పెళ్లికి ముందు అమ్మాయిలు కాళ్లకు గోరింటాకు పెట్టుకోకూడదంటారు ఎందుకుంటే..!

భారతీయ సంస్కృతిలో పదహారు అలంకరణలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటినే షోడష అలంకారాలు అని అంటారు. వీటిలో పాదాలక్తకము కూడా ఒకటి. ఇది లేకుండా అలంకారం అనేది సంపూర్ణం కాదని చెబుతారు. వివాహం అయినా, ఏదైనా మహిళల పాదాలకు పారాణి లేదా గోరింటాకు పూయడం అనేది అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కానీ పెళ్లికాని అమ్మాయిల పాదాల మడమలకు గోరింటాకు పూయరు. చాలామంది అమ్మాయిలు పెట్టుకోవాలని చూసినా, పెట్టుకోవద్దని పెద్దలు వారిస్తుంటారు. అసలు పెళ్లికి ముందు ఎందుకు పెట్టుకోకూడదు? పెళ్లి తర్వాత పెట్టుకోవడానికి కారణం ఏంటి?
పరిపూర్ణత..
గోరింటాకు లేదా పారాణి వంటి ఎరుపు రంగులతో పాదాలు లేదా మడమలను నింపడం సంపూర్ణత లేదా పరిపూర్ణతకు చిహ్నమట. అంతేకాదు.. పెళ్లైన తర్వాతే మహిళ జీవితం ఒక సంపూర్ణ మార్గంలోకి వెళ్లిందని చెబుతారు. అందుకే వివాహానికి ముందు గోరింటాకు పాదాలకు నిండుగా పెట్టుకోకూడదని, పెళ్లి తర్వాత పెట్టుకోవచ్చని నియమాలు పెట్టారు.
కొత్త జీవితానికి నాంది..
పెళ్లికి ముందు కాలి మడమలకు గోరింటాకు పెట్టుకోని అమ్మాయిలు, పెళ్లి తర్వాత నుండి గోరింటాకు పెట్టుకోవడానికి అర్హత పొందుతారు. పెళ్లికి ముందు తండ్రి ఇంటి సంప్రదాయంను, పెళ్లి తర్వాత అత్తింటి వారి సంప్రదాయంను పాటిస్తారు. మొదటిసారి పెళ్లిలో పాదాల మడమలకు గోరింటాకు పెట్టడం ద్వారా కొత్త జీవితంలోకి ఆమె అడుగు పెడుతుంది. ఈ కారణంగా ఈ గోరింటాకు పెట్టుకోవడం అనే నిబంధన కూడా కొత్త జీవితానికి ముడి పడి ఉంది.
అదృష్టం, ఆనందం..
వివాహం అయిన స్త్రీలు పాదాలకు నిండుగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆమె నడిచే ఇంటికి అదృష్టం ప్రాప్తిస్తుందట. ఆమె నడుస్తుంటే సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి సంబరపడుతుందట. అంతేకాదు.. పాదాలకు గోరింటాకు పెట్టుకునే వివాహిత మహిళలు తమ భర్తలతో విడదీయరాని అనుబంధం కలిగి ఉంటారట.
పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం కేవలం సంస్కృతి , సంప్రదాయమే కాదు.. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల పాదాలను చల్లబరుస్తుంది, మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. చెట్టు నుండి కోసిన ఆకుతో చేసిన పేస్ట్ లో ఔషద గుణాలు ఉంటాయి. ఇవి పగిలిన మడమలను రిపేర్ చేస్తాయి. మడమల నొప్పులను తగ్గిస్తాయి. చాలా రకాల సమస్యలను తగ్గిస్తాయి. వివాహం తర్వాత ఆడవారి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మడమలకు పెళ్ళికి ముందు గోరింటాకు పెట్టుకోరు. పెళ్లి తర్వాత మాత్రమే పెట్టుకోవాలని చెబుతారు.
*రూపశ్రీ.



