గణనాయకుడి రహస్యాలే మన జీవిత భాష్యాలు
వినాయక చవితి హంగామా అంతా ఇంతా కాదు. వినాయక మంటపాలు, కొలువుతీరే గణపతి విగ్రహాలు, రంగురంగుల కాగితాలు, పూలతో అలంకరణ, వీధులు మొత్తం ఉమ్మడిగా జరుపుకునే ఆనందాల సంబరం. సాధారణంగా నవరాత్రులు కొలువై ఉండే గణనాథుడు, ఈసారి కరోనా దృష్ట్యా మనతో తక్కువగానే ఉన్నాడని చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పండుగను నిషేధించారు కూడా. అది వేరే విషయం అనుకోండి.
చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి గురించి, వినాయక కథ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలని అనిపిస్తుంది. పిల్లలను ఆరుబయట కూర్చోబెట్టుకుని ఈ కథను చెబుతుంటే వాళ్ళ ఆనందం ఎంత బాగుంటుందో ఒక్కసారి అనుభవములో చూడాల్సిందే.
అయితే అందరికి తెలిసినది పార్వతీదేవి పసుపుముద్దతో ఒక బొమ్మను తయారుచేయడం, చూడముచ్చటగా ఉండటంతో ఆ బొమ్మకు ప్రాణం పోయడం, ఆ పిల్లవాడిని కాపలా ఉంచి స్నానానికి వెళ్లడం, ఆ పిల్లవాడు శివుడిని అడ్డగించినందుకు శివుడు ఆ పిల్లవాడి తలను ఖండించడం. తిరిగి గజాసురుడి తలను తెచ్చి పిల్లవాడిని బతికించి గజాననుడిని చేయడం. తరువాత తల్లిదండ్రుల పట్ల భక్తితో వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి ముల్లోకాలను దర్శించినంత ఫలితాన్ని పొందడం. చంద్రుడు నవ్వడంతో చంద్రుడికి శాపం, ఫలితంగా మళ్ళీ శాపవిమోచనం, వినాయక కథ, పురాణాలలో జరిగిన కొన్ని సంఘటనలు ఇవన్నీ ప్రతి వినాయచవితి రోజు అందరూ వినేవి, చదివేవి.
అయితే వినాయకుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, రహస్యలున్నాయి.
సద్గురు జగ్గీవాసుదేవ్ గణపతి తలను పోగొట్టుకున్న సందర్భం గురించి ప్రస్తావిస్తూ ఇలా చెబుతారు. "శివుడి గణాలు అంటే శివుడి అనుచరులు. గణపతి తలను కోల్పోయి ఉన్నపుడు పార్వతీదేవి ఆ బిడ్డను చూసి దుఃఖించి, ఆ బిడ్డను తిరిగి బతికించమని ప్రార్థించింది. శివుడు తన గణాలలో ఒకరి తలను తీసుకొచ్చి ఆ బిడ్డకు అమర్చాడు, నిజానికి ఏనుగు తలను అమర్చిన ఆ బిడ్డను గజపతి అని పిలవాలి కానీ గణపతి అన్నారు" అని. అంటే ఆ బిడ్డ తన గణాలలో ఒకరి జ్ఞాపకంగానో లేదా తన గణాలలో ఒకరిగా మారినందుకో వినాయకుడికి గణపతి అనే పేరు కూడా సార్థకమైందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సంఘటన తరువాత శివుడు తన గణాలకు అంతటికి గణపతిని అధిపతిగా చేస్తాడు. దీనివల్ల కూడా గణపతి అనే పేరు స్థిరపడింది.
వినాయకుడి జననం వెనుక మరొక రహస్య కథ ఉంది. శివపార్వతుల ఇద్దరూ వనంలో ప్రయాణిస్తూ ఉండగా ఇద్దరూ వానర రూపాలు దాల్చి కామకేళి జరపగా పార్వతి దేవి గర్భవతి అయ్యింది. అప్పుడు శివుడు ఆ గర్భాన్ని వాయుదేవుడికి ఇవ్వగా, వాయుదేవుడు తన భార్య అయిన అంజన గర్భంలో ఉంచాడు. ఫలితంగా పుట్టినవాడే హనుమంతుడు. అందుకే శివుడికి హనుమంతుడి మీద అంత ప్రేమ అని కూడా అంటారు. అదే విధంగా పార్వతి పరమేశ్వరులు ఏనుగు రూపంలో కామకేళి జరిపినపుడు వినాయకుడు జన్మించడాని మరొక కథ.
అందరికీ తెలియని మరొక విషయం వినాయకుడి తొండం తెగిన సంఘటన. గణపతి శివుడి గణాలలో ఒకడిగా మారాక శివుడి వెంట ఉండేవాడు. ఒకసారి శివుడు లోపల ఉన్నపుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చాడు, పరశురాముడిని గణపతి అడ్డుకోగానే కోపంతో గణపతి మీద యుద్ధం చేస్తాడు పరశురాముడు. ఆ హోరాహోరీ యుద్ధంలో గణపతి తొండంను పరశురాముడు నరికేస్తాడు. ఈ విషయం పద్మపురాణం లో ప్రస్తావించారు.
గణపతి కాకిగా మారిన కథ:
దక్షిణ ప్రాంతంలో అనావృష్టి ఏర్పడినప్పుడు అగస్త్యుడు శివుడిని ప్రార్థించి కావేరీ నదిని తన కమండలంలో నింపుకొని ప్రయాణయ్యాడు. కావేరి నదిని మొత్తంగా అలా తీసుకెళ్లిపోవడం ఇంద్రునికి ఇష్టం లేక గణపతిని ఆశ్రయించగా గణపతి కాకి రూపం ధరించి కమండలం పై కూర్చుంటాడు. కాకి బరువుకు ఆ కమండలం ఒరిగి కావేరీ నీరు భూమిపై పడుతుంది. అప్పుడు కాకి, అగస్త్యుడు ఇద్దరూ పోరాడుకున్నారు. తరువాత గణపతి నిజరూపుడై ఆ పుణ్యనది నీటిని తిరిగి అగస్త్యుడి కమండలంలో నింపాడు. ఆ ఒలికిన నీరే కొంత కావేరి నదిగా దక్షిణ పధాన ప్రవహిస్తోంది. ఇలా కాకిరూపంలో అగస్త్యుని కోర్కెను, ఇంద్రుడి కోర్కెను రెండింటిని తీర్చినవాడు గణపతి.
గణపతి వివాహం గురించి కథ:
గణపతి, సుబ్రహ్మణ్యస్వామిలకు వివాహపు వయసురాగా ముందు ఎవరికి వివాహం చెయ్యాలనే ఆలోచన కలిగి శివపార్వతులు వారికో పరీక్ష పెట్టారు. ఎవరు ప్రపంచాన్ని చుట్టి ముందు వస్తే వారికి వివాహం ముందు చేస్తామని శివ పార్వతులు చెబుతారు. సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బయలు దేరగా గణపతి మాత్రం నారదుడి సలహాతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రపంచ మంతా తిరిగినట్లేనని భావించి అలాగే చేస్తాడు. అందువల్ల ముందు గణపతికి వివాహం చేశారు. గణపతి భార్యలు సిద్ధి, బుద్ధి. అందుకే గణపతిని పూజిస్తే కార్యసిద్ధి జరుగుతుందని, మనిషి జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు.
అందరికీ విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు అంటే మొదలుపెట్టే పనికి అడ్డంకులు తొలగించేవాడనే విషయం తెలుసు. అయితే ఎందుకలా అంటారు?? దాని వెనుక కథ ఏమిటి అంటే…..
విఘ్నేశ్వరత్వం : ఏ పని చెయ్యాలన్నా విఘ్నం జరగకుండా వుండాలంటే ముందు గణపతికి పూజ చేయాలి. దీనికి ఉదాహరణ తారకాసురుణ్ణి చంపడానికి సుబ్రహ్మణ్యస్వామికి సైన్యాధిపత్యం ఇవ్వడానికి దేవతల రాజైన ఇంద్రుడు మంత్రజలంతో సుబ్రహ్మణ్య స్వామి కాళ్లు కడగబోతాడు. అయితే సుబ్రహ్మణ్య స్వామి కాళ్లు చేతులు బిగుసుకుపోయాయి. ఇది గమనించిన శివుడు ఇంద్రుడ్ని ముందుగా గణపతికి పూజ నిర్వహించమని చెప్పగా ఇంద్రుడు గణపతిని పూజించాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి చేతులు కాళ్లు కదలసాగాయి. ఆ తర్వాత అతడ్ని సైన్యాధిపతిని చేశారు.
మహాభారతం గురించి మరొక కథనం:
వ్యాసుడు తన మదిలో ప్రవాహంలా జాలువారుతున్న మహాభారత కథను గ్రంథస్తం చేయబోయి బ్రహ్మ దగ్గరకు వెళ్లి నేను చెప్పే కథను గ్రంథస్థం చేసేవారు కావాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ గణపతే అందుకు తగినవాడని చెప్పగా వ్యాసుడు గణపతిని ప్రార్థించి తన కోర్కె విన్నవించగా గణపతి ఓ షరతు విధిస్తాడు. తన కలం ఆగకూడదని ఆగనంతవేగంగా చెప్పాలని అంటాడు. అప్పుడు వ్యాసుడు కూడా గణపతితో నేను చెప్పేవి మరల రెండవసారి అడగకూడదని షరతు విధిస్తాడు. అలా వ్యాసుడు, గణపతి ఇద్దరూ కలిసి రెండున్నర సంవత్సరాల కాలంలో ఆ గ్రంథ రచన పూర్తి చేశారు.
ఇట్లా ఎన్నో ఎవ్వరికీ తెలియని కొన్ని కథలు కొన్ని గ్రంథాలలో మాత్రమే ప్రస్తావించబడినవి ఉన్నాయి. వాటి నుండి ఎంతో నీతిని, మరెంతో జీవన భాష్యాన్ని గ్రహించవచ్చు. అది చక్కగా గ్రహించినవారికి గణపతి చల్లని ఆశీస్సు తప్పక ఉంటుందని వేరే చెప్పాలా!!
◆ వెంకటేష్ పువ్వాడ