవాక్యం’ అని కూడా అంటారు. భారతజాతికి నిజమైన తరగని సంపద ‘వేదం’. విశ్వంలోని సమస్త వాఙ్మయానికి వేదమే ప్రాణం. మిగిలిన బ్రాహ్మణ్య, అరణ్యక, స్మృతి, ఉపనిషత్, ఇతిహాస, పురాణాదులన్నీ శరీరం. ప్రస్తుతం మనకు అందుబాటులోనున్న వేదం నాలుగు భాగాలుగా కనిపిస్తుంది. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. ఈ నాలుగు వేదాలలో యజుర్వేదం .., వేదపురుషునకు శిరస్సు వంటిది. అందుకే ముందుగా యజుర్వేద విషయాలను పరిశిలిద్దాం.మానవుని దైనందిన జీవితంతో యజుర్వేదం చాలా బలంగా ముడిపడి ఉంటుంది. నిత్య నైమిత్తిక కర్మలకు ఆధారం యజుర్వేదం. ఇంటికి గోడలు ఎంత ప్రధానమో., యఙ్ఞ యాగాది క్రతువులకు యజుర్వేదం అంత ప్రధానం. యఙ్ఞనిర్వాహకులలో ప్రధానుడైన అధ్వర్యుడు ఉపయోగించే వేదం కాబట్టి యజుర్వేదాన్ని ‘అధ్వర్యువేదం’ అని కూడా అంటారు. ఈ యజుర్వేదం శుక్తయజుర్వేదమనీ., కృష్ణయజుర్వేదమని రెండు రకాలుగా ప్రచారంలో ఉంది. దక్షిణ భారతదేశంలో కృష్ణయజుర్వేదము, ఉత్తర భారతదేశంలతో శుక్లయజుర్వేదము ప్రచారంలో ఉన్నాయి.
శుక్లయజుర్వేద సంహితకు ‘వాజసనేయ సంహిత ’ అని మరో పేరుంది. ఈ సంహితలో యజ్ఞప్రక్రియకు ఉపయోగించే మంత్రాలు అన్నీ సంహితాభాగంగా ఉంటాయి. కృష్ణయజుర్వేదంలో సంహితాగ్రంథం, బ్రాహ్మణ్యగ్రంథం సంకీర్ణంగా, వేరుగా ఉంటుంది. ఈ వాజసనేయసంహితలో...మాధ్యందినశాఖ, కాణ్వశాఖ అను రెండు శాఖలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండు శాఖల్లోని మంత్రాలన్నీ ఇంచుమించు సమానంగా ఉన్నా., పాఠప్రవచనాల్లో, పఠనక్రమంలో, మంత్రపాఠంలో తేడాలున్నాయి. ఈ శుక్లయజర్వేదంలో నలభై అధ్యాయాలున్నాయి. ఈ నలభై అధ్యాయాల్లోనూ మొదటి ఇరవై అధ్యాయాలు యజ్ఞప్రక్రియకు ఉపయోగపడేవి.తరువాతి నాలుగు అధ్యాయాలు, మొదటి ఇరవై అధ్యాయాలకూ వ్యాఖ్యానరూపంగా కనబడతాయి. ముప్ఫై నుంచి ముప్ఫై తొమ్మిది వరకూ గల అధ్యాయాలు నరమేధ, పితృయజ్ఞ, విశ్వజిద్యాగాది విషయాలు వివరిస్తాయి. నలభైయవ అధ్యాయం ఈశావాస్యోపనిషత్తు.
ఈ వేదం యజ్ఞక్రియా స్వరూపాన్ని బోధించడమేకాక, ఏ ఏ యజ్ఞాలలో ఏ సందర్భంలో ఏ ఋక్కు ఎలా పఠించాలో చక్కగా వివరిస్తుంది. దేవతలకు హవిర్బాగాలిచ్చే క్రియాకలాపమే యజ్ఞం. ఈ యజ్ఞాలు ఏడు పాకయజ్ఞాలనీ, ఏడు హవిర్యజ్ఞాలనీ, ఏడు సోమయజ్ఞలనీ వైదిక సంప్రదాయం చెబుతుంది. కృష్ణయజుర్వేదంలాగ శుక్లయజుర్వేదం ఆధ్యాత్మిక దేవతారాధన ప్రధానంగా ఉన్నప్పటికీ, ఐహికజీవిత సంబంధమైన పుత్ర, పశు, అర్ధసంపత్తి కోసం, అనావృష్టి లేకుండా వర్షంకోసం, యుద్దాలలో శత్రునాశనంకోసం కూడా, దేవతారాదన విడివిడిగా చెప్పబడింది. సూక్ష్మంగా పరిశీలిస్తే మానవుని ఐహిక,ఆధ్యాత్మిక, ఆముష్మిక జీవనానికి యజుర్వేదము గురుస్థానమని చెప్పుటలో సందేహం తలేదు.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం