సాధనలో అంతరార్థం!

అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే, మనసు బయట ప్రపంచములో విహరించకుండా నిలకడగా, నిశ్చలంగా ఉంటుంది. దీనికి అభ్యాసము కావాలి. ఏమీ చేయకుండా మనసును కట్టడి చేయాలంటే సాధ్యం కాదు. నిరంతర అభ్యాసము అంటే ప్రతిరోజూ అభ్యాసము చేయాలి. ఏదో నాలుగు రోజులు చేసి నా మనసు నా స్వాధీనములో ఉందని సంతృప్తి పడకూడదు. అందుకే నిరంతరము ధ్యానము చేయాలి. ధ్యాన సమయములో మనసును అటు ఇటు పోకుండా కట్టడి చేయాలి. అభ్యాసముతో సాధ్యపడనిది ఏదీ లేదు. దీనినే పతంజలి యోగశాస్త్రములో కూడా చెప్పబడింది. "సతు దీర్ఘకాల నైసర్వసత్కారసేవితో ధృఢభూమి:" అంటే దీర్ఘకాలము అభ్యాసము చేస్తే మనో నిగ్రహము సాధ్యమే.

అసలు మొదలు పెట్టకుండా "అబ్బే ఇది మనవలన కాదండీ శుద్ధ దండగ. ఏవేవో చెబుతుంటారు. అవన్నీ మనకు సాధ్యపడతాయా ఏమన్నానా!" అని దీర్ఘం తీస్తూ కొట్టిపారేయడం విజ్ఞత కాదు. ఆరంభించరు నీచమానవులు అనే వాక్యము ఇక్కడ వర్తిస్తుంది. ముందు ఆరంభించి కొంత కాలము చేసి అప్పటికీ సాధ్యపడకపోతే అప్పుడు ఆలోచించాలి కానీ, అసలు మొదలు పెట్టకుండా ఇది మనవల్ల కాదు అనడం అవివేకము. మామూలుగానే చిన్న పరీక్ష పాసు కావాలన్నా కష్టపడి చదవాలి. సంగీతం, నృత్యం, నటన, రావాలంటే అభ్యాసము చేయాలి. కేవలం లౌకిక విషయాలు నేర్చుకోవాలంటేనే అభ్యాసము అవసరమైనపుడు, బలమైన, చంచలమైన మనసును నిగ్రహించడానికి ఎంతటి అభ్యాసం అవసరమో ఆలోచించండి. 

కాబట్టి బాహ్యప్రపంచములోని విషయముల మీద అనవసరమైన ఆసక్తిని వదిలిపెట్టి, నిరంతర అభ్యాసము చేస్తే మనసు స్వాధీనం అవుతుంది అనే విషయాన్ని  స్పష్టంగా అర్థం చేసుకోవాలి.  ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది. మీరు గమనించారో లేదో, మన మనసు మనకు బాగా ఇష్టం అయిన దానిమీద ఎక్కువసేపు లగ్నం అయి ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంది. చింతిస్తుంది. అదే కావాలంటుంది. మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే, మన మనసు మనకు ఇష్టం అయిన దానిమీదకు మాటిమాటికీ పోతుంటుంది.

ఉదాహరణకు మనకు ఇష్టం అయిన సినిమా గానీ, సీరియల్ గానీ, క్రికెట్ మాచ్ గానీ, దీవిలో వస్తూ ఉంది అని అనుకుందాము. మన మనసు దాని మీద పూర్తిగా లగ్నం అవుతుంది. ఆకలి, దప్పిక, ఆఫీసు, కాలేజీ, ఇల్లు, అన్ని మరిచిపోతాము. ఇది మనసుకు సహజ లక్షణం. అదే విధంగా మన మనసును ఆత్మ దర్శనం మీద లగ్నం చేస్తే ఎలా ఉంటుంది. దానికి మనం చేయాల్సిన పని, ప్రాపంచిక విషయాల మీద కాకుండా, ఆత్మ మీద పరమాత్మ మీద ఆసక్తిని, అనురక్తిని, ఇష్టాన్ని, పెంచుకోవాలి. అప్పుడు మన మనసు కూడా ఆత్మయందు నిలకడగా ఉంటుంది. దానినే వైరాగ్యము అంటారు అంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని తగ్గించుకొని ఆత్మ తత్వము మీద ఆసక్తిని పెంచుకోవడం. దానికి నిరంతర అభ్యాసం కావాలి. మనసు బలమైనది, ధృడమైనది, దానిని కట్టడి చేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేస్తారు అందరూ  దానికి సమాధానంగా అందరూ  పట్టుదలతో చేస్తే సాధించలేనిది ఏది లేదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. సాధన చేసి ఏదైనా సాధించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ. 


More Aacharalu