వందేళ్ల సౌభాగ్యాన్నిచ్చే స్వర్ణగౌరీ వ్రతం(నోము)

 

ప్రతి సంవత్సరం వినాయక చవితి ఎంత ఘనంగా చేసుకుంటామో అందరికీ తెలిసినదే. అయితే వినాయక చవితికి ముందు తదియ నాడు మహిళలు జరుపుకునే మంగళ గౌరీ పూజ లేదా స్వర్ణ గౌరీ వ్రతం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.  మహిళలు వినాయక చవితి కంటే ఎంతో ముఖ్యమైనదిగా భావించే ఈ గౌరీ వ్రతం, లేదా గౌరీ నోములు చేసుకోవడం వెనుక ఒక కథ ఉంది. 

పార్వతీ దేవినే గౌరీ దేవి అంటారు. పరమ శివుడు లయకారుడు, ఎంతటి శక్తివంతమైనవాడో తెలిసిందే, పార్వతీ దేవి కూడా మహిళల సౌభాగ్యాన్ని కాపాడే శక్తిగా, వారి జీవితంలో పెళ్లి తరువాత జీవితాన్ని సంతోషంగా ఉండేలా తన చల్లని చూపులతో ఆశీర్వదాన్ని ప్రసాదించే మంగళ గౌరీ గా పూజించబడుతుంది. ఈ స్వర్ణ గౌరీ నోమును చాలా మంది ఉండ్రాళ్ళ తదియ అనుకుంటారు. కానీ అది ఇది వేరు వేరు. 

ఈ స్వర్ణ గౌరీ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీ దేవికి చెప్పాడని అంటారు. ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆడవాళ్ళ అయిదో తనం వందేళ్లు నిలుస్తుందని అంటారు. 

అసలు వ్రత కథ ఏమిటీ?? 

పూర్వం ఒక రాజు అడవిలో వేటకు వెళ్లి ఒక నదీ ప్రాంతాన్ని చేరుకుంటాడు. ఆ నదీ ప్రాంతం దగ్గరగా ఒక చిన్న ఆశ్రమం, అక్కడి మహిళలు అంతా ఒకచోట గుమిగూడి ఉంటండటం గమనించి, వాళ్ళ దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడుగుతాడు. వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్ళతో  వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన అంతఃపురానికి వెళ్లి తన ఇద్దరు భార్యలకు స్వర్ణ గౌరీ వ్రతం గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతాన్ని పట్టించుకోకుండా కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్దగా వ్రతాన్ని చేసుకుంటుంది. వ్రతాన్ని గూర్చి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్న చిన్న భార్య తన జీవితంలో సుఖసంతోషాలతో హాయిగా ఉంటుంది. 

ఇదీ విషయం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే వ్రతాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు కానీ హేళన చేయడం, ఎగతాళిగా మాట్లాడటం వంటివి చేయకూడదు.

వ్రత విధానం:-

ఈ వ్రతాన్ని చేసుకునే మహిళలు తెల్లవారు జామున లేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి, పూజా వేదికను ఏర్పాటు చేసి, పసుపు కుంకుమలు మరియు పూలతో అలంకరించాలి. తరువాత గౌరీ దేవి పటాన్ని లేదా గౌరీ దేవి రూపాన్ని తయారుచేసుకుని పూజా వేదిక మీద ప్రతిష్టాపన చేయాలి. నూలు దారంతో తోరాన్ని తయారు చేసి దానికి పదమూడు ముడులు వేసి, పసుపు రాసి దాన్ని చేతికి కట్టుకుని, గౌరీదేవికి షోడశోపచార పూజ చేయాలి. గౌరీ దేవికి పదహారు రకాల పూలను, పదహారు రకాల పండ్లను సమర్పించాలి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. తరువాత చేతిలో అక్షింతలు తీసుకుని, స్వర్ణగౌరీ వ్రత కథను చెప్పుకుని, ఆ అక్షింతలను తలపైన వేసుకోవాలి. 

చాలామందికి స్వర్ణ గౌరీ పూజా విధానం గురించి అనేక సందేహాలు ఉంటాయి. పూజ విషయంలో మంగళ గౌరీదేవి వ్రత పూజనే స్వర్ణ గౌరీ పూజలో కూడా పాటించవచ్చు. ఈ స్వర్ణ గౌరీ నోమును పెళ్ళైన వాళ్ళు పదహారు సంవత్సరాల పాటు చేసుకోవాలి. 

సకల సౌభాగ్యాన్ని చేకూర్చే స్వర్ణ గౌరీ ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుందాం.

◆ వెంకటేష్ పువ్వాడ


More Vinayaka Chaviti