ధన త్రయోదశి - శ్రీ మహాలక్ష్మి జన్మదినం

 


 

దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.

 

ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.

 

అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది. ఆ 2014 లో వృషభలగ్నం రాత్రి 7-17 నుంచి 9-17 వరకూ ఉంది. కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఏది ఏమైనా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి., శ్రీమహాలక్ష్మి  జన్మ దినాన్ని భక్తులందరూ ఒక పండుగలా జరుపుకుంటారని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.

 

- యం.వి.యస్. సుబ్రహ్మణ్యం

 

 


More Lakshmi Devi