హిందూ-క్రైస్తవ సన్యాసి… స్వామి అభిషిక్తానంద!
భగవంతుడు ఒక్కడే అనీ, అతడిని చేరుకునేందుకు భిన్నమైన మార్గాలే వేర్వేరు మతాలు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. దాన్ని గ్రహించి మసులుకున్న విజ్ఞులు కూడా చాలామందే ఉన్నారు. వారిలో ఒకరైన `హెన్రీ లె సాక్స్` గురించి…
భారతదేశంలో క్రైస్తవ మతానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శిష్యులలో ఒకరైన `సెయింట్ థామస్` కేరళ తీరం ద్వారా భారతదేశాన్ని చేరుకుని కొన్ని చర్చిలను స్థాపించారు. చెన్నై దగ్గర ఉన్న మైలాపూర్‌లో తన నివాసాన్ని ఏర్పరుచుకుని క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేశారు. 15వ శతాబ్ది నుంచి విదేశీయులు వ్యాపారం కోసం మన దేశంలోకి ప్రవేశించడంతో, వాళ్లతో పాటు క్రైస్తవం కూడా ప్రచారంలోకి వచ్చింది. కొత్తగా వచ్చిన క్రైస్తవ మతం చూడ్డానికి భిన్నంగా కనిపించినప్పటికీ అది కూడా పరిపూర్ణమైన మనిషి గురించే చెబుతోందని భారతీయులు గ్రహించారు. రాజారామ్మోహన్‌రాయ్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, యోగానంద… క్రైస్తవ బోధల మీద కూడా సాధికారతను సాధించారు. మరి క్రైస్తవుల తరపు నుంచి హిందూ మతాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించినవారిలో అభిషిక్తానంద ఒకరు. అభిషిక్తానందగా సన్యాస నామాన్ని సైతం గ్రహించిన `హెన్రీ లె సాక్స్` జీవితమే ఇది!
ఫ్రాన్స్‌లోని `బ్రిట్టనీ` అనే ప్రాంతంలో 1910వ సంవత్సరంలో జన్మించారు హెన్రీ. చిన్నప్పటి నుంచీ, భగవంతుడి ఉనికి గురించి ఎలాగైనా తెలుసుకోవాలన్నదే హెన్రీకి పరమావధిగా ఉండేది. అందుకే తన 19వ ఏటనే క్రైస్తవ ఆశ్రమంలో చేరి గడపసాగాడు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఉన్న హెన్రీ తరచూ భారతదేశం గురించీ, అందులోని సాధువుల జ్ఞానం గురించీ, అక్కడి గుళ్లూగోపురాల గురించీ వినేవాడు. ముఖ్యంగా అక్కడి సన్యాసాశ్రమ విధానంలో తన జీవితాన్ని గడపాలని ఆయనకు మహా కోరికగా ఉండేది. అందుకోసం తనకు సాయం చేసేవారెవరు ఉన్నారా అని వాకబు చేస్తుండగా, ఇండియాలో ఉన్న తన దేశస్తుడయిన `జూల్స్ మొంచానిన్` అనే వ్యక్తి గురించి తెలిసింది. ఆయనతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి ఎట్టకేళకు 1948లో భారతదేశంలోకి అడుగుపెట్టారు హెన్రీ. తను పుట్టిపెరిగిన దేశంకంటే భిన్నమైన వాతావరణం, జీవనవిధానం ఉన్న మన దేశంలో కుదురుకోవడానికి హెన్రీకి చాలా సమయమే పట్టింది. అయితే ఆ ఓర్పుకు తగిన ఫలితం కూడా దక్కింది. మరుసటి ఏడు మిత్రులిద్దరూ కలిసి `రమణమహర్షి`ని దర్శించారు. రమణమహర్షిలోని ఆధ్యాత్మిక జ్వాలకి ముగ్ధుడైపోయాడు హెన్రీ. అన్ని ప్రశ్నలకూ తన అంతరాత్మలోనే సమాధానాలు లభిస్తాయన్న రమణుని సిద్ధాంతం ఆయన ఆధ్మాత్మిక జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. తన అనుభవాల సారంతో తరువాతి కాలంలో `ద సీక్రెట్ ఆఫ్ అరుణాచల` అనే పుస్తకాన్ని కూడా రాశారు హెన్రీ.
ఒక పక్క క్రైస్తవునిగా ఉంటూనే, అద్వైతాన్ని కూడా పాటించసాగారు ఆయన. అంతేకాదు, హిందూ సన్యాసధర్మాలను అనుకరిస్తూ తన పేరును `అభిషిక్తానంద`గా మార్చుకున్నారు. తన స్నేహితునితో కలిసి కావేరీ నదీ తీరాన `తన్నీర్‌పల్లి` అనే గ్రామంలో `శాంతివనం` అనే ఆశ్రమాన్ని స్థాపించారు. దాని గోపురం హిందువుల సంప్రదాయాన్ని పోలి ఉంటే, ఆ గోపురం మీద మాత్రం ఏసు ప్రభువు రూపం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలు చేసేందుకు మతాల అంతరాలు అడ్డురాకూడదని హెన్రీ భావించేవారు. రమణ మహర్షి చనిపోయిన తరువాత తనకు భౌతికంగా మార్గం చూపేందుకు మరో గురువు కోసం వెతికారు హెన్రీ. అలా ఆయనకు జ్ఞానానంద గిరి అనే మరో గురువు లభించారు.
అద్వైత మార్గంలో తాను తెలుసుకున్న విషయాలను సాటి క్రైస్తవులకు తెలియచేసేందుకు, ఆయన లెక్కలేనన్ని పుస్తకాలు రాశారు.
అభిషిక్తానందలోని ఆధ్యాత్మిక తపన ఆయనను ఒకచోట నిలువనీయలేదు. జ్ఞానానికి ఆలవాలైన హిమాలయాలలో తన సాధనలు కొనసాగించేందుకు ఆయన ఉత్తరభారతదేశాన్ని చేరుకున్నారు. అప్పటికి ఆయన వయసు 58 ఏళ్లు! వృద్ధాప్యం మీద పడుతున్నా; తనకి అక్కడి ప్రాంతం, భాష, మనుషులూ ఏమాత్రం పరిచయం లేకున్నా హిమాలయ గుహలలో నెలలతరబడి ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉండిపోయేవారు. మరికొన్నాళ్లు ఒక పాడుపడిన శివాలయంలో తన శిష్యుడైన `అజతానంద` (అసలు పేరు మార్క్)తో కలిసి ఉన్నారు. 1973 ప్రాంతంలో రిషికేష్‌లో ఉండగా అభిషిక్తానందకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. తను మరెంతో కాలం బ్రతకని తెలిసినా కూడా ఆయన ఎంతో సంతోషంగా ఉండేవారు. నిరంతరం ధ్యానంలో గడిపేవారు. తాను అంతిమమైన సత్యాన్ని తెలుసుకున్నాననీ, ఇక తను బతికి ఉన్నా లేకున్నా ఒకటేనన్నట్లుగా మాట్లాడేవారు. చివరికి 1973, డిసెంబరు 7న తనలోకి తాను ఐక్యమయ్యారు. సత్యాన్ని తెలుసుకునేందుకు మతాలు అడ్డురావని నిరూపించారు.
- నిర్జర.