వినాయకుడి రూపం విశేషాలు!


సంస్కృత భాషలో ఏనుగుని 'గజం' అంటారు. అందుకే గణపతికి గజాననుడు, గజముఖుడు (ఏనుగు ముఖం కలవాడు) అని పేర్లు. అయితే "గజ" అనే పదానికి విశేషమైన అర్థం ఉంది. “గ” అంటే గతి. తెలిసో తెలియకో సమస్త సృష్టి చేరుకునే అంతిమ లక్ష్యం. "జ" అంటే జన్మ, పుట్టుక. గజ అంటే … ఏ ఈశ్వరుడి నుండి లోకాలన్నీ ఆవిర్భవించి, చివరికి ఎవరిలో లీనమవుతాయో ఆ పరమాత్మ అని అర్థం.

సృష్టి సూక్ష్మాండం, బ్రహ్మాండం అనే రెండు విధాలుగా ప్రకటితమవుతోంది. రెండూ ఒకదానికొకటి ప్రతి రూపాలు. ఏనుగు తల బ్రహ్మాండాన్నీ, మానవదేహం సూక్ష్మాండాన్నీ సూచిస్తాయి. సూక్ష్మాండానికి అంతిమ లక్ష్యం బ్రహ్మాండం కనుక ఏనుగు తల భాగానికి చాలా ప్రాధాన్యం ఉంది.

గణేశుని చెవులు చాలా పెద్దవి. ప్రతి ఒక్కరి ప్రార్థనలూ విని, ప్రార్థించేవారికి మంచి చేయడం, అనవసరమైన వాటిని ఏరివేయడం వాటి విశిష్టత. రెండు దంతాలలో పూర్తిగా ఉన్న దంతం అద్వితీయమైన పరమ సత్యానికి సంకేతం. విరిగిన దంతం అంతర్గతమైన అనౌచిత్యాల వల్ల కళంకితంగా తోచే ప్రత్యక్ష ప్రపంచానికి సంకేతం. ఏమైనా.. ప్రత్యక్షంగా కనిపించే విశ్వం, కనిపించని ఏకత రెండూ పరమాత్మ లక్షణాలే.

వంపు తిరిగిన తొండం పరబ్రహ్మానికి సంకేతమైన ఓంకారాన్ని సూచిస్తూ గణపతి పరబ్రహ్మమే అని ప్రకటిస్తుంది. ఆయన పెద్ద బొజ్జ అన్ని లోకాలూ తనలోనే ఉన్నాయి అని తెలియజేస్తుంది. పాశం రాగాని( ప్రేమ)కీ, అంకుశం కోపానికీ సంకేతం. పాశం లాగే రాగం మనల్ని నిర్బంధి స్తుంది. క్రోధం అంకుశం లాగే బాధిస్తుంది. భగవంతుడు మన పట్ల అసంతృప్తి చెందితే మనలో రాగ ద్వేషాలు ఎక్కువై, మనకు దుఃఖమే మిగులుతుంది. వీటి బాధ నుండి తప్పించుకోవాలంటే భగవంతుడి శరణు వేడాలి. 

స్వామికి వాహనమై, ఆయనను మోసే భాగ్యం చిన్న ఎలుకకు లభించింది. మూషికం అంటే ఎలుక ఎవరికీ తెలియకుండా లోపలకు చొరబడి వస్తువులను లోపల లోపలే ధ్వంసం చేస్తుంది. అలాగే అహంకారం మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి, మన వినాశానికి దోవ చేస్తుంది. దివ్యశక్తి, జ్ఞానాలతో దానిని నిగ్రహించి ఉపయోగకరమైన మార్గంలో పంపవచ్చు. రహస్యంగా దొంగిలించే ఎలుక మానవ హృదయాలను వశం చేసుకునే "ప్రేమ"కు సంకేతం. మానవ ప్రేమను అల్పమైన స్థాయిలో ఉంచినంత కాలం అది విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఒకమారు దాన్ని దైవం వైపు మళ్ళిస్తే అది మనకు ఉన్నతిని కలిగిస్తుంది. అన్నిటి లోపలి భాగం చూడడం అలవాటున్న ఎలుక తీక్షణమైన బుద్ధి కి సంకేతం. గణపతి బుద్ధికి అధిపతి కనుక ఎలుకను వాహనంగా ఎంచుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు.

దేవాలయాలలోనూ, పురావస్తుశాఖ భవనాలలోనూ అనేక విధాలైన గణపతి ప్రతిమలు చూస్తాం.

బాల గణపతి.. చిన్న పిల్లవాడిగా చిత్రితమైన ప్రతిమ.

 తరుణ గణపతి .. నవ యువకునిగా ఉన్న గణపతి.

వినాయకుడు..  నాలుగు చేతులలో విరిగిన దంతం, అంకుశం, పాశం, మాలలు, తొండంతో మోదకం పట్టుకుని కూర్చొని గానీ, నిలబడినట్లు గానీ ఉండే ప్రతిమ.

హేరంబ గణపతి.. అయిదు తలలతో, ఒక్కో ముఖంలో మూడు కన్నులు, పది చేతులతో, సింహ వాహనుడైన ప్రతిమ.

 వీర విఘ్నేశుడు యుద్ద ప్రియునిలా అనేక ఆయుధాలు పది చేతులలో ధరించిన ప్రతిమ.

 శక్తి గణపతి.. లక్ష్మి, బుద్ధి, సిద్ధి, పుష్టి మొదలైన శక్తులతో కూడి నది.

నృత్య గణపతి నృత్యం చేస్తున్న భంగిమలో ఉండే ప్రతిమ.

 వరసిద్ధి వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి నాడు పూజిత మయ్యే ప్రతిమ.


                               *నిశ్శబ్ద.

 


More Vinayaka Chaviti