దేవతలు, రాక్షసులు సముద్రాన్నే ఎందుకు మథనం చేశారు...
దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్దం గురించి కానీ.. దేవతలు, రాక్షసుల మధ్య ఉండే శత్రుత్వం గురించి కానీ మొదటగా తెలిపేది సాగర మథనమే.. అయితే అసలు దేవతలు, రాక్షసులు సముద్రాన్ని ఎందుకు చిలికారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? దేవ,దానవులు సముద్రాన్ని చిలికిన తరువాత ఏమేమి లభించాయి? పూర్తీగా తెలుసుకుంటే..
పురాణాలలో సాగర మథనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే దీని వెనుక కారణం చాలా ఆసక్తిగా ఉంది. ఒకసారి దేవతలకు రాజు అయిన ఇంద్రుడు దుర్వాస ఋుషిని అవమానించాడట. అసలే దుర్వాస మునికి కోపం ఎక్కువ. ఇక ఇంద్రుడు అవమానించే సరికి దుర్వాస మహర్షి ఇంద్రుడిని శపించాడట. తను అధికారం కోల్పోతాడని, స్వర్గలోకం వైభవం కోల్పోతుందని శపించాడు. దీంతో దుర్వాస ముని అన్నట్టే శాపం కారణంగా స్వర్గ వైభవం, దేవతల ఐశ్వర్యాలు, వారి స్థితిగతులు నశించాయి. దీంతో దేవతలు ఎంతగానో కలత చెందారు. మరొక వైపు రాక్షసులు మరింత బలవంతులు అయ్యారు. రాక్షసుల ముందు దేవతలు నిలవలేకపోయారు. ఆందోళనతో మహా విష్ణువును సమీపించారు. తమ సమస్యను విన్నవించుకుని.. తిరిగి స్వర్గానికి వైభవం వచ్చే దారి చెప్పమని వేడుకున్నారు. దీంతో మహావిష్ణువు వారికి ఒక ఉపాయం చెప్పాడు.
స్వర్గ వైభవం తిరిగి తీసుకురావాలంటే మహాసముద్ర మథనం జరగాల్సిందే అని మహావిష్ణువు చెప్పాడు. అది కూడా దేవతలు అందరూ ఒకవైపు, రాక్షసులు మరొకవైపు సాగర మథనం చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. సాగర మథనంలో అమృతం, దివ్యరత్నాలు లభిస్తాయని, అవన్నీ దేవతలకు తిరిగి స్వర్హలోక వైభవాన్ని తీసుకువస్తాయని, ఇంద్రుడు కూడా తిరిగి తన స్థానం సంపాదించుకోగలడని చెబుతాడు. దీంతో దేవ దానవులు సాగర మథనానికి సిద్దమవుతారు.
ఇంద్రుడు సాగర మథనం కోసం రాక్షసులను ఒప్పించడానికి రాక్షస రాజు అయిన బలితో చర్చలు జరిపుతాడు. అమృతం, దివ్య రత్నాల గురించి విన్న బలి కూడా సాగర మథనానికి అంగీకరించాడు. సాగర మథనం కోసం క్షీర సముద్రాన్ని(పాల సముద్రాన్ని) చిలకమని, సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా మంథర పర్వతాన్ని వాడమని, తాడుగా వాసుకిని(పాము) వాడమని మహావిష్ణువు చెబుతాడు. అలా దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనానికి సిద్దమయ్యారు.
సాగర మథనంలో మొదటగా విషం వచ్చింది. ఈ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించిన విషయం తెలిసిందే. విషాన్ని గొంతులో నిలుపుకుని ఉంటాడు కాబట్టే ఈయనను నీలకంఠుడు అని అంటారు. సాగర మథనంలో విషం వచ్చిన తరువాత 14 దివ్య రత్నాలు కూడా ఉద్భవించాయి. ఈ మథనం చివరలో ధన్వంతరి అమృతం కుండతో ఉద్బవించాడట. ఈ సాగర మథనం గురించి తెలుసుకుంటే.. జీవితంలో కష్టాలనేవి సహజంగా వస్తూనే ఉంటాయని, వాటిని ఓర్పుతో సహిస్తేనే చివరకు మంచి ఫలితాన్ని అందుకోగలరని అర్థం అవుతుంది. అలాగే గొప్ప ప్రయత్నాలు చేసేటప్పుడు ఓర్పుగా ప్రయత్నిస్తేనే చివరకు విజయం సాధిస్తారని కూడా అర్థం అవుతుంది.
*రూపశ్రీ.
