దీపం లక్ష్మీదేవిరూపం

దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః

 

దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే...అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు.... మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి  పండుగేకదా!

ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే....ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు. దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు. జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. అమ్మవారి పూజలో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం ఉంచరాదు.


More Lakshmi Devi