ప్రజల కోసం తపించిన పృథు చక్రవర్తి

Pruthu Chakravarty

 

పృథు చక్రవర్తి జననం చిత్రంగా ఉంటుంది. పృథు మామూలుగా పుట్టలేదు. వేనుడు ధర్మాన్ని తప్పి ప్రజల్ని హింసిస్తూ ఉండటంతో స్వయంగా మహర్షులే అతన్ని చంపేశారు. తీరా వధించిన తర్వాత ''అయ్యో, అతని వంశం నిర్వంశం అవుతుందే'' అని బాధపడ్డారు. తపస్సంపన్నులు గనుక వారికి అతీత శక్తులు ఉన్నాయి. అలా మునీశ్వరులు వేనుని చేతులను మధించారు. దాంతో శ్రీహరి అంశతో పురుషుడు, లక్ష్మీదేవి అంశతో స్త్రీ ఉద్భవించారు. ఆ స్త్రీ అర్చి, పురుషుడు పృథు చక్రవర్తి.

 

పృథు చక్రవర్తికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని, ఈశ్వరుడు ఖడ్గాన్ని, బ్రహ్మదేవుడు దివ్య రథాన్ని, లక్ష్మీదేవి అపార సంపదలను, సరస్వతి దివ్య హారాన్ని, పార్వతీదేవి శతచంద్ర దివ్య ఫలకాన్ని, సూర్యుడు కిరణబాణాలను, చంద్రుడు తెల్లటి గుర్రాలను, అగ్నిదేవుడు ధనుస్సును, భూదేవి దివ్య పాదుకలను, వరుణుడు శ్వేత చట్రాన్ని, పవనుడు చామరాన్ని, కుబేరుడు బంగారు ఆసనాన్ని, ఇంద్రుడు కవచ, కిరీటాల్ని, యముడు దివ్య పుష్పమాలను పృథుకి కానుకలుగా ప్రసాదించారు.

 

ఒకరోజు సనత్కుమార మహర్షి, పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు.

 

పృథు చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నాడు. ఆయన పాలనలో దేశం సస్యశ్యామలంగా ఉంది. కానీ, కొన్నాళ్ళకి విపత్తు వచ్చింది. వర్షాలు కరువై క్షామం ఏర్పడింది. నిలవ ఉన్న ధాన్యాలు కూడా అయిపోయాయి. ప్రజలు ఆకలిబాధను తట్టుకోలేక పోతున్నారు. వాళ్ళు వెళ్ళి తమ బాధను వెళ్ళబోసుకున్నారు.

 

పృథు చక్రవర్తి కళ్ళు ఆర్ద్రమయ్యాయి. భూమికి చేతులు జోడించి, "అమ్మా, భూమాతా! నువ్వు ఎందుకిలా నిరుపయోగంగా తయారయ్యావు? ఇంకెంతకాలం పంటలు పండవు? ప్రజలు ఎలా బ్రతకాలి?" అంటూ దీనంగా ప్రశ్నించాడు. అంతలోనే కోపోద్రిక్తుడయ్యాడు.

 

పృథు చక్రవర్తి ఆగ్రహానికి తట్టులోలేక భూదేవి ఆవు రూపంలో పారిపోసాగింది. పృథు చక్రవర్తి వెంబడించి పట్టుకున్నాడు. అప్పుడు భూదేవి, ''అయ్యా, పృథూ! నీ తండ్రి ఒక్కనాడూ యజ్ఞయాగాదులు చేయలేదు. కనుకనే వర్షాభావం ఏర్పడింది. నేను నిస్సారంగా మారాను..నువ్వు యజ్ఞక్రతువులు చేయిస్తూ ఉండు.. దాంతో ఎప్పుడూ దేశం సుభిక్షంగా ఉంటుంది. అదలా ఉంచి, ఇప్పుడు ఒక దూడను, ఒక దోగ్ధను ఏర్పాటు చేయి..'' అంది, గోరూపంలో ఉన్న భూమాత.

 

మనువు లేగదూడగా, పృథువు దోగ్ధగా (పాలు పితికే వ్యక్తి) పాలు పితికాడు. అంతే, తృణ, వృక్ష, వనస్పతులు, ధాతువులు సమకూరాయి. అంతేకాదు, బుద్ధి, జ్ఞానం, తేజస్సు, శక్తి, శౌర్యం అనే దివ్య శక్తులు వచ్చాయి. దాంతో భూమి సారవంతమైంది. వెంటనే వర్షాలు కూడా కురిసాయి. పంటలు సమృద్ధిగా పండి, దేశం తిరిగి సుభిక్షమయ్యింది.

 

పృథు చక్రవర్తి ధర్మపాలనలో మరెప్పుడూ ఏ సమస్యలూ ఎదురవలేదు. దేశాన్ని మరింత మెరుగుపరిచాడు. సదా ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన పృథు చక్రవర్తి ఆదర్శమూర్తిగా మిగిలిపోయాడు.

 

mythological characters of hinduism, hindu mythology and pruthu chakravarty, indian mythological story of pruthu chakravarthi, hindu mythological stories and characters, mahabharat and pruthu chakravarty, purana story of pruthu chakravarthy


More Purana Patralu - Mythological Stories