ప్రేమకు ప్రతి రూపం దమయంతి

 

సాధారణంగా 'కలి' దోషం పోవడానికి నల దమయంతుల జీవిత చరిత్ర చదవండి, వినండీ అని చెప్తారు. అది వేరే విషయం. నేను కొంత భాగం అంటే దమయంతి ప్రేమ మరియు వివాహం ఇంతవరకే తీసుకుంటున్నాను.

మన పురాణాల్లో పెద్దగా తెలీని గొప్ప ప్రేమకథ నల దమయంతి ల ప్రణయం. ప్రేమకు మాత్రమే కాదు వివాహం తర్వాత సహధర్మచారిణిగా గా కూడా దమయంతి ఎంతో ఆదర్శనీయురాలు.ముఖ్యముగా నేటి యువతకు. ప్రతి ఒక్కరూ ఈకథ చదవాలి. ప్రేమ గొప్పతనం తెలుసుకోవాలి.

"నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.

◆హంస రాయబారం

ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసలగుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి..గుణగణాల గురించి చెప్పి..నీమీద అనురాగం కలిగేలా చేస్తాను" అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెట్టాడు. 

ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.

◆దమయంతి స్వయంవరం

నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమమహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్నందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయం వరానికి బయలుదేరాడు. మార్ద్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో "నిషధ రాజా !నీవు నాకు దూతగా పని చేయాలి" అన్నాడు. నలుడు "అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చేయాలి?" అని అడిగాడు. ఇంద్రుడు నలునితో "నేను ఇంద్రుడను. వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి..ఆమె మమ్ములను వరించేలా చేయాలి" అన్నాడు. నలుడు ఇంద్రునితో "అయ్యా! నీకిది ధర్మమా? నేను కూడా అదే పనిమీద పోతున్నాను కదా" అన్నాడు. ఇంద్రుడు నలునితో "నీవు మాకు మాటిచ్చావు కనుక, ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతాకార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమచేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు" అన్నాడు. 

గత్యంతరం లేక, నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటి సారిగా చూసి, 'హంస చెప్పినదాని కంటే దమయంతి సౌందర్యవతి' అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలికత్తెలు నలుడుని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి "మహాత్మా మీ రెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు?" అని అడిగింది. 
నలుడు దమయంతితో "నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు, వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు" అన్నాడు. అది విని దమయంతి సంతోషంతో ఎగిరి గంతేయలేదు. దేవతలే నన్ను వరించడానికి వచ్చారని మురిసిపోలేదు. నలుని మాటలకు ఆమె ఎంతగానో బాధపడింది. "అయ్యా! నేను మానవకాంతను. నమస్కరించ వలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు, నిన్నే నా భర్తగా తలచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించాడు. మీరే నాభర్త, కనుక నన్ను స్వీకరించండి. లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కాని, ఆ ముక్కోటి వచ్చి వరించినా నేను అంగీకరించను" అని దమయంతి నులుడిని ప్రార్థించింది. ప్రస్తుతం ఇలాంటి ప్రేమను మనం ఊహించగలమా?

నలుడు దమయంతితో "దమయంతీ! దేవతలు ఐశ్వర్యవంతులు, జనన మరణాలు లేని వారు, వారిని కాదని జనన మరణాలకు ఆలవాలమైన నన్ను కోరడం న్యాయమా?" అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో "నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్ధించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు" అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు "దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము" అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవరమండపంలో ఒకేసారి ఐదుగురు నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకుని వచ్చింది. నలుడు రూపంలో అయిదుగురు ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన ప్రేమ తో  మనస్సులో ధ్యానించి "దేవతలారా! నలుని గుర్తు పట్టడంలో నాకు సహకరించండి. మీ నిజరూపాలతో ప్రత్యక్షం అవండి" అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షం అయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు.

◆వెంకటేష్ పువ్వాడ

 


More Purana Patralu - Mythological Stories