శుక్రాచార్యుడి మీద దేవయాని ప్రభావం!

శుక్రాచార్యుడి కూతురు దేవయాని. ఆమెను వ్యక్తిత్వపరంగా గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు యయాతి వేటకు వచ్చినప్పుడు దేవయాని బావిలో నుండి దీనంగా పిలిచి కాపాడమని అడుగుతుంది. ఆమెను చూసి జాలిపడి చెయ్యి అందించి ఆమెను బయటకు తెచ్చి యయాతి తన దారిన తాను వెళ్ళిపోతాడు. కానీ దేవయాని శుక్రాచార్యుడితో యయాతి ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకున్నాడో అప్పుడే నాకు భర్తగా అయిపోయాడు. అతడితో పెళ్లి జరిపించండి అని అడుగుతుంది.


శుక్రాచార్యుడికి కూతురు అంటే చెప్పలేనంత ప్రేమ. శుక్రాచార్యుడికి తెలిసిన మృతసంజీవని విద్య వల్ల రాక్షస బలగం మొత్తం అతడి చేతిలో ఉంది. ఆయన మాట కాదంటే ఏమవుతుందోనని యయాతి దేవయనిని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడు. దేవయానితో పాటు శర్మిష్ఠను కూడా యాయతికి ఇచ్చి పెళ్లి చేసి పంపుతాడు శుక్రాచార్యుడు. కానీ శర్మిష్ఠకు ఎలాంటి సుఖాలు దక్కకుండా, మహారాణిగా ఉండకూడదని నియమాలు పెడతాడు. 


దేవయాని అహంకారవతి. తాను అనుకొన్న పని ఏ విధంగానైనా సాధించుకొనే గండ్రగొండి. తన మనసు కచుడిమీదనే లగ్నమైనది కాబట్టి అతడే తన భర్త అని మొదట వాదించింది. అతడు ధర్మాన్ని చూపి ఆమెవలపు అధర్మమని నిరూపించేసరికి పడగచితికిన పాము తోకతో కాటేసినట్లు కచుడిని శపించి పగ తీర్చుకుంది. ప్రేమ త్యాగాన్ని, సహనాన్ని కోరుతుంది కాని పగనూ శాపాలనూ రెచ్చగొట్టదు. దేవయాని స్వార్థపరురాలైన అహంకార ప్రణయిని. ఆమె స్వార్థంముందు పితృభక్తి, రాజభక్తి, స్నేహ భర్తప్రవృత్తి అన్నీ దాసోహ మనవలసిందే.


యయాతి ధర్మపాలకుడైన ప్రభువు. రక్షించమని కోరిన దేవయానిని బావినుండి పైకి తీసి కాపాడాడు. తన ధర్మం తాను నిర్వహించినట్లు నిజపురికి తిరిగి వెళ్ళాడు. దేవయాని సౌందర్యంమీద అతడు కన్నెత్తలేదు. అది అతని ధర్మ ప్రవృత్తికి చక్కని నిదర్శనం. దేవయాని యయాతిని వివాహం ఆడటానికి 'పాణిగ్రహణం' అనే ఒక పదం ఎంచుకుంది. చేయి చేయి కలిసింది కాబట్టి యయాతితో తనకు పెళ్లైపోయిందని వాదించింది. అది వితండవాదం అనటానికి వీలులేదు కాని 'సమయానుకూలవాదం' అనవచ్చును. దానిని ఒకధర్మంగా ప్రతిపాదించింది. ఆమె చూపించిన ఆ ధర్మం అధర్మం అని భావిస్తున్న యయాతికి శుక్రాచార్యుడిచేత అది ధర్మమని చెప్పించి ఒప్పించాలనే ప్రయత్నం చేసింది. తండ్రిని తన అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడమని కోరింది. ఆ వివాహంలో ఉన్న అపక్రమదోషాన్ని శుక్రాచార్యుడు శాస్త్రసమ్మతంగా సమర్థించలేక పోయాడు కాని, ఆ వివాహం వలన అటువంటి దోషం యయాతికి కలుగకుండా ఉండేట్లు వరమిచ్చాడు. శుక్రాచార్యునిమీద దేవయాని  ప్రభావం ఎంత బలంగా ఉండేదో ఈ  సన్నివేశం వలన అర్థమవుతుంది.


                                   ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu