గణపతి బప్పా మోరయ.. ఇందులో మోరయా ఎవరు.. ఇతని కథ ఏంటి!

గణేశుడి ఉత్సవాలలో చాలా ఎక్కువగా వినిపించే భక్తి నినాదాలలో గణపతి బప్పా మోరియా అనేది అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అసలు మోరియా ఎవరు? మోరియా అంటే అర్థం ఏమిటి? తెలుసుకుంటే..
మహారాష్ట్రలో మోరయ గోసావీ అనే పేరు చాలా ఎక్కువ వినిపిస్తుంది. గణేశుడి భక్తి సంప్రదాయంలో మోరయ గోసావీ అనే వ్యక్తి ప్రముఖ భక్తుడు. అష్ట వినాయకులలో మొదటిది అయిన మయూరేశ్వర గణపతి ఆలయం.. ఇది పుణెలో ఉంది. ఈ మోరగావ్ గణపతి ఆలయం వద్ద మోరయ గోసావీ అనే పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ వినాయకుడిని ప్రతిష్టించినది మోరయ గోసావీ. అసలు మోరయ గోసావీ ఎవరు తెలుసుకుంటే..
మోరయ గోసావీ..
మోరాయ గోసావీ 14వ శతాబ్దం ప్రాంతంలో జీవించిన గణపతి భక్తుడు. ఆయన మహారాష్ట్రలోని చించ్వడ్ (పుణే దగ్గర) ప్రాంతంలో నివసించారు. ఆయన చిన్నప్పటి నుంచే గణపతికి భక్తి పరాయణుడయ్యాడు.
జీవితం అంతా భగవంతుని నామస్మరణలోనే గడిపి, చివరికి జీవసమాధి పొందినట్టు చెబుతారు. ఆయన గణపతి అనుగ్రహంతో ఎన్నో అద్భుతాలు చేశారు అని మహారాష్ట్రలో భక్తులు నమ్మకం.
మోరయ గోసావీ తన చిన్నతనం నుండే గణపతిని చాలా భక్తిగా పూజించేవాడు. అలా ఆయనకు 117 సంవత్సరాల వయసు వచ్చినా గణపతి పూజ మాత్రం మానలేదు. అయితే వయసు దృష్ట్యా ఆయనకు దేవాలయ దర్శనం కష్టం అనిపించేది. ఒక రోజు మోరయ గోసావీ కి కలలో గణేశుడు కనిపించాడు. ప్రతి రోజు నువ్వు చింద్వాడలోని చెరువులో స్నానం చేస్తున్నావు కదా.. అలా స్నానం చేసిన తరువాత బయటకు వచ్చేటప్పుడు నేను నీకు దర్శనం ఇస్తాను అని చెప్పాడు. అన్నట్టుగానే మోరయ గోసావీ చెరువులో స్నానం చేసి బయటకు వస్తుంటే ఆయన చేతిలో చిన్న గణేశుడి విగ్రహం ప్రత్యక్షం అయ్యింది. ఆ విగ్రహాన్ని మోరయ గోసావీ ఆలయంలో ప్రతిష్టించాడు. ఆ తరువాత మోరయ గోసావీ అదే స్థలంలో సజీవ సమాధి చెందాడు.
"గణపతి బప్పా మోరయా!" అంటే.. "ఓ గణపతి బప్పా! మోరాయ గోసావీతో కలిసి రా, దీవించు" అని భావం. ఆయన గణపతిని అంతగా ఆరాధించినందువల్లే, గణేశ భక్తులు నేడు కూడా మోరయా! మోరయా! అని గట్టిగా పిలుస్తారు.ఇదీ మోరయ పదం వెనుక ఉన్న కథ.
*రూపశ్రీ.



