రావణుడి మరణానికి కారణమైన వేదవతి వృత్తాంతం!
శ్రీరాముడి భార్య సీతమ్మ గతజన్మలో వేదవతి అని ఆమె శాపం వల్లనే రావణాసుడి మరణం సంభవించిందని అంటుంటారు. అయితే వేదవతి కథనం ఇలా ఉంది…
త్రేతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్పర్వత ప్రాంతంలో ఒక తపోవనం. ఆ తపోవనంలో కులద్విజుడనే ఋషి వేదమార్గంలో శ్రీ హరి ప్రీతికోసం తపస్సు చేస్తున్నాడు. అతడు వేదాద్యయనం చేస్తూన్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది. అతడు ఆమెకు వేదవతి అని పేరుపెట్టాడు. ఆమె పెరిగి పెద్దదైంది. ఆమె సౌందర్యం చూసి దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు మోహించారు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు. వారు కులద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు. అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. పితృ దేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది. నిత్యం అతడు "శ్రీపతి నీ పతి అవుతాడు” అంటూ వేదవతిని దీవించేవాడు.
ఇలా ఉండగా దంబుడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడింది. ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకొన్నాడు. కులద్విజుని కలిసాడు. తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు. “దేవదేవుడైన శ్రీ కాంతునికే ఆమె జీవితం అంకితమైంది. నీవంటి రాక్షసుడికి ఆమె భార్యకాదు" అని కులద్విజుడు రాక్షసునితో అన్నాడు. ఆమాటలు విన్న దంబుడు కులద్విజుణ్ణి సంహరించాడు. వేదవతీ తండ్రి అకాలమరణానికి చింతించి, పితృదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది. . తండ్రి దీవెన ఫలించాలని భావించుకొంది. శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం తపస్సు చేసింది.
మరొకవైపు నాలుగు తలలున్న బ్రహ్మను మెప్పించి, మూడు కన్నులున్న శివుని ఒప్పించి దశకంఠుడు(రావణుడు) వరాలు, విభూతులు పొందాడు. దేవతల రాజైన ఇంద్రుడిని జయించాడు. కుబేరుణ్ణి దోచుకొన్నాడు. అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు. లంకాధిపతి నిరంతరం పుష్పకవిమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలలో మునులకు తపోభంగం, బలవంతులకు ప్రాణభంగం, పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు. ఇలా రాక్షస వినోదం అనుభవిస్తూన్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి వేదవతి కనిపించింది. వెంటనే రావణుని పుష్పకవిమానం వేదవతి ఆశ్రమంలో నిలచింది.
“ఇది నిర్జన పర్వత ప్రాంతం. నావంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్యదేవతవు నీవు. నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు? నీవు కుమారివా? శ్రీమతివా? నీ తల్లి తండ్రులెవరు? నీ చరిత్ర....ఏంటి” అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
"నేను ఒంటరి కన్యను, నాతండ్రి కులద్విజుడు. నా పితృదేవుని వేదగానంలో జన్మించాను. నాపేరు వేదవతి, తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు. అ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను" అని వేదవతి సమాధానం ఇచ్చింది.
అయితే దయచూపని శ్రీపతి కోసం, శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం అవివేకం. నిన్నుగాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించడం నీకు సర్వదా శ్రేయస్కరం. అదే వివేకవంతమైన నిర్ణయం"అన్నాడు రావణుడు.
'నీవు శ్రీహరిని నిందించడం నేను సహించను. శ్రీపతి లోకాధిపతి. నీవు కేవలం లంకాధిపతివి. శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అనర్హుడవు. నీవు వచ్చిన దారినే వెళ్ళడం నీవు చేయవలసిన పని. తక్షణం నీవు వెళ్లిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను" అంటూ వేదవతి రావణుని మందలించింది.
అవమానభారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకుని తనకుడిచేతిని కత్తిగా మార్చుకొని రావణుడు బిగపట్టిన తన తలవెంట్రుకలను ఖండించింది. వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు. తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపోమహిమతో రావణుని నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది. అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు.
"నేను అబలను. నాకు తపోభంగం కలిగించావు. నన్ను మానభంగానికి గురిచేయాలని చూస్తున్నావు. నావంటి అబల మూలంగానే మహా బలవంతుడివైన నీకు ప్రాణభంగం కలుగుతుంది. ఇది తధ్యం" అని వేదవతి కఠినంగా రావణుని శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది.
ఇదీ వేదవతి కథ..
◆నిశ్శబ్ద.