ఉపవాసం వెనుక రహస్యాలు ఇవే.!

భారతీయుల్లో చాలామంది క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటుంటారు. పండుగ రోజుల్లో కానీ, ప్రత్యేక సందర్భాల్లో కానీ ఉపవాసం ఉండడం హైందవ సంస్కృతిలో ఓ భాగం. ఉపవాసం చేసే రోజుల్లో హిందువులు సాధారణంగా ఏమీ తినరు. ఒకవేళ తిన్నా ఒంటి పూటే తింటారు. పండ్లు కానీ, సాధారణమైన అల్పాహారం కానీ భుజిస్తారు. కొంత మంది మాత్రం పగటి పూట పచ్చి మంచినీళ్ళయినా తాగకుండా ఉపవాసం ఉంటారు. అనేక కారణాల వల్ల ఉపవాసం చేయడం జరుగుతుంది. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికీ, వ్యక్తిగత క్రమశిక్షణ పెంపొందించుకోవడానికీ, చివరకు నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఉపవాసం ఉంటారు. 

ఉపవాసం అంటే?

'ఉపవాసం' అనేది సంస్కృత పదం. 'ఉప' అంటే సమీపంలో అని అర్థం. 'వాస' అంటే వసించడం, ఉండడం. కాబట్టి, 'ఉపవాసం' అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని భావం. అంటే, మానసికంగా దేవుని సామీప్యాన్ని సాధించడానికి చేసే దీక్ష.. ఇదే ఉపవాస దీక్ష. మరి దానికీ, ఆహారం భుజించకుండా ఉండడానికీ సంబంధం ఏమిటన్నది ప్రశ్న. ఎందుకంటే, ఆహార పదార్థాలను సంపాదించడంలో, సిద్ధం చేయడంలో, వండడంలో, తినడంలో, జీర్ణం చేసుకోవడంలో మనం ఎంతో సమయాన్నీ, శక్తినీ వెచ్చిస్తూ ఉంటాం. కొన్ని ఆహార పదార్థాలు మన బుద్ధిని మందగించేలా చేస్తాయి. ఆందోళన రేపుతాయి. కాబట్టి, కొన్ని ప్రత్యేక దినాల్లో తేలికపాటి ఆహారాన్ని భుజించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉంచుకోవచ్చు. సమయాన్ని ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. లేదంటే, ఎప్పుడూ ఆహారం మీదే ధ్యాస ఉండిపోతుంది. ఈ ఉపవాసం వల్ల మనస్సును మంచి ఆలోచనల వైపు మళ్ళించి, భగవత్ ధ్యానంలో గడిపే వీలు చిక్కుతుంది. ఉపవాసమనేది ఎవరికి వారు స్వయంగా ఏర్పాటు చేసుకున్న క్రమశిక్షణ కాబట్టి, ఆనందంగా ఉపవాసం చేస్తుంటారు.

పైపెచ్చు, ఏ వ్యవస్థకైనా కొద్దిపాటి విశ్రాంతి అవసరం. అది బాగా పనిచేయాలంటే, మధ్య మధ్యలో పూర్తిగా ప్రక్షాళన చేయాలి. రోజూ తినే ఆహారాన్ని మార్చడం ద్వారా ఉపవాస సమయంలో జీర్ణవ్యవస్థకూ, మొత్తం శరీరానికీ కొంత విశ్రాంతినిచ్చినట్లు అవుతుంది. అది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

ఇంద్రియాలపై అదుపు లేకుండా కోరికల వెంట పరుగులు తీస్తూ ఉన్నంత కాలం మానవుడికి ఇబ్బందే. ఒక కోరిక తీరితే, మరో కోరిక పుడుతుంటుంది. మనం క్రమంగా ఇంద్రియాలపై నియంత్రణను పెంపొందించుకోవడానికి ఉపవాస దీక్ష తొలి మెట్టు. ఉపవాసం వల్ల మనం కోరికలను అదుపులో ఉంచుకోవడమే కాక, మనస్సును ప్రశాంత స్థితికి తెచ్చుకోగలగడానికి వీలుంటుంది.

అయితే, ఏదో మొక్కుబడిగా ఉపవాసం చేయకూడదు. 'ఎందుకొచ్చిన తిప్పలురా భగవంతుడా' అనుకుంటూ చేయకూడదు. ఉపవాసం పేరు చెబుతూ, రోజూ కన్నా మరింత ఎక్కువ పండ్లు, ఫలహారాలు తినకూడదు. ఉపవాసం వెనుక నిజాయతీతో కూడిన లక్ష్యం లేనప్పుడే ఇలా వ్యవహరిస్తాం. కొంతమంది కేవలం బరువు తగ్గడం కోసమే ఉపవాసం చేస్తుంటారు. మరికొంతమంది భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం, కొందరేమో కృతనిశ్చయాన్ని పెంపొందించుకోవడం కోసం, మరి కొందరేమో ఇంద్రియ నిగ్రహం కోసం ఉపవాస దీక్ష బూనుతారు. ఎలా చేసినా ఫలితం అయితే ఉంటుంది.


                                        *నిశ్శబ్ద.
 


More Aacharalu