అసంగము గురించి భగవద్గీతలో వివరణ!

న రూపమస్యేహ తథోపలభ్యతే నాన్తో న చాదిర్న చ సమ్రతిష్ఠా౹౹
అశ్వత్థమేనం సువిరూఢ మూలమసఙ్గశస్త్రేణ దృఢన ఛిత్వా౹౹

ఈ సంసారము అనే వృక్షము గురించి తెలుసుకోవడంలో గొప్పేముంది అనుకుంటే పొరపాటే, అంటే ఈ సంసారవృక్షం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. ఈ సంసార వృక్షము యొక్క ఆది అంతములు ఎవరికీ తెలియవు. ఎందుకంటే ఈ సంసారవృక్షం ఈ నాటిది. కాదు. దీని ఆది తెలియదు అంతము తెలియదు. మధ్యలో ఏముందో అసలే తెలియదు. పోనీ దీనికి ఒక రూపం ఉందా అంటే అదీ లేదు. కాని ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సంసారము ఈ విధంగా ఉంటుంది అని ఎవరూ నిర్వచించలేరు. ఎందుకంటే దాని స్వరూపము ఇలా ఉంటుంది అని ఎవరూ ఊహించలేరు. ఈ సంసారము అనే వృక్షముయొక్క వేళ్లు బాగా పాతుకొని పోయి విశాలంగా విస్తరించి ఉన్నాయి. ఎక్కడెక్కడికో పాకిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ సంసారము గురించి తెలుసుకున్నవాడు ఇప్పటి వరకూ ఎవరూ లేరు. అంతా ఈ సంసారము అనే మాయలో పడ్డవాళ్లే కాని సంసారము గురించి తెలుసుకున్న వాళ్లు లేరు. సముద్రములో మునిగిన వాడికి దాని ఆది అంతము తెలియదు. అలాగే ఈ సంసారము అనే సముద్రములో మునిగిన వాడికి దాని ఆది అంతము లోతు తెలియదు కదా. అంత బలమైనది ఈ సంసార వృక్షము.

ఈ సంసారవృక్షమును నరకడానికి ఒకే ఒక కత్తి ఉంది. అదే అసంగము. వైరాగ్యము. అంటే సంసార విషయములలో ప్రాపంచిక విషయములలో అంటీ అంటనట్టు ముట్టినట్టు వ్యవహరించడం, ప్రాపంచిక విషయాల మీద ఆధారపడకుండా, పరమాత్మ మీద ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. ఈ ఆస్తి, ఈ కారు, ఈ సంపదలు, ఇంతడబ్బు ఉంటే కానీ నాకు జీవనం గడవదు అనే ప్రాపంచిక సంగము వదిలిపెట్టాలి. ఇవన్నీ పరమాత్మ ప్రసాదము అనే భావనతో ఉండాలి. దీనినే రాగము, సంగము లేకపోవడం అంటే విరాగము అంటే వైరాగ్యము, అసంగము అని అంటారు. అసంగంగా ఉన్నంత వరకు ఈ వృక్షము ఎవరినీ ఏమీచేయలేదు. ఒకవేళ ఈ సంసారము అనే మాయలో పడ్డవాళ్లు, అసంగము అనే కత్తితో దానిని నరికివేయగలరు. ఏదో పైపై కొమ్మలు, రెమ్మలు కొట్టేస్తే సరిపోదు. ఎందుకంటే ఈ సంసారవృక్షము వేగంగా చిగురిస్తుంది. కాబట్టి దృఢమైన చిత్తముతో, అసంగము అనే కత్తితో వేళ్లతో సహా నరికివేయాలి. ఈ సంసారము అనే రావి చెట్టును మూలంతో సహా నరికివేస్తేనే, పరమపదము చేరుకోగలరు. మరలా ఈ సంసారము, పునర్జన్మ పొందరు.

ఇందులో సంసార వృక్షమును గురించి అంత భయంకరంగా వర్ణించారు. ఈ సంసార వృక్షము వేళ్లు చాలా ధృఢమైనవి. బాగా పాతుకుపోయి ఉన్నాయి. ఓ పట్టాన పెకలింపబడవు. ఈ సంసార వృక్షము చాలా కాలం నుండి ఉండటం వలన దాని కాండము బలంగా ధృఢంగా ఉంది. వామ్మో ఇంత పెద్దది లావుది దీనిని ఎలా నరకడం అని ఏ మాత్రం దిగులుపడవద్దు అంటున్నాడు పరమాత్మ. ఇంత పెద్ద వృక్షానికి కూడా చిన్న కత్తి చాలు. అదే అసంగము.

దేనితోనూ సంగం పెట్టుకోకపోవడం. నిర్లిప్తంగా ఉండటం. ఈ కత్తితో ఈ సంసారము అనే వృక్షాన్ని సమూలంగా నరికివేయవచ్చు. అసంగము అంటే ఏమిటి. రాగము అంటే కోరికలు లేకపోవడం. ప్రాపంచిక విషయములలో అంటీముట్టనట్టు ఉండటం. కాని ఇది అంత సులభం కాదు. పూర్వము విశ్వామిత్రుడి లాంటి మహా ఋషులే ఈ సంసార వృక్షమును ఛేదించలేకపోయారు. దేనిని జయించినా కోపమును కోరికలను జయించలేకపోయారు. ఒకసారి ఈ సంసారము అనే వృక్షమును నరికిన తరువాత మనం ఈ ప్రపంచం మీద, ప్రాపంచిక విషయాలమీద, విషయ వాంఛలమీదా ఆధారపడటం మానేస్తాము. పరమాత్మమీద ఆధారపడతాము. మనం ఏమిటో తెలుసుకుంటాము. నేను ఈ శరీరం కాదు ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం పొందుతాము. 

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu