పరమ గతిని పొందేది ఎవరు?

మనిషి తన జీవితంలో చివరగా పొందేది పరమ గతి. పరమాత్ముడి ఆశ్రయాన్ని అంటే పరమాత్మ దగ్గరకు చేరుకోవడం, ఆయనలో లీనమవ్వడం. దీన్నే మోక్షం అని కూడా అంటారు. 

మనిషి ఎంత భక్తిగా ఉన్నా, ధ్యానం గురించి, ముక్తి గురించి ఎంత తెలిసినా, ఎప్పుడూ దేవుడిని అంటిపెట్టుకుని ఉన్నా, మొత్తం ప్రపంచమంతా నిండి ఉన్నది ఆ పరమాత్మనే అనే విషయాన్ని తెలుసుకోలేకపోతే ఆ వ్యక్తి పరమగతిని పొందలేడు అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. ఆ విషయాన్ని కింది విధంగా వివరించారు.

సమం పశ్యని సర్వత్ర సమవస్థిత మీశ్వరమ్ |
న హీనస్త్యాత్మనా? త్మానం తతో యాతి పరాంగతిమ్ || 

సకల ప్రాణికోటిలో సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను చక్కగా తెలుసుకుంటూ, తనలో ఉన్న ఆత్మ అందరిలో ఉంది అన్న జ్ఞానం కలిగి తనను గానీ, ఇతరులను కానీ ఎటువంటి హింసకు లోనుచేయకుండా ఉంటాడో అతడే పరమ గతిని పొందుతాడు.

మనం పరమాత్మను ఈ లోకంలో సర్వత్ర అంటే అంతటా, సమం అంటే సమంగా, పశ్యన్తి చూడగలగాలి. అంటే పరమాత్మ అన్ని జీవరాసులలోనూ సమంగా నిండి ఉన్నాడు. ఒకరిలో ఎక్కువ ఒకరిలో తక్కువ లేదు. రాజులోనూ, బంటులోనూ, ధనికుడిలోనూ పేదవాడిలోనూ సమంగా ఉన్నాడు. సర్వత్ర అంటే అన్ని జీవరాసులు, అన్ని పదార్ధములు, మనం చేసే అన్ని పనులలో కూడా పరమాత్మ చైతన్యస్వరూపంగా ఉన్నాడు. ఈ విషయం తెలియని మానవులు ఎదుటి వారిని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. అవమానిస్తున్నారు, చంపుతున్నారు. తద్వారా తాను బాధలు పడుతున్నాడు. సుఖదు:ఖాలు మానవ మానాలు అనుభవిస్తున్నాడు.

అంటే తనలో ఉన్న ఆత్మను హింసించుకుంటూ, ఎదుటి వారిలో ఉన్న ఆత్మను కూడా హింసిస్తున్నాడు. 

 (లౌకికంగా చూస్తే హత్యలు, ఆత్మహత్యలకు ఇదే కారణము. భార్యను, కన్నబిడ్డలను చంపి తానుకూడా ఆత్మహత్య చేసుకుంటున్న వారిని ఎంతో మందిని చూస్తున్నాము. ఎందుకు చంపుతున్నాడో, ఎందుకు చస్తున్నాడో వాడికే తెలియదు. అదే అజ్ఞానము). 

ఇది లౌకికము,  ఆధ్యాత్మికంగా చూస్తే, ఎవరైతే తనలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోలేదో, వాడికి ఆత్మ లేనట్టే. వాడి ఆత్మను వాడు హింసించుకున్నట్టే. ఎందుకంటే వాడికి ఆత్మగురించి తెలియదు. ఈ దేహమే నేను అనుకుంటున్నాడు. ఆత్మతత్వము తెలుసుకొన్నవాడు దేహాభిమానమును వదిలిపెడతాడు. భేదబుద్ధిని పాటించడు. అందరినీ సమానంగా చూస్తాడు. అటువంటప్పుడు తాను సుఖంగా, శాంతిగా ఉంటాడు. ఇతరులను శాంతిగా ఉంచుతాడు. అందరూ శాంతిగా ఉంటారు. కాబట్టి ప్రకృతి, పురుషుల గురించి సరి అయిన అవగాహన ఉన్నవాడు, ప్రకృతికి భయపడడు. మృత్యువుకు భయపడడు. పరమ గతిని పొందుతాడు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu