ఆ కుండంలో నీరు నల్లబడితే... కశ్మీర్ అగ్నిగుండమే!

 

 

ఖీర్ భవానీ! దక్షిణ భారతదేశంలో చాలా తక్కువమందికి పరిచయమైన పేరు. కానీ కశ్మీర్వాసులకు మాత్రం ఈమె చల్లగా చూసుకునే అమ్మవారి స్వరూపం. ఇంతకీ ఈ ఖీర్ భవానీ మాత కథ ఏమిటి? ఆమె ఆలయం ఎక్కడ ఉంది? అని అడిగితే ఆసక్తికరమైన జవాబులు చాలానే వినిపిస్తాయి.

కశ్మీర్ రాజధాని శ్రీనగర్ సమీపంలో తుల్ముల్ అనే గ్రామం ఉంది. ‘అతుల్య మూల్య’ అనే సంస్కృత పదాల నుంచి ఆ పేరు వచ్చిందట. అంటే ‘వెలగట్టలేని విలువైన ప్రదేశం’ అని అర్థం. ఈ గ్రామంలో ఉన్న ఓ కుండం వల్లే ఆ పేరు వచ్చింది. ఆ కుండం సాక్షాత్తూ అమ్మవారి స్వరూపం అని భక్తులు విశ్వాసం. అందుకనే ఆ కుండంలో పాలు, బియ్యంతో చేసే పరమాన్నాన్ని (ఖీర్) నివేదించడం ఆచారంగా వస్తుండేది. భక్తులు విచ్చలవిడిగా వేసే పరమాన్నంతో కుండంలోని జలం కలుషితం కావడంతో... ఇప్పుడు తమ ప్రసాదాలని కుండం మధ్యలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి నివేదిస్తున్నారు. ఇంతకీ ఆ కుండం మధ్యలో నెలకొల్పిన అమ్మవారి గురించి కూడా ఓ గాథ ప్రచారంలో ఉంది.

రాములవారు అరణ్యవాసం  చేసే సందర్భంలో అమ్మవారిని కొలుచుకునేవారట. అరణ్యవాసం పూర్తయిన తర్వాత తను కొలుచుకునే అమ్మవారి విగ్రహాన్ని ఉత్తరాదికి తరలించమంటూ ఆంజనేయుని కోరారట. అలా అమ్మవారి విగ్రహాన్ని కశ్మీర్లోని ‘షాదీపోరా’ అనే గ్రామంలో ప్రతిష్టించాడట ఆంజనేయుడు. ఆ తరువాత అమ్మవారు ఆలయపూజారి కలలో కనపడి, తనను తుల్ముల్ గ్రామంలోని కుండం మధ్యలో ప్రతిష్టించమని కోరడంతో... ప్రస్తుతానికి ఆమె నివాసం తుల్ముల్లో స్థిరమైంది. అలా ఒక పక్క అమ్మవారుగా భావించుకునే కుండమూ, ఆ కుండం మధ్యలో సాక్షాత్తూ అమ్మవారి రూపమూ భక్తులకు కన్నులపండుగగా తోస్తాయి.

 

 

తుల్ముల్లో ఉండే కుండం మహిమో మరేమో కానీ, అక్కడ నివసించే పండితులు కూడా అతీతశక్తులకు కలిగి ఉండేవారట. 12వ శతాబ్దంలో కల్హణుడు రాసిన రాజతరంగిణిలో సైతం ఇక్కడి అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. రానురానూ ముష్కరుల దాడిలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాలన్నీ ధ్వంసమైపోయాయి. అయినా కుండాన్నే అమ్మవారిగా భావించే భక్తులు ఎక్కడెక్కడినుంచో ఇక్కడకు తీర్థయాత్ర చేసేవారు. స్వామీ రామతీర్థ, వివేకానంద వంటి ప్రముఖుల సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులను పొందినవారే!

20వ శతాబ్దపు ఆరంభంలో కశ్మీరుని పాలించిన మహారాజా ప్రతాప్సింగ్, మహారాజా హరిసింగ్లు... తుల్ముల్ కుండం మధ్యలో అమ్మవారికి మరోసారి చక్కటి ఆలయాన్ని నిర్మించారు. కానీ ఈసారి ఆమెను కొలుచుకునేందుకు భక్తులే లేకుండాపోయారు. స్వాతంత్ర్యానంతరం పాకిస్తాన్ ప్రోద్బలంతో కశ్మీర్లో ఉండే కశ్మీరీ పండిట్లను వెళ్లగొట్టడం మొదలైంది. తరతరాలుగా జన్మించిన చోటే వారికి రక్షణ లేకుండా పోయింది. దాంతో ఖీర్భవానీ అమ్మవారిని కొలుచుకునే అదృష్టానికి భక్తులు దూరమయ్యారు.

 

 

ఇప్పటికీ ఏటా జ్యేష్ఠ శుద్ధ అష్టమినాడు అమ్మవారికి జరిగే ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎక్కడెక్కడో ఉన్న కశ్మీరీపండితులంతా తుల్ముల్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడి కుండానికీ, ఆ కుండం మధ్యలో ఉన్న అమ్మవారికీ తమ బాధలు చెప్పుకొంటారు. ఆ రోజున ఈ కుండంలోని నీరు రంగు మారుతుందని చెబుతారు. ఒకవేళ కుండంలోని నీరు నల్లటి నలుపులో కనిపిస్తే మాత్రం కశ్మీరులో అరిష్టం తప్పదని నమ్ముతారు. 1990లో ఆ కుండంలోని నీరు నల్లటి నలుపు రంగులోకి మారిందట. అప్పటినుంచే కశ్మీర్ పండిట్లకు కష్టాలు మొదలయ్యాయి. అందుకే ఈ ఏడాది ఎలాంటి అవాంతరమూ లేకుండా చల్లగా చూడమంటూ ఏటా భక్తులు అమ్మవారిని వేడుకుంటారు. ఈ ఏడాది ఉత్సవాలలో కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఇక్కడి అమ్మవారిని దర్శించి రాష్ట్రం చల్లగా ఉండేలా చూడమని పూజలు నిర్వహించారు. ఆ పూజలు ఫలించాలనే కోరుకుందాం.

- నిర్జర.


 

 


More Purana Patralu - Mythological Stories