గౌరి వ్రతం.. వినాయక చవితి ముందురోజే ఎందుకు చేస్తారంటే..!


భాద్రపద మాసం అంటే చాలామందికి వినాయక చవితి గుర్తొస్తుంది.  వినాయక వ్రతం ఒక ఎత్తు అయితే నవరాత్రుల హేళ మరొక ఎత్తు. ఎంతో ఘనంగా జరిగే ఈ వినాయక చవితి పండుగకు ముందు చాలామంది మహిళలు గౌరీ వ్రతం చేసుకుంటారు. చాలామందికి గౌరీ వ్రతం,  మంగళ గౌరీ వ్రతానికి మధ్య తేడా తెలియదు. అయితే మంగళ గౌరీ వ్రతం అనేది శ్రావణ మాసంలో కొత్తగా పెళ్లైన మహిళలు చేసుకునే వ్రతం. అదే గౌరీ వ్రతం అయితే వినాయక చవితికి ముందు జరుపుకుంటారు.  అసలు వినాయక చవితికి ముందు గౌరీ వ్రతం ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? తెలుసుకుంటే..

వినాయక వ్రత కథ చదివితే.. అందులో పార్వతీ దేవి స్నానానికి వెళ్లి నలుగు పెట్టుకుంటూ నలుగు పిండితో సరదాగా ఒక బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మలో ఉండే శిశువు చాలా ముద్దుగా కనిపించడంతో దానికి ప్రాణం పోస్తుంది.  ఆ పిల్లవాడే గణేశుడు.  అలా నలుగు పిండి ముద్ద కాస్తా ఒక పిల్లవాడిగా మారిన రోజే భాద్రపద చవితి. దీన్నే వినాయక చవితిగా చేసుకుంటారు.  ఇలా గణేశుడికి ప్రాణం పోసిన తల్లి పార్వతీదేవి.

కేవలం పురాణాలలోనే కాదు.. ఎక్కడైనా సరే.. తల్లి పిల్లల బంధం చాలా అపురూపమైనది.  వినాయకుడి జననానికి కారణమైన పార్వతీ దేవిని పూజించడం వల్ల గణేశుడి అనుగ్రహం పెరుగుతుంది.  అంతేనా.. పార్వతీ దేవి మాంగళ్యానికి  రక్షణ.  ఆడపిల్ల మాంగళ్యాన్ని పార్వతీ దేవి స్వరూపంగా చూస్తారు. అందుకే సౌభాగ్యం కోసం ఆ పార్వతీ దేవినే పూజిస్తారు. వివాహం అయిన మహిళలు పార్వతీ దేవిని పూజించడం వల్ల తమ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని, వినాయకుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు. తల్లిని సంతోష పెడితే కొడుకు కూడా సంతృప్తి చెందుతాడట.  అందుకే ప్రతి ఏడాది వినాయక చవితికి ముందు గౌరీ వ్రతం చేసుకుంటారు.  

గౌరీ వ్రతాన్ని పసుపుతో చేసిన గౌరమ్మ లేదా మట్టితో చేసిన గౌరమ్మను ఏర్పాటు చేసి జరుపుకుంటారు. ఈ వ్రతం చాలా వరకు వరలక్ష్మీ  వ్రతాన్ని పోలి ఉంటుంది. ఇలా గౌరీ పూజ చేసుకున్న తర్వాత రోజు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి వినాయక చవితి చేసుకుంటారు.  ఇలా చేసిన తరువాత వినాయకుడితో పాటు గౌరీ దేవిని కూడా నిమజ్జనం చేస్తారు.


                                   *రూపశ్రీ.


More Vinayaka Chaviti