అష్టావక్రుడైతేనేం… బుద్ధి తిన్నగానే ఉందిగా!
మన ధర్మశాస్త్రాలలో కనిపించే ఒకో పాత్రా ఒకో లక్షణాన్ని సూచిస్తుంది. కొన్ని పట్టుదలకు ప్రతీకలుగా ఉంటే మరికొన్ని వినయంతో ఎలా మసులుకోవాలో చెబుతాయి. బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలో మరికొందరి జీవితాలు సూచిస్తాయి. కానీ అష్టావక్రుని పాత్ర వీటన్నింటికంటే విభిన్నమైనది. అదెలాగంటే…
పూర్వం ఏకపాదుడనే పండితుడు ఉండేవాడు (కొన్ని చోట్ల ఇతని పేరుని కహోదరునిగా కూడా పేర్కొన్నారు). ఏకపాదుడు గొప్ప పండితుడు కావడంతో, వేదాధ్యయనం కోసం అతని దగ్గరకు ఎంతోమంది విద్యార్థులు వచ్చేవారు. అతని భార్య పేరు సుజాత. సుజాత మరెవరో కాదు ఉద్దాలకుడు అనే రుషి కుమార్తె. తాను రుషి కుమార్తె కావడంతో, సుజాతకు సహజంగానే వేదాలంటే ఆసక్తిగా ఉండేది. కొన్నాళ్లకు సుజాత గర్భవతి అయింది. పిల్లలు గర్భంలో ఉన్న దగ్గర నుంచీ, వాళ్లు బయట నుంచి వినిపించే శబ్దాలను వింటారని మన పెద్దలు నమ్మేవారు. ఇందుకోసం మనకు ప్రహ్లాదుడు, అభిమన్యుడు వంటి వారి జీవితంలోని ఘట్టాలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. సుజాత కూడా తన బిడ్డ చిన్నప్పటి నుంచే వేదాలను వింటూ ఉండాలని ఆశ పడింది. అందుకోసం భర్త అనుమతి తీసుకుని, ఆయన శిష్యులకు వేదాలను నేర్పుతున్నప్పుడు తాను కూడా ఒక మూలన కూర్చుని వింటూ ఉండేది. ఆమె కోరుకున్నట్లుగానే ఆమె కడుపులోని బిడ్డ కూడా వేదాలను వినసాగాడు.
నెలలు గడిచేకొద్దీ సుజాత గర్భంలో ఉన్న పిల్లవాడు వేదాలన్నింటినీ ఔపోసన పట్టేశాడు. ఉదాత్త, అనుదాత్త స్వరాల ప్రకారం వాటిని ఎలా పలకాలో కూడా గ్రహించేశాడు. ఒక రోజు ఏకపాదుడు వేదాలను వల్లిస్తుండగా అపస్వరం దొర్లింది! వెంటనే `వేదాలను తప్పుగా పలుకుతున్నావంటూ` అరిచాడట కడుపులోని బిడ్డ. బొడ్డు కూడా తెగని పసివాడు తనని తప్పుపట్టడాన్ని సహించలేకపోయాడు ఏకపాదుడు. `నేను వేదాలను వక్రంగా వల్లించానని అన్నావు కాబట్టి నువ్వు కూడా అష్టవంకర్లతో జన్మించెదవుగాక!` అని శపించాడు. ఈలోగా జనక మహారాజు నుంచి దేశంలోని పండితులందరికీ ఒక వర్తమానం అందింది. వరుణుని కుమారుడైన వందితో ఎవరైతే వాదించి గెలుస్తారో, వారు కోరుకున్న బహుమానం లభిస్తుందన్నదే ఆ సమాచారం. ఆ విషయం విన్న ఏకపాదుడు, ఎంతోకొంత సంపాదించుకునేందుకు ఇదే సరైన తరుణం అనుకున్నాడు. వెంటనే జనకుని సభకు బయల్దేరాడు.
రొమ్ము విరుచుకుని జనకుని సభలోకి ప్రవేశించిన ఏకపాదుడు, వంది చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. పోటీలో నియమం ప్రకారం ఓడిపోయిన ఏకపాదుని తన తండ్రి చెంతకు పంపాడు వంది. ఇక్కడేమో సుజాతకు నెలలు నిండాయి. ప్రసవం కోసం తన తండ్రి ఉద్దాలకుని ఆశ్రమానికి చేరుకుంది సుజాత. అదే సమయంలో ఉద్దాలకునికి కూడా శ్వేతకేతు అనే బిడ్డ జన్మించాడు. తాను ఊహ తెలిసిన దగ్గర నుంచీ ఉద్దాలకుని ఆశ్రమంలోనే ఉండటంతో ఆయననే తన తండ్రిగానూ, శ్వేతకేతువుని తన అన్నగానూ భావించసాగాడు అష్టావక్రుడు. పసితనం తగ్గుతున్న కొద్దీ తన తండ్రి ఎవరన్న ప్రశ్న అతనిలో కలుగసాగింది. మొదట్లో ఆ ప్రశ్నను దాటవేసిన అతని తల్లి చివరకు నిజాన్ని చెప్పక తప్పలేదు. తండ్రి గురించి తెలుసుకున్న అష్టావక్రుడు, ఆయనకు రుణ విమోచనాన్ని కలిగించేందుకు జనకుని కొలువుకు బయల్దేరాడు. పసివాళ్లకు జనకుని సభలో స్థానం లేదన్న భటులను అన జ్ఞానంతో ఆకట్టుకుని, వందితో వాదించలేవు అన్న జనకుని తన వేదవిద్యతో ఒప్పించి… చివరకు వందితో వాదనకు ముహూర్తాన్ని ఏర్పాటు చేయించాడు అష్టావక్రుడు.
వందితో జరిగిన హోరాహోరీ వాదనలో నిస్సంశయంగా అష్టావక్రునిదే పైచేయి అయ్యింది. పసివాడైనా కూడా అతని వాదనా పటిమకు జనకుడు సైతం దాసోహమన్నాడు. `నన్ను ఓడించినందుకు బదులుగా నీకేం కావాలో కోరుకోమన్నా`డు వంది. నాకు ధనధాన్యాలు, వస్తువాహనాలు, కనకకాంతాలు… ఇవేవీ అవసరం లేదు. నా తండ్రిని తిరిగి మా కుటుంబానికి అప్పగించండి అని కోరుకున్నాడు అష్టావక్రుడు. అతని పితృభక్తికి మురిసిపోయిన వంది ఏకపాదుడినీ, అతనితో పాటుగా తన తండ్రి చెంత ఉన్న మరెందరో పండితులను సంతోషంగా విడిపించాడు. పసిగుడ్డని కూడా చూడకుండా తన కన్న కొడుకునే కఠినంగా శపించినా, అదే కొడుకు తిరిగి తనకు జీవితాన్ని అందించినందుకు ఏకపాదునికి నోట మాట రాలేదు. ఇలాంటి కొడుకు కన్నందుకు తన జన్మ ధన్యమైపోయిందనుకుంటూ అతను తిరిగి మామూలు రూపానికి వస్తుందనే వరాన్ని అనుగ్రహించాడు.
తరువాతి కాలంలో అష్టావక్రుని మళ్లీ జనకుడు తన సభకు పిలిపించుకున్నాడు. `బ్రహ్మాజ్ఞానాన్ని పొందని తన జీవితాన్ని వృథాగా భావిస్తున్నాననీ, కాబట్టి దయ ఉంచి తనకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించమనీ` వేడుకున్నాడు జనకమహారాజు. జనకుని కోరిక మేరకు అష్టావక్రుడు అందించిన జ్ఞానమే `అష్టావక్రగీత`! వైరాగ్య మార్గంలో ఉన్నవారు అష్టావక్రగీతను అభ్యసించేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. సాధకునికీ, ప్రపంచానికీ, మాయకూ సంబంధించిన ఎన్నో విషయాలను ఇందులో కూలంకషంగా చర్చించడం జరిగింది. అలా జ్ఞానం ఉన్నవాడికి రాజులు సైతం దాసోహమంటారనీ, పగలేనివాడు ప్రపంచాన్ని జయిస్తాడనీ, బుద్ధిని నమ్ముకున్నవాడు వైకల్యాన్ని అధిగమిస్తాడనీ తన జీవితంతో నిరూపించాడు అష్టావక్రుడు.
- నిర్జర.