లక్ష్మీదేవికి వీటిని సమర్పిస్తే ఐశ్వర్యానికి లోటు ఉండదు..!
లక్ష్మీదేవి హిందూ సంప్రదాయంలో ప్రధానంగా పూజించే దేవత. లక్ష్మీ అనగానే ధనం అని అనుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉండాలని అనుకునే వారు లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. అయితే పూజలు చేయడంతో పాటు కొన్నింటిని లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదని, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని అంటున్నారు. ఇంతకీ లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏం సమర్పించాలంటే..
పూజ..
లక్ష్మీదేవి శుభ్రత ఉన్న ఇంట్లో నివాసం ఉండటానికి ఇష్టపడుతుంది. ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసుకుని ఉదయాన్నే స్నానం చేసే ఇల్లంటే లక్ష్మీ దేవికి ఇష్టం. అలాంటి ఇంట్లో చేసే పూజలు, వ్రతాలకు లక్ష్మీ దేవి మాత్రమే కాకుండా అందరు దేవుళ్లు తొందరగా సంతోషించి ప్రసన్నులవుతారు. ఈ పూజలతో పాటు లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని సమర్పిస్తే ఐశ్వర్యం సిద్దిస్తుంది.
తామర గింజల మాల..
తామర పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తామ పువ్వులనే కాకుండా తామర విత్తనాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. తామర గింజలను మాలగా కూర్చి అమ్ముతుంటారు. తామర గింజల మాలను లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. జీవితంలో సంతోషం, ఆనందం, శాంతి మొదలైనవాటిని ప్రసాదిస్తుంది.
ఎవరి జీవితంలో అయితే పురోగతి లేకుండా ఎలాంటి ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుందో.. అలాంటి వారు తామర గింజల హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేస్తే జీవితంలో ఆర్థిక రాబడి కోసం అవకాశాలు పెరుగుతాయి. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి.
పనులలో విజయం సాధించాలని అనుకునేవారు కూడా ఈ విధంగా చెయ్యవచ్చు. తామర గింజల హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల చేయబోయే పనులకు లైన్ క్లియర్ అవుతుంది.
లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజల మాలను అమ్మవారికి సమర్పించడమే కాకుండా ఆ తామరగింజల మాలతో లక్ష్మీదేవి జపం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తామర గింజల మాలను సమర్పించడంతో పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఎర్రటి గుడ్డలో నాణేలు పెట్టి దానిని మూటగా కట్టి అమ్మవారికి సమర్పించవచ్చు.
కర్పూరం..
లక్ష్మీదేవికి పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ శుక్రవారం పూజ సమయంలో పచ్చ కర్పూరాన్ని అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఉదయం లేదా సాయంత్రం పూజలో ఎప్పుడైనా చేయవచ్చు.
కలకండ..
కలకండ అంటే పటిక బెల్లం లేదా మిశ్రి అని కూడా అంటారు. సాధారణంగా ఇంట్లో పూజలో దేవుడి నైవేద్యంగా బెల్లం ముక్కను ఉంచుతారు. కానీ లక్ష్మీదేవి పూజలో కలకండ ముక్కను నైవేద్యంగా ఉంచాలి. లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది.
*రూపశ్రీ.
