సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను కోస్తే ఏమవుతుంది...
హిందూ సనాతన ధర్మంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కను దైవంగా పూజించడమే కాదు.. దైవ పూజలో తులసి దళాలను సమర్పిస్తారు కూడా. తులసిని సమర్పించడం వల్ల శ్రీమన్నారాయణుడు సంతృప్తి చెందుతాడు. ఏదైనా పూజ కోసం తులసిని కోయాల్సి వస్తే అది సూర్యాస్తమయం లోపే జరగాలని, సూర్యాస్తమయం తర్వాత తులసిని కోయడం మంచిది కాదని అంటుంటారు. అసలు తులసిని మొక్క నుండి కోయడానికి సరైన సమయం ఏది? సూర్యాస్తమయం తర్వాత తులసిని కోస్తే ఏమవుతుంది? తెలుసుకుంటే..
తులసి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని అందుకే తులసి దళాలు సమర్పిస్తే ఆ శ్రీమహావిష్ణువుకు చాలా ప్రీతి అని అంటారు. తులసిని ప్రతి రోజూ పూజిస్తే ఆర్థిక సంబంధ సమస్యలు తీరతాయట. అంతేకాకుండా నిత్య తులసి దగ్గర దీపం వెలిగించి పూజించే వారికి సంతోషం, ఐశ్వర్యం చేకూరతాయట.
ఏరోజైనా పూజకోసం తులసి మొక్క నుండి తులసి దళాలను కోయాల్సి వస్తే వాటిని సూర్యాస్తమయం లోపే తీయాలి. కొందరు తెలిసీ తెలియక లేదా సాయంత్రం పూజకు కావాలి అనే ఆలోచనతో సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి దళాలు కోస్తుంటారు. ఇలా చేయడం వల్ల అలా తులసి దళాలు సూర్యాస్తమయం తరువాత కోసే వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు నెలకుంటాయట.
సూర్యాస్తమయం తరువాత తులసి దళాలు కోస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుందట. అంతేకాదు శ్రీమన్నారాయణుడు కూడా ఆగ్రహిస్తాడు. దీనివల్ల మనిషి జీవితంలో ఆర్థిక సమస్యలు మొదలవుతాయట. క్రమంగా వారి ఆర్థిక స్థితి దిగజారుతుందట. సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను కోసేవారికి కుటుంబంలో ఇబ్బందులు కలుగుతాయి. ఇతరులతో సంబంధాలు క్షీణిస్తాయట.
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను మొక్క నుండి కోస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని అంటున్నారు. అందుకే సూర్యాస్తమయం తరువాత తులసి దళాలు కోయరాదు. ఇది మాత్రమే కాకుండా ఏకాదశి, రాత్రి సమయం, అమావాస్య, సూర్య, చంద్ర గ్రహణాల కాలంలో కూడా తులసి ఆకులను మొక్క నుండి కోయకూడదు. ఈ రోజుల్లో తులసి కోయడాన్ని హిందూ ధర్మం, శాస్త్రాలు నిషేధించాయి.
ఇక లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం కావాలంటే ప్రతిరోజూ సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి.
*రూపశ్రీ.
