సంకటహర చతుర్థికి ఇలా చేస్తే కష్టాలు తీరిపోతాయి!

వినాయకుడు భక్తుల దృష్టిలో సాధారణ దైవం మాత్రమే కాదు… ఎలాంటి కార్యంలో అయినా మనకు తోడుండే నాయకుడు. ఎలాంటి ఆపద నుంచైనా కాపాడే విఘ్నరాజు. సిద్ధిని, బుద్ధిని ప్రసాదించే ఇష్టదైవం. ఏ పని ప్రారంభించే ముందైనా, ఆయన స్తోత్రం చదువుకుంటాం, ఏ దేవతనైనా పూజించే ముందు పసుపు గణపతిని ముందు అర్చిస్తాం. ఇంత విశిష్టమైన ఆ స్వామిని కొలుచుకునే సందర్భమే సంకటహర చతుర్థి!

చవితి వినాయకుడికి ఇష్టమైన తిథి అని చెబుతారు. అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అనీ పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అనీ పిలుస్తారు. వరద అంటే వరాలను అనుగ్రహించడం అని అర్థం. ఈ రోజు స్వామిని పూజిస్తే… ఆయన మనల్ని చల్లగా చూస్తారు. ఇక సంకటహర చతుర్థి మరింత ప్రత్యేకం. ఈ రోజు కనుక స్వామిని పూజిస్తే, ఎలాంటి ఆపద నుంచైనా ఆయన రక్షిస్తాడు.

సంకటహర చతుర్థి రోజున స్వామి అనుగ్రహాన్ని పొందేందుకు ఓ పద్ధతిని సూచిస్తారు పెద్దలు. ఈ రోజున ఉదయమే లేచి, తలార స్నానం చేసి ఉపవాసం ఉండాలి. పండ్లు, దుంపలు, పచ్చికూరలు లాంటి ఉడికించని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆవేళ సాయంత్రం వినాయకుడిని పూజించిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి.

చాలామంది ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. దీనికోసం వినాయకుడి ముందు ఎరుపు లేదా తెలుపు గుడ్డను ఉంచి దానికి పసుపుకుంకుమలను అద్దాలి. మనసులో ఏదైనా కోరికను తల్చుకుని మూడుగుప్పిళ్ల బియ్యంతో పాటుగా రెండు ఖర్జారాలు, రెండు వక్కలు, దక్షిణ వేసి మూటకట్టాలి.

ఈ మూటను స్వామి ముందు ఉంచి… గణేశస్తోత్రాలతో పాటుగా, సంకటహర చతుర్థి వ్రతకథను చదువుకోవాలి. 3, 5,11, లేదా 21 నెలలపాటు సంకటహర చతుర్థి రోజున స్వామిని పూజించాలి. చివరిసారిగా ఈ వ్రతాన్ని చేసే రోజున, ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి… దాంతో ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. మరికొన్ని సందర్భాలలో వ్రతం జరిగిన సాయంత్రం… ఆ ముడుపు బియ్యాన్ని వండుకుని, దాన్ని స్వామి నైవేద్యంగా భావించి ఉపవాసాన్ని విరమిస్తారు.

సంకటహర చతుర్థి వ్రతం కానీ, ఉపవాసం కానీ కుదరనివారు ఈ రోజు స్వామిని గరికతో పూజించే ప్రయత్నం చేసినా మంచిదే! అదీ కుదరని పక్షంలో సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదువుకుని గుడికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకున్నా, ఆయన అనుగ్రహం లభిస్తుంది.

- మణి

 


More Vinayaka Chaviti