సుగుణోపాసన నిర్గుణోపాసనలో ఏది గొప్పది?

ఇతర మతాలకు హిందూమతానికి ఒక తేడా ఉంది. ఇతర మతాలలో ఏ ఆకారమూ లేని పరమాత్మను ఉపాసిస్తారు. వారికి దేవుడు ఫలానా ఆకారంలో ఉంటాడు అని విగ్రహాలను, చిత్రాలను రూపొందించుకెజిని పూజించడం అలవాటు లేదు.  మనం మొదట ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో కానీ, లింగ రూపంలో కానీ దేవాలయాలలో దేవుడిని ప్రతిష్ఠించి, పూజించి, క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్లుతాము. అంటే మొదట పూజలు చేస్తాము, దేవుడి విగ్రహాన్ని ఆరాధిస్తాము. నైవేద్యాలు పెడతాము. ఇంకా భక్తి కొద్దీ అభిషేకాలు, వ్రతాలు, ఉత్సవాలు ఇలా జరిపిస్తూ ఉంటాము. తరువాత అవన్నీ కాకుండా క్రమంగా దేవుడిని మనసులోనే భక్తిగా ఆరాధించడం, ధ్యానం, జపము చేయడం చేస్తాము. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే మనలో చాలామంది  మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నాము.

అంటే విగ్రహాలు ప్రతిష్టించడం,దేవాలయాలు కట్టించడం లేదా దేవాలయాలు దర్శించడం, వాటికి అలంకారాలు, పూజలు, నివేదనలు అన్నీ చేయించడం. అంతా అయ్యాక  అవి మేమే చేయించామని గొప్పలు చెప్పుకోవడం, వీటి దగ్గరే అంటే మొదటి మెట్టుమీదనే ఆగిపోతున్నాము. రెండో మెట్టు ఎక్కడానికి కనీసం ప్రయత్నంకూడా చేయడం లేదు. రెండో మెట్టు ఏది అంటే నిర్గుణోపాసన. అంటే దేవుడు ఇలాగే ఉంటాడని కాకుండా అన్నింటిలో దేవుడు ఉన్నాడని అనుకోవడం. 

అయితే విగ్రహాలను పెట్టుకుని పూజించడం సరైనదా?? లేక దేవుడిని నిరాకారంగా అన్నింటిలోనూ ఉన్నాడని పూజించడం సరైనదా అని గీతలో ప్రస్తావించారు 

అర్జునుడు కృష్ణుడితో ఏ భక్తులైతే ఎప్పుడూ నీ మీద మనసు నిలిపి నిన్ను ఇదే ఆకారంతో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసిన వారా లేక అక్షరము, అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ధ్యానించేవారు యోగవిత్తములా? వీరిలో ఎవరు శ్రేష్టులు నాకు వివరించండి అని అర్జుడు అడిగాడు.

కృష్ణా! నువ్వునాకు ఎన్నో ఆకారములతో గూడిన నీ విశ్వరూపాన్ని చూపించావు. చూచాను. మరి ఇదివరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకూ నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా లేక ఏ. ఆకారమూ లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసేవారిలో ఎవరు గొప్పవాళ్లు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా. నిర్గుణోపాసన గొప్పదా వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఏ విధంగా నిన్ను ఉపాసించే వాళ్లు గొప్ప వాళ్లు అని అడిగాడు.

కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది, ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండు సమాన ధర్మములు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. పైన చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ఇవి రెండుమెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తరువాత రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసి తరువాత నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతే కానీ నేరుగా నిర్గుణా పాసన చేయడం కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలోనే ఉ ండి పోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తరువాత రెండో అంతస్తుకు ఎక్కుతాము కానీ ఏకంగా నిచ్చెన వేసుకొని లేక తాడు ద్వారా రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే, జారి, కిందపడి, నడుము విరుగుతుంది.

                                  ◆వెంకటేష్ పువ్వాడ.


More Vyasalu