లక్ష్మీదేవిని శుక్రవారమే ఎందుకు పూజిస్తారు?

లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజులలో లక్ష్మీదేవిని ప్రార్థించి, ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజు పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఈనాడు మానవులే కాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారని అనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి.

అసలు శుక్రవారమే లక్ష్మీదేవి పూజకు అనుకూలమైన దినంగా ఎందుకు పేరు  వచ్చింది ?
 రాక్షసులు కూడా ఆరోజే లక్ష్మీదేవిని ఎందుకు పూజించేవారు?
అందులోన రాక్షస సంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు కొలవడమేమిటి?

ఈ సందేహాలన్నీ వస్తాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుల పేరు మీదగానే శుక్రవారం అనే పేరు వచ్చిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగు మహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతీకరమైనది.

లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్టు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కుగాగా చిత్రీకరిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్టు చూపుతారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలలో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతోకానీ, విష్ణుమూర్తిని ధరిచేరలేరు. లక్ష్మీ ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.


More Lakshmi Devi