లంకలో కనిపించిన అపశకునములు ఏంటి?

నిండు సభలో విభీషణుడు రావణుడి ఆస్థానంలో ఉన్న అందరినీ గట్టిగా అడిగేసరికి ఎవరూ నోరు విప్పలేదు. 

"వీళ్ళందరూ నేను చెబుతున్న మాటలు వింటున్నారేమో ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలి" అనుకున్నాడు విభీషణుడు ఆ తరువాత అందరితో "మీరు ఒక్కసారి ఆలోచించండి. రాముడు యుద్ధానికి రావలసిన అవసరం ఏమిటి? రాముడి భార్య అయిన సీతమ్మని మా అన్న రావణుడు ఎత్తుకొచ్చి అశోక వనంలో పెట్టాడు. అందుకని రాముడు తన భార్యను విడిపించుకోవడానికని యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం రాముడి పట్ల ఉంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడ ఉంటారు. కావున దేవతల అనుగ్రహం రాముడికి ఉంటుంది. మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళదామని ఎలా అనుకుంటున్నారు. ఏ రకంగా చూసినా రాముడిదే పైచేయి. లంకకి, రాక్షసులకి, రావణుడికి ఉపద్రవం రాకూడదు అనుకుంటే, ఏ సీతమ్మ కారణంగా ఇటువంటి కలహం వస్తోందో, ఆ సీతమ్మని రాముడికి అప్పగిస్తే రాముడు యుద్ధానికి రాడు. తప్పు చేసింది మనం, ఆ తప్పుని సమర్ధించుకోడానికి ఇన్ని కోట్ల మందిని ఫణంగా పెట్టడం మంచిది కాదు. నా మాట విని సీతమ్మని. ఇచ్చేయ్యండి" అన్నాడు.

విభీషణుడు చెప్పిన మంచి మాటలు చెవికి ఎక్కని రావణుడు తన మంత్రులని ఆ సభ నుండి వెళ్ళమని చెప్పి, తాను కూడా వెళ్ళిపోయాడు. విభీషణుడు మరునాడు ఉదయం రావణుడు ఉన్న గృహానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. బ్రాహ్మణులు స్వస్తి వాచకాలు చెబుతున్నారు. పూజలు, అగ్ని కార్యాలు జరుగుతున్నాయి. రావణుడు ఒక మంచి తల్పం మీద కూర్చుని ఉండగా విభీషణుడు అక్కడికి  తల వంచి నమస్కరిస్తూ వెళ్ళి "అన్నయ్య! నిన్న నీకు సభలో కొన్ని విషయాలు చెబుతుంటే వెళ్ళిపోయావు కదా. నీకు కొన్ని విషయాలు ఆంతరముగా చెబుదాము అనుకున్నాను. ఎందుకంటే, ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు. నీ మంత్రులకి కూడా తెలుసు. కాని నీకు భయపడి ఎవరూ నీతో చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నని రక్షించుకోనివాడిని అవుతానని, నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చాను.

నువ్వు ఏనాడైతే సీతమ్మని అపహరించి లంకకి తీసుకోచ్చావో, ఆనాటినుండి నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఎప్పుడైనా హోమం చేద్దామని నాలుగు పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే, ప్రారంభం నుండి కూడా అగ్ని పెద్దగా పైకి రావడం లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. అన్ని హోమగుండాలలోని అగ్ని కూడా పొగతోనే ఉంటుంది, నిప్పురవ్వలు బయటకి కనపడుతున్నాయి. అగ్నిశాలలోకి, వేదశాలలోకి, పూజా గృహంలోకి విశేషంగా పాములు వస్తున్నాయి. అన్నిటినీమించి తెల్లవారుజామున హోమం చేద్దామని పాయసం కాని, తేనె కాని పెట్టుకుంటే, వాటినిండా చీమలు పట్టి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైన శకునములు.

ఆవు పాలు తీసుకొని వచ్చి పెట్టగానే అవి విరిగిపోతున్నాయి. ఏనుగులకు మదజలాలు కారకుండా అలా నిలబడి ఉంటున్నాయి. గుర్రాలు ఉత్సాహంగా సకిలించడం లేదు. దీనంగా సకిలిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తున్నాయి. గాడిదలు, కంచర గాడిదలు, ఒంటెలు మొదలైన జంతువుల మీద ఉన్న వెంట్రుకలు తమంతట తాముగా ఊడి పడిపోతున్నాయి. పశు వైద్యులని తీసుకొని వచ్చి వాటికి వైద్యం చేయించినా, ఈ జాతి మృగాల మీద వెంట్రుకలు నిలబడడం లేదు. కాకులు గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్ళ మీద కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి. ప్రతిరోజు గ్రద్దలు ఇళ్ళ మీద కూర్చుంటున్నాయి. అరణ్యంలో ఉండే నక్కలు పగటివేళ, రాత్రివేళ ఊరి పోలిమేరలకొచ్చి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలు భయంకరమైన ధ్వనులు చేస్తున్నాయి. అందుకని సీతమ్మని తీసుకెళ్ళి మనం రాముడికి అప్పచెప్పేద్దాము" అన్నాడు.

అప్పుడు రావణుడు విభీషణుడి వంక కోపంగా చూసి "ఇవన్నీ నీకు ఎక్కడ కనపడుతున్నాయి రా. నాకు ఎక్కడా కనపడడం లేదు. రాముడు యుద్ధానికి దేవేంద్రుడిని తీసుకొని వచ్చినా సరే, సీతని ఇవ్వను. ఇక నువ్వు వెళ్ళవచ్చు" అన్నాడు. విభీషణుడు తల వంచుకొని వెళ్ళిపోయాడు.

                                 ◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories