వివేకం గలవాడికి వివేకం లేనివాడికి తేడా?

సంకల్ప ప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వానశేషతః॥ మనసైవేన్డ్రియగ్రామం వినియమ్య సమన్తతః॥


మన మనసులలో కలిగే సంకల్పముల వలన పుట్టే కోరికలను అన్నిటినీ పూర్తిగా, ఏ మాత్రం మిగలకుండా విడిచిపెట్టి ఆ మనసుచేతనే ఇంద్రియములను బాహ్యప్రపంచములో నుండి వెనక్కు మరల్చి, తన అధీనంలో ఉంచుకొని, బుద్ధిని ధైర్యంతో బలోపేతం చేసి, మెల్ల మెల్లగా శాంతిని పొందాలి. మనసులో ఆత్మను తప్ప మరొక విషయమును తలంచకూడదు. అలా చేస్తేనే మనస్సు ఆత్మను దర్శించగలుగుతుంది.

సంకల్ప ప్రభవాన్ కామాన్ అంటే కోరికలు సంకల్పము నుండి ప్రభవిస్తాయి అంటే పుడతాయి. మనలో చెలరేగే కోరికలు అనే మొక్కలకు మనసులో మెదిలే సంకల్పములు విత్తనములు వంటివి. కాబట్టి మొట్ట మొదట సంకల్పములు అనే విత్తనములను నాశనం చేయాలి. ఇది ఎలాగా అంటే మన మనసులో ఒక ఆలోచన మెదలగానే దాని గురించి పట్టించుకుంటే అది కోరికగా మారుతుంది. ఆ ఆలోచనను మనం పట్టించుకోకపోతే, ఆ ఆలోచన క్రమక్రమంగా ఆవిరైపోతుంది. మరలా అదే ఆలోచన వస్తుంది. ఈ సారి కూడా దాని మొహం చూడకుండా ఉంటే చాలు. దానంతట అదే పోతుంది. అలా కాకుండా మనసులో మెదిలే ప్రతి ఆలోచననూ మనం పట్టించుకుంటే ఆ ఆలోచనలు కోరికలై ఆ కోరికలు తీరేదాకా మనసును అల్లకల్లోలం చేస్తాయి. మనసులో మెదిలే సంకల్పములను పట్టించుకోకుండా ఉండాలంటే వివేకము వైరాగ్యము కావాలి. ఇవి సంకల్పముల స్థితిలోనే కోరికలను తుంచివేస్తాయి.

(దీనికి సరి అయిన ఉదాహరణ మన కంప్యూటర్ లో ఉన్న మైల్ బాక్స్, మన మైల్ బాక్స్లోకి పనికిమాలిన, అనవసరమైన ప్రమాదభరితమైన మైల్సు ఎన్నో వస్తుంటాయి. వాటిని అన్నిటినీ ఓపన్ చేస్తే ప్రపంచంలో ఉన్న వైరస్ అంతా మన కంప్యూటర్లోకి వచ్చి చేరుతుంది. కంప్యూటర్ క్రాష్ అవుతుంది. ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలా కాకుండా మనకు తెలియని మైలన్నీ ఏ మాత్రం పట్టించుకోకుండా, అవేమిటో తెలుసుకుందామనే కోరికతో ఓపన్ చెయ్యకుండా, నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేస్తే, కంప్యూటర్ సురక్షితంగా ఉంటుంది. అలాగే మన మనసులో సంకల్పం పుట్టగానే దాని గురించి పట్టించుకోకుండా, సంకల్పంగా ఉండగానే దానిని సమూలంగా తుడిచివేయాలి.)

సర్వాన్ అశేషతః అంటే మనం సంకల్పంచే అన్ని కోరికలను ఏమాత్రం శేషం మిగలకుండా నాశనం చేయాలి. ఏవో నాలుగు కోరికలు మాత్రం వదిలిపెడతాము అంటే కుదరదు అందుకే సర్వాన్, అశేషతః అని రెండు విశేషణములు వాడాడు. అంటే సకలమైన కోరికలు ఏ మాత్రం శేషం లేకుండా అని అర్థం. తరువాత మనసును ప్రాపంచిక విషయముల నుండి లోపలకు మరల్చాలి. వినియమ్య అన్నాడు. సాధారణంగా నియమ్య అంటే నియమించడం అంటే ఇంద్రియములను మనసును నియమించాలి అని అర్ధం. కాని వినియమ్య అంటే బాగుగా, చక్కగా, అని అర్థం. సమస్తః అంటే అన్ని వైపుల నుండి మనసును ఇంద్రియములను లాగుకొని వచ్చి చక్కగా నియమించాలి.

ఈ పని చేయడానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధికి ధైర్యం ఉండాలి. మనసుకు లొంగి పోకూడదు. వివేకము, శాస్త్రజ్ఞానము లేని వాళ్లకు మనసు చెప్పినట్టు బుద్ధి వింటుంది. అదే వివేకం కల వాళ్లలో, బుద్ధి చెప్పినట్టు మనసు వింటుంది. బుధ్యా ధృతి గృహీతయా అన్నాడు. అంటే ధైర్యముతో కూడిన బుద్ధితో మనసును నిగ్రహించాలి. కాబట్టి సాధకుడి యొక్క బుద్ధి, అతడి మనసు మీద అధికారం కలిగి ఉండాలి. ఇక్కడ బుద్ధి అంటే శాస్త్ర జ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మ, మనసు, బుద్ధి, చిత్తము వీటి గురించిన పరిజ్ఞానము లేకుండా ధ్యానం చేయడం కష్టం. కాబట్టి ముందు శాస్త్రజ్ఞానము అవసరము. శాస్త్రజ్ఞానముతో కూడిన బుద్ధి మనసును చక్కగా అదుపులో పెట్టగలుగుతుంది. 

                              ◆ వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu