సాధకుడికి మూడు మార్గాలు!!


నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహం | 

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||


ఆశ లేని వాడు, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించినవాడు, ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువును ఉచితంగా గానీ, అనవసరంగా గానీ తీసుకోని వాడూ, అయిన సాధకుడికి తాను ఈ శరీర పోషణ కొరకు చేసిన కర్మల వలన ఎటువంటి బంధనములు, పాపములు అంటవు.

ఆత్మజ్ఞానము సంపాదించడానికి పాటుపడే సాధకుడికి ఉండవలసిన లక్షణములను వివరించాడు పరమాత్మ. అంటే ఒక విధంగా సర్వసంగపరిత్యాగి, సన్యాసి అని అనుకోవచ్చు. అటువంటి వాడికి ఏవస్తువు కావాలని ఆశ ఉండకూడదు. ఆశ లేకుండా ఉండాలంటే మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహము ముఖ్యము. తరువాత ఎవరి వద్ద నుండి ఎటువంటి వస్తువును అనవసరంగా కానీ, ఉచితంగా గానీ స్వీకరించరాదు. దీనిని అపరిగ్రహము అని అంటారు. ఎందుకంటే ఇతరుల వద్దనుండి ఏమైనా స్వీకరిస్తే దానికి బదులు తీర్చాలి లేకపోతే వారికి ఋణపడి ఉంటాము. ఆ ఋణం తీర్చడానికి మరొక జన్మ ఎత్తాలి. అందుకని ఎవరి వద్దనుండి ఏమీ తీసుకోకూడదు అని చెప్పాడు పరమాత్మ.

అటువంటి వారు చేసే కర్మలు ఎలా ఉండాలి అంటే కేవలం శరీరమును నిలుపు కోడానికి మాత్రమే కర్మలు చెయ్యాలి. అంటే జీవించడానికి సరిపడా మాత్రమే సంపాదించు కోవాలి. అంతే కానీ కూడబెట్టుకోకూడదు. అందుకే రెండు సార్లు మితంగా భోజనం చేసేవాడు. నిత్యం ఉపవాసం చేసినట్టు అని అంటారు. మానవుడు ఈ మూడు లక్షణములు కలిగి ఉండాలి. కేవలము శరీర పోషణకు మాత్రమే సంపాదించుకోవాలి. అటువంటి వాడు ఏ కర్మచేసినా చేయనట్టే లెక్క అతనికి ఆ కర్మఫలము అంటదు.

దీనిని కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఆశ లేని వాడికి ప్రాపంచిక విషయముల మీద మోహము ఉండదు. ఏదీ కావాలని కోరుకోడు. ఏదీ దాచుకోవాలని అనుకోడు. తనకు ఎంత కావాలో అంతే సంపాదించుకుంటాడు. అంటే తనది అంటూ ఏమీ ఉంచుకోకూడదు. అన్నిటినీ వదిలివెయ్యాలి. ఏ పూటకు ఆ పూట ఏది దొరికితే అది తిని జీవితం గడపాలి. మనసులో కూడా అది కావాలి, ఇది కావాలి. అది దొరికితే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనే ఆలోచనలు అంటే ఆశలు ఉండకూడదు. ఎందుకంటే వాటిని ఆశాపాశములు అన్నారు. ఆశలు పాశముల వంటివి. అవి సాధకుని బంధిస్తాయి. కాబట్టి ఎటువంటి ఆశలు మనసులోకి రానీయకూడదు. ఈ ఆశ్రమం నాది అని అనుకోవడం కూడా ఒక విధంగా ఆశపడటమే. తనది అంటూ ఏదీ లేని వాడిని మాత్రమే సన్యాసి అని అంటారు. (సర్వసంగ పరిత్యాగి అయిన భరతుడు కేవలం మానవత్వంతో ఒక జింకపిల్ల మీద వ్యామోహం పెంచుకున్న కారణంగా మరు జన్మలో జింకగా పుట్టాడు)

శరీరమును మనస్సును సాధకుడు తన స్వాధీనంలో ఉంచుకోవాలి. తాను చెప్పినట్టు శరీరము, మనస్సు వినాలి కానీ, అవి చెప్పినట్టు తాను చేయకూడదు. ఎల్లప్పుడూ మనస్సును భగవంతుని యందు లగ్నం చెయ్యాలి. అటువంటి సాధకుడు ఫలితములను ఆశించకుండా కర్మలు చేస్తాడు. అన్ని కర్మలు భగవంతుని పరంగా చేస్తాడు. ఈ శరీరము భగవంతుని ప్రసాదము. ప్రాణములు ఉన్నంత కాలము ఈ శరీరమును కాపాడటం ప్రతివ్యక్తి ధర్మం. కాబట్టి ఈ శరీరపోషణకు, శరీరం శుభ్రంగా ఉండటానికి, శరీరంలో ప్రాణములు నిలవడానికి అవసరమైన కర్మలను మాత్రమే చేస్తాడు. కాబట్టి ఆ కర్మఫలములు అతనికి అంటవు. అదే మాదిరి అతడు తన ఇంద్రియములు, మనస్సు నిగ్రహించుకుంటే అతడు చేసే కర్మలలో కరృత్వభావన ఉండదు. ఎటువంటి ఆసక్తి ఉండదు.

తరువాత లక్షణము అపరిగ్రహము. ఇక్కడ సర్వ అపరిగ్రహః అన్నాడు పరమాత్మ. అంటే ఏ కాలంలో కూడా ఎవరి వద్ద కూడా ఏదీ ఉచితంగా తీసుకోకూడదు. అంటే ఏదో ఒకటిరెండు సార్లు కాకుండా, ఈ అపరిగ్రహము ఎల్లప్పుడూ పాటించాలి అని అర్థం. ఎదుటి వాడి వద్దనుండి ఏమీ తీసుకోనప్పుడు, ఎదుటి వాళ్ల వస్తువుల మీద ఆశపడనప్పుడు, అతడు చెడు కర్మలు చేసే ప్రసక్తే లేదు. అన్నీ విహిత కర్మలే చేస్తాడు. కర్మలో అకర్మను చూస్తాడు. అందుకే అతనిని సన్యాసి అని అన్నారు. సమ్యక్ న్యాసము అంటే అన్నిటినీ దూరంగా ఉంచినవాడు, మనసును ఆత్మయందు ఉంచినవాడు. సన్యాసి అని అర్థం. (ఈ రోజుల్లో సన్యాసి అనే మాటకు అర్థమే మారి పోయింది. ఎందుకూ పనికి రాని ప్రతివాడిని సన్నాసి అని అని పిలవడం అలవాటైపోయింది.) 

అందుకె ఆత్మజ్ఞానం సంపాదించడానికి పాటుపడేవాడు పై మూడు పాటించాలి.

                              ◆ వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu