మహాభారతంలో పాండవుల వ్యక్తిత్వం!

లోకంలో మరణం, లేదా మృతి ఒకవాస్తవంగా ఉన్నది. దేహి ప్రాణత్యాగం చేసినప్పుడు, దేహం పొందే జడత్వం  మృత్యువు. పుట్టిన జీవి గిట్టటం సహజం. జన్మ ఎత్తిన ప్రాణి మృత్యువు పొందక తప్పదు. మానవుడు ఈ రెండింటిని జయించాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక ప్రస్థానం అంటారు. మరణం లేకుండా ఉండే స్థితిని పొందితే అమరత్వం అనాలి. జన్మ ఎత్తకుండా ఉండే నిత్యస్థితిని మోక్షమన్నారు. పుట్టినజీవి మరణం లేకుండా బ్రతకటం ఒక ఎత్తు. అసలు పుట్టుక లేకుండా బ్రహ్మస్థితిలో నిలవటం మరొక ఎత్తు. మొదటి మార్గానికి ఫలం స్వర్గం. రెండవ ప్రస్థానానికి ఫలం బ్రహ్మత్వం. ఈ రెండు రకాల సాధనలలో మొదటిది సామాన్యంగా కర్మమార్గాన్ని అనుసరించేవారికి లభ్యమౌతూ ఉంటుంది. జ్ఞానమార్గం అనుసరించే వారికి బ్రహ్మానందస్థితి గమ్యమౌతూ ఉంటుంది. భక్తిమార్గ ప్రస్థానంలో ఉభయసిద్ధులకు అవకాశం ఉంది. 

మహాభారతం ఈ మూడు మార్గాలను ముచ్చటగా మేళవించింది. ఆ సమన్వయానికి పాండవులు ఆదర్శోదాహరణాలు, అయితే, వారు ప్రధానంగా ధర్మ, కర్మ మార్గంలో నడిచిన వారు. దానికి పోషకంగా భక్తిని జ్ఞానాన్ని పొందుపరచుకొన్నారు. యక్షప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన దక్షుడు జ్ఞాని అయిన ధర్మరాజు. ద్రౌపది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాడూ ధర్మరాజు ఒక్కడే అని కురుసభలో భీష్మాదులచే ప్రశంసలందుకొన్నవాడు. ధర్మరాజు ధర్మతరువువంటివాడని శ్రీకృష్ణునిచేత కీర్తింపబడినవాడు. పంచమవేదమైన మహాభారతంలో ప్రతిపాదింపబడిన జ్ఞానానికంతటికీ ఆచరణ రూపమైన ఆదర్శదాహరణంగా నిలిచినవాడు. ధర్మరాజు. అతడు వస్తుతః జ్ఞాని. ఏకాగ్రచిత్తంతో స్మరించి, ధ్యానించి, తపించి యమ, సూర్య, అగ్ని, ఇంద్రాది దేవతలను సుముఖులుగా చేసికొన్న ఉత్తమ భక్తశిఖామణి ధర్మరాజు. అయితే అంతటి జ్ఞానాన్ని, అంతటి భక్తిని ఆచరణంలో ప్రదర్శించి చూపటమే ఆయన ధ్యేయం. ధర్మరాజు జీవితంలో కర్మకు వన్నెపెట్టే భక్తిజ్ఞానాలే ప్రకాశిస్తూ ఉంటాయి. అందువలన ధర్మరాజు ధర్మ కర్మ వీరుడుగా ప్రసిద్ధిపొందాడు.

భీముడు ప్రచండ బలవీరుడు. పాండవుల పురుషార్ధత్రయసాధనకు భీముడు బలమైన ప్రతినిధి. ధర్మరాజు సాధింపదలచుకొన్న లౌకిక కార్యాలన్నీ భీమునిసాయంతోనే నెరవేర్చుకొంటాడు. భీమునికి ధర్మరాజు ధర్మమూర్తి. అతని మాట ధర్మశాసనం. అతని ఆజ్ఞ వేదం. అన్న మాటను జవదాటకుండా ఆచరించే ఆదర్శ కర్మవీరుడు భీముడు. అతనికి భ్రాతృ భక్తియే వ్రతం. అదియే అతని ధర్మానురక్తి, అతనికి అన్నయే జ్ఞానం. అన్నయే భక్తి. అతడిని అనుసరించటమే కర్మ, కప్పను, నీటిని గర్భం ధరించిన శిలామూర్తి వలె భక్తిజ్ఞానాలను గుప్తంగా దాచుకొన్న కర్మరుడు భీముడు.

అర్జునుడు యుద్ధవీరుడు. నరనారాయణులలో నరుడు అతడు. నారాయణభక్తియుక్తుడు. ధర్మరాజు దైవకార్యాన్ని సాధించవలసి వచ్చినపుడు అర్జునుడిని దివ్యోపకరణంగా వాడుకొంటాడు. ఇంద్రుని సాయం కావాలన్నా, పరమేశ్వరునుండి పాశుపతాస్త్రం పొందాలన్నా, సాక్షాత్ నారాయణుడైన శ్రీకృష్ణునితో అనుసంధానం పెంచుకోవాలన్నా అర్జునుడే అనువైన వాహిక. కృష్ణునిపట్ల అనన్యచిత్తంతో భక్తిని ప్రసరించే పరమయోగి అర్జునుడు. భగవద్గీతను శ్రీకృష్ణభగవానునిచేత స్వయంగా విన్న మహాజ్ఞాని, అతని భక్తి. అతని జ్ఞానం అతని గాండీవ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోషకంగా నిలిచాయి. అతడు యుద్ధాలలో విజయుడు. సాటిలేని మేటి వీరుడు. కర్మమార్గాన్ని అనుసరించినా జ్ఞానాన్ని గౌరవించినవాడూ, భక్తిని పండించుకొన్నవాడు.

నకుల సహదేవులు జంట వీరులు. వారికి అన్నలే దేవుళ్లు. వారి సేవయే భక్తి. వారు చెప్పిన పని చేయటమే కర్మ. వారు సేవాతత్పరులైన కర్మవీరులు.

ద్రౌపది పాండవ ధర్మపత్ని. అబల రూపంలో అవతరించిన అహంకారశక్తి, ధర్మరాజుయొక్క జ్ఞానశక్తిని, భీమాదుల క్రియాశక్తిని తన ఇచ్ఛాశక్తితో నడిపించగలిగిన నారీమూర్తి. ఒక్కసారి పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆమెకు ప్రసన్నుడౌతాడు. కురుసభలో కోకలందించిన శ్రీకృష్ణుడు, విరాటనగరంలో అంగసంరక్షణ చేకూర్చిన సూర్యభగవానుడు ఆమె భక్తి శక్తికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన భగవద్రూపులు. ఆమె ప్రధానంగా కార్యశూరురాలు. అగ్నినుండి పుట్టిన అయోనిజ. జ్వాలవలె తనలో భక్తిజ్ఞానాలను పండించుకొన్న పరిణతమూర్తి, సాధ్వి, పతుల సేవ ఎట్లా చేయాలో, సత్యభామకు బోధించిన అనుభవజ్ఞానశీలి. భక్తిజ్ఞానాలున్నా, అవమానాగ్నితో అనవరతం జ్వలిస్తూ, శత్రుశేషం లేకుండా సంహార యజ్ఞం సాగించిన సాహసురాలు, కర్మమార్గావలంబిని ద్రౌపది.

ఇలా మహాభారతంలో పాండవుల వ్యక్తిత్వం ఉంటుంది.

                               ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu